రివ్యూ : యాక్షన్ త్రీడీ

Action-3d-movie-review-rating

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5 | Click here for English Review

  రియాక్షన్ ఇచ్చింది యాక్షన్‌..!

అరిటాకు అమ‌లాపురం అయితే ఏంటి? ఫ్రమ్ అమెరికా అయితే ఏంటి? విస్తరిలో వ‌డ్డించే వంట‌కానికి రుచి ఉండాలి. గిఫ్ట్ ప్యాక్ ఎంత క‌ల‌ర్‌ ఫుల్‌ గా ఉంటే ఏం లాభం? లోప‌లంతా ప‌నికి రాని చెత్తతో నింపేసిన‌ప్పుడు? కానీ మ‌న సినిమా వాళ్లు విస్తరికీ, పైపై మెరుగుల‌పై పెట్టిన శ్రద్ధ – అస‌లు స‌రుకుమీద పెట్టడం లేదు. దాంతో – డెక‌రేష‌న్ ఎక్కువ ఇన్ఫర్మేష‌న్ త‌క్కువ అన్నట్టు త‌యారువుతున్నాయి కొన్ని సినిమాలు. సినిమా అంతా క‌ల‌ర్‌ ఫుల్‌ గా ఉంటుంది, మ‌న‌కు న‌చ్చే న‌టీన‌టులంతా తెర‌పై క‌నిపిస్తారు, ఆ సినిమా కోసం బోలెడంత ఖర్చుపెడ‌తారు… తీరా సినిమాలో ఏమీ ఉండ‌దు! పెళ్లికి చుట్టాలంతా వ‌చ్చి, ఫొటోలు – వీడియోలూ, త‌లంబ్రాలూ, తాళిబొట్టు ఇవ‌న్నీ ఉండి… పెళ్లి కూతురు మిస్ అయిన‌ట్టు… ఏదో ఓ ఫీల్ మిస్ అయిపోతోంది సినిమాలో. అలాంటి సినిమాలు ఎలా ఉంటాయో చెప్పడానికొచ్చిన మ‌(పు)చ్చు తున‌క‌… యాక్షన్ త్రీడీ.

ఇది ఓ న‌లుగురు స్నేహితుల క‌థ‌. బావ (అల్లరి న‌రేష్‌), శివ (వైభ‌వ్), పురుష్ (రాజు సుంద‌రం), అజ‌య్ (కిక్ శ్యామ్‌) న‌లుగురూ చిన్నప్పటి నుంచీ దోస్తులు. అజ‌య్ పెళ్లి కుదురుతుంది. దాంతో బ్యాచిల‌ర్ పార్టీ కోసం హైద‌రాబాద్ నుంచి గోవా బ‌య‌లు దేర‌తారు. బావ.. డ‌బ్బు మ‌నిషి. అడ్డదారుల్లో ల‌క్షలు, కోట్లు సంపాదించాల‌నుకొంటాడు. దానికీ ఓ కార‌ణం ఉంటుంది. తండ్రి ఓ హోట‌ల్‌ కి య‌జ‌మాని. ఆయ‌న్ని స్నేహితులు మోసం చేసి.. ఆ హోట‌ల్ని త‌మ పేర రాయించుకొంటారు. ఆ బాధ‌లో తండ్రి చ‌నిపోతాడు. ఎలాగైనా ఆ హోట‌ల్ ద‌క్కించుకోవాల‌నుకొంటాడు.. బావ‌. అయితే దాని కోసం కోటి రూపాయ‌లు కావాలి. అందుకే.. పందాలు కాసి డ‌బ్బులు పోగేయాల‌నుకొంటాడు. శివ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. త‌న‌నే పెళ్లి చేసుకోవాల‌నుకొంటాడు. ఇక‌.. పుర‌ష్ జ‌ల్సా రాయుడు. వీళ్లంతా గోవాలో ఫుల్‌ గా మందు కొడ‌తారు. అయితే పొద్దుట లేచి చూస్తే… అంతా గంద‌ర‌గోళంగా క‌నిపిస్తుంది. వారి హోట‌ల్ గ‌దిలో ఓ పులి వ‌స్తుంది. ఓ పిల్లవాడు, కోడి కూడా ఉంటాయి. అయితే అజ‌య్ మాత్రం క‌నిపించ‌డు. మరి అజ‌య్ ఏమ‌య్యాడు? ఇంత‌కీ పులి ఎలా వ‌చ్చింది? అస‌లింత‌కీ ఆ రాత్రి ఏం జ‌రిగింది? అన్నదే ఈ సినిమా క‌థ‌.

