రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశంసల వర్షం

vizag-karidarశాఖపట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడార్ మరింత వేగంగా పూర్తికానుంది. ఈ పారిశ్రామిక కారిడార్‌ కోసం రూ. 3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) అంగీకరించింది. మంగళవారం విజయవాడ సీఎంవోలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడుని కలిసిన ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇండియా ప్రతినిధి బృందం విశాఖపట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఏడీబీ ప్రతినిధి బృందం కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఇప్పటివరకు రుణసాయంపై దశలవారీగా తాము తీసుకున్న చర్యలను ఏడీబీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభించడంపై ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టెరెసా ఖో సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు, రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిపై టెరెసా ఖో ప్రశంసలు కురిపించారు. గ్రామీణ రహదారులు, తాగునీరు, పోర్టుల అనుసంధానం, రవాణా, విద్యుచ్ఛక్తి, అర్బన్ ప్లానింగ్ తదితర రంగాల్లో రుణం ఇచ్చేందుకు ఆసక్తి కనబరిచారు.

ప్రపంచవ్యాప్తంగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలో కూడా ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఏడీబీ ప్రతినిధుల బృందాన్ని కోరారు. ప్రభుత్వ సహకారంతో శ్రీసిటీ పరిశ్రమలతో కళకళలాడుతోందని, మౌలిక వసతుల కల్పన పూర్తయితే విశాఖపట్టణం –చెన్నై పారిశ్రామిక కారిడార్ కూడా పరిశ్రమల ఏర్పాటుతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వివిధ రంగాలను ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు గుర్తించి ప్రాజెక్ట్ రిపోర్టులను రూపొందిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై స్పందించిన ఏడీబీ ప్రతినిధులు ఆయా రంగాల్లో ప్రాజెక్టులను స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు రుణాలు అందిస్తామని ప్రకటించారు.

ఈ సమావేశంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్, ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో కృష్ణ కిషోర్, ఏడీబీ ప్రతినిధులు జార్జ్, అనిల్ కె మొత్వాని పాల్గొన్నారు.