రివ్యూ: అడ‌వి కాచిన వెన్నెల‌

adavi

                                          |Click here for English Review|

మండు టెండ‌లా..అడ‌వి కాచిన వెన్నెల‌’ : తెలుగుమిర్చి రేటింగ్ :  2/5

చిత్ర‌సీమ‌లో రెండు జాడ్యాలున్నాయి. ఒక‌టి.. చాలామంది కొత్త‌గా ఆలోచించ‌డం లేదు. ఇంకొంత‌మంది ఆలోచిస్తారు గానీ.. దాన్ని తెర‌పై చూపించలేరు. కొత్త పాయింట్‌ని ఎత్తుకొని – ఎలా చెప్పాలో, ఎలా ముగించాలో తెలియ‌క మ‌ధ్య‌లోనే హ్యాండ్స‌ప‌యిపోతారు. ఇప్పుడొచ్చిన అడ‌వి కాచిన వెన్నెల సినిమాదీ అదే ప‌రిస్థితి. నిధుల అన్వేష‌ణ నేప‌థ్యంలో చాలా చిత్రాలొచ్చాయి. ఇదీ అలాంటి క‌థే. కాక‌పోతే.. పాత సినిమాల ఛాయిలో క‌థ అల్లుకోకుండా.. కాస్త కొత్త‌గా ఆలోచించాడు ద‌ర్శ‌కుడు. కానీ దాన్ని ప్ర‌జెంట్ చేయ‌డం అర్థం కాక‌.. గింగిరాలు తిరుగుతూ.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర బొక్క బోర్లా పడ్డాడు. ఆ క‌థ‌నం ఎట్టిద‌నిన‌..

అర‌వింద్ (అర‌వింద్ కృష్ణ‌)కి అద్భుత‌మైన శ‌క్తి ఉంది. భూమి లోప‌ల దాగున్న ఖ‌నిజాలు, నిధుల గురించి అత‌నికి తెలుస్తుంటుంది. ఎక్క‌డ త‌వ్వితే… అక్క‌డ ఏదో ఒక వ‌స్తువు బ‌య‌ట‌ప‌డుతుంటుంది. తాను కూడా ఏదో ఓ వ‌స్తువు కోసం అన్వేషిస్తుంటాడు. త‌న‌కు అనుమానం వ‌చ్చిన స్థలాన్ని ఎంత రేటైనా ఇచ్చి కొనేస్తుంటాడు. అక్క‌డ బంగారు నాణాలు, లంకెబిందెలు కూడా దొరుకుతుంటాయి. అయితే అర‌వింద్ ల‌క్ష్యం అది కాదు. ఆఫ్రికాలో ఉండే ఓయ‌మ్మార్ (వినోద్ కుమార్‌)కి అర‌వింద్ గురించి తెలుస్తుంది. త‌న‌ది మైనింగ్ బిజినెస్‌. నీలాంటి వాడు నాకు కావాలి.. నీకు ఎంత డ‌బ్బ‌యినా ఇస్తా.. నాతో చేతులు క‌లుపు అంటాడు. కానీ… అర‌వింద్ ఒప్పుకోడు. మ‌రోవైపు అర‌వింద్ భార్య (పూజ‌) కి పిల్ల‌లు పుట్ట‌రు. మ‌రో పెళ్లి చేసుకోమ‌ని చెప్పినా వినిపించుకోడు. పూజ మాత్రం మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకొంటుంది. ఆ సంగ‌తి అర‌వింద్‌కి తెలుస్తుంది. కానీ ఏమీ అన‌డు. పైగా భార్య‌ని స‌మ‌ర్థిస్తాడు. అయితే అది త‌ట్టుకోలేక ఆమె ఎక్క‌డికో వెళ్లిపోతుంది. ఇలోగా వెన్నెల (మీనాక్షి దీక్షిత్‌) అర‌వింద్ జీవితంలోకి ప్ర‌వేశిస్తుంది. ఆమె ఓ షూట‌ర్‌. ఇంత‌కీ మీనాక్షి ఎవ‌రు?? అర‌వింద్ ద‌గ్గ‌ర‌కు ఎందుకొచ్చింది? అర‌వింద్ దేని కోసం వెదుతున్నాడు? అది దొరికిందా? లేదా? అన్న‌దే క‌థ‌.

నిధి నిక్షేపాల‌కు చెందిన క‌థంటే.. అడ‌వుల్లో, గుహ‌ల్లో తిరిగే క‌థ అనుకొంటారు. కానీ అదేం కాదు. రాయ‌ల‌సీమలోని ఓ ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. క‌థ ప్రారంభం బాగానే ఉంది. తొలి పావుగంట వ‌ర‌కూ `మంచి సినిమా చూస్తున్నాం..` అన్న ఫీలింగ్ వ‌స్తుంది. హీరో ఏదో ఓ వ‌స్తువు కోసం వెతుకుతూ ఉండ‌డం, ఈ ప్ర‌యాణంలో ఎదుర‌య్యే అవ‌రోధాలూ ఆస‌క్తిని క‌లిగిస్తాయి. అయితే రాను రాను అస‌లు క‌థ ట్రాక్ త‌ప్పి… క‌మెడీ ట్రాక్‌లూ, క‌థ‌కు అవ‌స‌రం లేని ఎపిసోడ్లు ప్రేక్ష‌కుల‌పై ఎటాక్ చేసి…. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న మంచి ఫీలింగ్‌ని పాడు చేస్తాయి. వెన్నెల ఎపిసోడ్, క్లైమాక్స్‌లో ఆఫ్రికా ఎపిసోడ్, ఎమ్మార్ ని చంపే స‌న్నివేశం.. ఇవ‌న్నీ చూస్తే.. ద‌ర్శ‌కుడు ఏం చెప్ప‌ద‌ల‌చుకొని, ఏం చెప్పాడు?? ఎటు వైపు వెళ్లాడు?? అన్న సంగ‌తి తెలియ‌క ప్రేక్ష‌కుడు జుత్తు పీక్కోవ‌ల‌సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ప‌ది మంచి స‌న్నివేశాల్ని, 50 బోర్ కొట్టించే స‌న్నివేశాల మ‌ధ్య ఇరికిస్తే ఎలా ఉంటుందో అడ‌వి కాచిన వెన్నెల అలా ఉంటుంది.