హాలీవుడ్ సినిమా హ్యాంగోవ‌ర్ సినిమాకి కాపీ… ఈ యాక్షన్. గోవాలో మందుకొట్టిన రాత్రి జ‌రిగిన గంద‌ర‌గోళం అంతా.. హ్యాంగోవ‌ర్ సినిమా నుంచి ఎత్తేసిన‌దే. అయితే దానికి ముందు స‌న్నివేశాల కోసం మాత్రం పెన్ను క‌దిలించారు మ‌న‌వాళ్లు. హీరో సునీల్‌ కి క‌థ చెబుదామ‌ని వెళ్తాడు.. పోసాని కృష్ణముర‌ళి. నువ్వు నాకు క‌థ చెప్పడం ఏమిటి? నా ద‌గ్గరే ఓ క‌థ ఉంది.. అని ఈ న‌లుగురు స్నేహితుల క‌థ చెబుతాడు… సునీల్. ఆ ఎత్తుగ‌డ బాగానే ఉన్నా.. అది కూడా – ‘అలా మొద‌లైంది’ సినిమా టైపే! నిజానికి ఇదేదో  స్ర్కీన్ ప్లే టెక్నిక్ అని ద‌ర్శకుడు చంక‌లు గుద్దుకొని ఉంటాడు గానీ – స్ట్రయిట్ నేరేషన్‌ లో క‌థ చెప్పినా స‌రిపోయేది. గోవా ప్రయాణం, దారిలో చిలిపి పనులు – మ‌ధ్య మ‌ధ్యలో త్రీడీ ఎఫెక్టుల‌తో టేకాఫ్ ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. సంభాష‌ణ‌ల ర‌చ‌యిత కూడా పెన్నుకు పని క‌ల్పించ‌డంతో అక్కడ‌క్కడా  కొన్ని జోకులు వ‌స్తాయి. అయితే చింపాంజీ ఎపిసోడ్ చిన్నప్పటి నుంచీ న‌లిగిన‌దే. మ‌ళ్లీ దాన్ని ఇక్కడ వాడుకోవ‌డం – ర‌చ‌యిత‌ల జ్ఞాప‌క శ‌క్తికి నిద‌ర్శనం. మూడు వేల బిల్లు కోసం – హోట‌ల్ య‌జమానులు సుమోల‌తో ఛేజింగులు చేస్తూ, బాంబులు విస‌ర‌డం మ‌హా భ‌యంక‌ర‌మైన కామెడీ.

హ్యాంగోవ‌ర్ స్ర్కీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా. ఏ పాత్ర చేత‌ ఎప్పుడు ఎంట్రీ చేయించాలో, ఎప్పుడు ఎగ్జిట్ ఇప్పించాలో క‌రెక్ట్ గా చేయించారు. కానీ ఇక్కడ మాత్రం అనిల్ సుంక‌ర స్ర్కీన్ ప్లే తేలిపోయింది. తెర నిండా క్యారెక్ట‌ ర్లే. అందుకే గంద‌ర‌గోళంలా త‌యారైంది. సెకండాఫ్‌ లో – మందుతాగిన మిత్రులు గంద‌ర‌గోళంలో ప‌డాలి. కానీ ప్రేక్షకులు ప‌డ‌తారు. కార‌ణం.. స్ర్కీన్ ప్లే లో లోప‌మే! హ్యాంగోవ‌ర్ కాపీ కూడా స‌వ్యంగా సాగ‌లేదు. సుదీప్ ఎపిసోడ్‌, చ‌ర్చలో పెళ్లి, అలీ, బ్రహ్మానందం క్యారెక్టర్ – ఇదంతా క‌థ‌కు చాలా కీల‌కం. అయితే వాటిని సోసోగా తీసి – మ‌మ అనిపించాడు ద‌ర్శకుడు. హ్యాంగోవ‌ర్ చూసిన వాళ్లకు సెకండాఫ్ ఏమాత్రం రుచించ‌దు.

