గగన్‌యాన్‌ మిషన్‌లో అంతరిక్షంలోకి మహిళా రోబో.. వ్యోమిత్ర గురించి మీకు తెలుసా?

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావడంతో ఇస్రో ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ కూడా కాలు మోపని ప్రదేశంలో ఇస్రో తన మిషన్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ ప్రయోగం అందించిన ఉత్సాహంతో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది ఇస్రో. ఆ ప్రయోగమే గగన్‌యాన్. ఈ గగన్‌యాన్‌ మిషన్‌ను అతిత్వరలో ప్రయోగించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

అయితే తాజాగా.. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గగన్‌యాన్‌ ప్రయోగం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా మహిళా రోబో ‘వ్యోమిత్ర’ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రోబో మనిషి లాగే అన్ని పనులను నిర్వహించగలదని చెప్పారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే తర్వాతి ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారంలో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌ను ఇస్రో చేపట్టనుందని కేంద్రమంత్రి తెలిపారు.