రివ్యూ : ఆకాశం నీ హద్దురా.. సింప్లీ ఫ్లై

నటీ నటులు : సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు, పరేష్‌ రావల్‌, ఊర్వశి తదితరులు
సంగీతం:  జీవీ ప్రకాశ్‌ కుమార్‌
ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి
ఎడిటర్‌: సతీష్‌ సూర్య
స్క్రీన్‌ ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర
కథ, దర్శకత్వం: సుధ కొంగర
నిర్మాత: సూర్య

తెలుగు మిర్చి రేటింగ్ : 3/ 5 

ప్రేక్షకులని మరో బబయోపిక్ పలకరించింది. అదే ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితంలోని అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సూర్య  చేసిన మొదటి బయోపిక్ కావడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. మరి సినిమా ఎలా వుందో ఓసారి  చూద్దాం. 

కథ: చుండూరు  ఓ మారుమూల గ్రామం. అక్కడ రైలు బండి కూడా ఆగ‌దు. అలాంటి ఊరి ప్రజ‌ల్ని విమానం ఎక్కిస్తాన‌ని శ‌ప‌థం చేస్తాడు మ‌హా అనే.. చంద్రమ‌హేష్ (సూర్య). ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం వ‌దిలి… ఎయిర్ డ‌క్కన్ అనే సంస్థని స్థాపించాల‌ని క‌ల‌లు కంటాడు. రైలు ప్రయాణ ఛార్జీల‌కే.. విమాన ప్రయాణ సౌక‌ర్యాన్ని ప్రజ‌ల‌కు అందించాల‌ని ప్రయ‌త్నిస్తాడు. కానీ… మ‌హా వెనుక ఎలాంటి అండ‌దండ‌లు లేవు. డ‌బ్బు లేదు. అధికారుల స‌హాయం లేదు. పైగా… ఈ వ్యాపారంలో పాతుకుపోయిన ప‌రేష్ (ప‌రేష్ రావ‌ల్‌) జిత్తుల మారి తెలివితేట‌ల ముందు.. మ‌హా బోల్తా కొడుతూనే ఉంటాడు. కానీ.. మ‌న‌సు మాత్రం గాల్లో ఎగురుతుంటుంది.  మ‌రి.. చంద్రమ‌హేష్ ఏం చేశాడు? చివ‌రికి త‌న విమానాన్ని ఎలా ఎగ‌ర‌వేశాడు? ఇవ‌న్నీ తెర‌పైనే చూడాలి.

ఎలా వుంది ?

 ‘ఆకాశం నీ హద్దురా’తో దర్శకురాలు సుధ కొంగర మంచి  ప్రయత్నమే చేశారు. కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం పల్లెటూరు నుంచి విమాన సంస్థ అధిపతిగా ఎదిగిన క్రమం చూపించిన విధానం బాగుంది.  వినోదం, కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన అంశాలు జోడించడం బావుంది. కథను సూటిగా ఒకే ఫ్లోలో చెప్పకుండా, ముందుకు వెనక్కి మార్చి… బోర్‌ కొట్టకుండా చూసుకున్నారు దర్శకురాలు. ప్రథమార్ధంలో పాటలు, వినోదంతో కథను ముందుకు నడిపించారు. ద్వితీయార్ధంలోకి వచ్చేసరికి విమానయాన సంస్థ ఏర్పాటు కోసం హీరో పడ్డ కష్టాలు, దానిని అధిగమించిన విధానం కూడా బావుంది.

ఎవరెలా చేశారు ?  
 సూర్య నటన ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. నటుడిగా మరో పది మెట్లు ఎక్కాడు.  విమానయాన సంస్థ పెట్టడానికి ప్రయత్నించే యువకుడిగా సూర్య నటన  అద్భుతం . ఇక భర్త మనసును అర్థం చేసుకొని, అతని ఉన్నతిని కాంక్షించే భార్యగా అపర్ణ చక్కగా నటించింది. భక్తవత్సలం నాయుడు పాత్రలో మోహన్‌బాబు తనదైన శైలిలో నటించారు.విలన్‌గా పరేశ్‌ రావల్‌ మంచి నటనను కనబరిచారు. సూర్య తల్లి పాత్రలో ఊర్వశి, ఇతర నటీనటులు పాత్ర పరిధి మేరకు  కనిపించారు. 

టెక్నికల్ గా .. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం బాగుంది.కెమెరామెన్‌ నికేత్‌ చక్కగా సన్నివేశాల్ని కెమెరాలో బంధించాడు. జీవిత కథను సినిమాగా తీసుకురావడంలో సుధ కొంగర, షాలిని ఉషాదేవి సఫలీకృతులైనట్లుగా చెప్పుకోవచ్చు. నిజ జీవిత కథకు సినిమాటిక్‌ ఫిక్షన్‌ జోడించాం అని చిత్రబృందం చెప్పేసింది. ఆ ఫిక్షన్‌ జోడింపు సమపాళ్లలో ఉండేలా చూసుకున్నారు దర్శకురాలు. సూర్య లాంటి పెద్ద స్టార్‌ను హ్యాండిల్‌ చేయడంలోనూ ఆమె విజయం సాధించారనే చెప్పాలి.  నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా .. విమానం ఎగిరింది