ఎమ్మెస్ నారాయ‌ణ‌తో – దూకుడు త‌ర‌హా వినోదం పండించాల‌ని దర్శకుడు తెగ తాప‌త్రయ‌ప‌డ్డాడు. ఎమ్మెస్ చేత మ‌హేష్‌, ప‌వ‌న్‌, సిద్దార్థ్ గెట‌ప్పులు వేయించాడు. కానీ ఒకే మ్యాజిక్ అన్నిసార్లూ జ‌ర‌గ‌డం సాధ్యం కాదు. దాంతో.. ఎమ్మెస్ పాత్ర కూడా తుస్సు మంది. ఏవైతే ఈ సినిమాకి ప్లస్‌గా  కావాల‌నుకొన్నాడో అవ‌న్నీ మైన‌స్సులుగా మారిపోయాయి.

న‌రేష్ టైమింగ్ ఎప్పట్లా బాగున్నా, గెట‌ప్ మాత్రం అస్సలు సూట్ కాలేదు. ఎప్పుడూ ఒకేలా క‌నిపిస్తున్నా.. అని హెయిర్ స్టైల్ మార్చాడు. అది చూడ‌డం కొంచెం క‌ష్టమే. కిక్ శ్యామ్‌ కి అంత సీన్ లేదు. సెకండాఫ్‌ లో ఆ పాత్ర క‌నిపించ‌దు. వైభ‌వ్ ఓకే. రాజుసుంద‌రం చేతే ఎక్కువ పంచ్‌ లు వేయించారు. న‌లుగురు క‌థానాయిక‌లు ఉన్నా – ఒక్కరి పాత్ర మొత్తం నిడివి ఒక్క మిమిషం కూడా ఉండ‌దేమో? స్నేహా ఉల్లాల్ ప‌బ్ డాన్సర్ అవ‌తారంలో కనిపిస్తుంది. స్వాతి ముత్యపు జ‌ల్లులో రీమిక్స్ బాగా కుదిరింది. రాఘ‌వేంద్రరావు స్టైల్ పాట కూడా ఒకే. అంత‌కు మించి సంగీతంలో మెరుప్పుల్లేవు. ఆర్‌.ఆర్‌.. అధ్వాన్నం అంటే న‌మ్మండి. త్రీడీ ఎఫెక్టులు మాత్రం కొంత అల‌రిస్తాయి. మ‌నం కూడా త్రీడీ సినిమాలు తీయ‌గ‌లం అని నిరూపించుకోవ‌డానికే ఈ సినిమా తీసిన‌ట్టుంది.

త్రీడీ సినిమా తెలుగులో చూడాల‌నుకొంటున్నవాళ్లు నిర‌భ్యంత‌రంగా ఈ సినిమాకు వెళ్లొచ్చు. అయితే సినిమాకు కావ‌ల్సింది టెక్నికాలిటీ ఒక్కటే కాదు. ప్రేక్షకుల రెండున్నర గంట‌ల కాలానికి స‌రైన విలువ కూడా ఇవ్వాలి. న‌రేష్ సినిమాల‌కు న‌వ్వుకోవ‌డానికి మాత్రమే వెళ్తారు. త్రీడీ హంగులు చూడ్డానికి కాదు. అయితే అది మాత్రం సంపూర్ణంగా ఇవ్వలేకపోయ‌డు ద‌ర్శకుడు. దేవుడు ఎదురై వ‌రం ఇవ్వకుండా ప్రసాదం మాత్రమే ఇచ్చి తుర్రుమంటే – దేవుడే రావాలా? పూజారి స‌రిపోతాడు క‌దా? ఈ మాత్రం దానికి ఇంత హంగు అవ‌స‌ర‌మా? అనిపిస్తే అది ప్రేక్షకుల త‌ప్పు కానే కాదు.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5-స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version