ఎక్కువ పాత్ర‌లున్నా… ఏ పాత్ర‌కీ స‌రైన న్యాయం చేయ‌లేదు. ఆఖ‌రికి క‌థానాయ‌కుడి పాత్ర‌కి కూడా. అర‌వింద్ ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడో తెలీదు. ఆనందం, బాధ‌, ఆశ్చ‌ర్యం.. ప్ర‌తీ ఎమోష‌న్‌కీ ఒక్క‌టే ఫేస్‌. అది కావాల‌ని పెట్టాడో, లేదంటే ద‌ర్శ‌కుడే ఆ పాత్ర‌ని అలా డిజైన్ చేయాల‌నుకొన్నాడో అర్థం కాదు. వెన్నెల మంచిదో , మూర్ఖురాలో అర్థం కాదు. ఆ ఊర్లో, హీరో ఇంట్లో అన్ని హ‌త్య‌లు జ‌రిగితే పోలీసులు ఏం చేస్తున్న‌ట్టు?? అన్ని మ‌ర్డ‌ర్లు చేసి కూడా హీరో జ‌ల్సాగా మందు తాగుతూ ఆ ఇంట్లోనే ఉంటాడు. అస‌లు ఆ ఊర్లో పోలీసులే లేరు.. అనుకోవ‌డానికి వీల్లేదు. నాలుగు బంగారు నాణాలు దొరికితేనే మూగిపోయిన పోలీసులు, ఇన్ని మ‌ర్డ‌ర్లు జ‌రిగితే ఎక్క‌డికెళ్లిన‌ట్టు?? ఓ నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌, మ‌ర్డ‌ర్లు చేసి పారిపోతే మొత్తం పోలీస్ వ్య‌వ‌స్థే ఏం చేసిన‌ట్టు…?? క్లైమాక్స్‌లో హీరో విల‌న్‌ని చంపే సీన్ చాలా దారుణం. అస‌లు అలా కూడా ఆలోచిస్తారా?? అనిపిస్తుంది. గ్రాఫిక్స్ చాలా నాశిర‌కంగా ఉన్నాయి. బ్లూమేట్ ప‌రువు తీసి పాడేశారు.

అర‌వింద్ కృష్ణ ఫేస్‌లో ఒక్క ఎక్స‌ప్రెష‌న్ కూడా లేదు. ద‌ర్శ‌కుడు అలా కావాల‌ని డిజైన్ చేస్తే ఓకే. కానీ.. ఇదే న‌ట‌న వ‌చ్చే సినిమాలోనూ ప్ర‌ద‌ర్శిస్తే చాలా క‌ష్టం. పూజ‌ది త‌క్కువ నిడివి ఉన్న పాత్రే. కానీ ఆక‌ట్టుకొంది. అందంగా క‌నిపించింది. బాగా న‌టించింది. మీనాక్షి న‌టించ‌డానికి ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డ‌మే మంచిది. కేవ‌లం గ్లామ‌ర్‌ని న‌మ్మ‌కొంటే… ప్రేక్ష‌కుల్ని బ‌తికించిన‌ట్టే. వినోద్ కుమార్ ఫోన్‌లో ఎక్కువ మాట్లాడి, త‌క్కువ న‌టించాడు. మిగిలిన వాళ్లంతా సో.. సో నే.

సాంకేతికంగా డైలాగ్స్ బాగున్నాయి. అందులో డైప్త్ ఉంది. ఫ‌న్నూ ఉంది. స్ర్కీన్ ప్లేలో చాలా లోపాలున్నాయి. ఈ క‌థ‌ని వీలైనంత వేగంగా చూపించాలి. కానీ ద‌ర్శ‌కుడు నిదాన‌మే ప్ర‌దానం అనుకొన్నాడు. అన‌వ‌స‌ర‌మైన ఎపిసోడ్లు చాలా ఉన్నాయి. కామెడీ ట్రాక్ ఏమాత్రం న‌వ్వు తెప్పించ‌లేదు. జోస్య‌భ‌ట్ల సంగీతంలో మెలోడీలు మాత్ర‌మే బాగున్నాయి. ద‌ర్శ‌కుడికి ఇదే తొలి సినిమా. అత‌నిలో విష‌యం ఉంది. ఎంచుకొన్న క‌థ కూడా కొత్త‌దే. అయితే దాన్ని ప్ర‌జెంట్ చేయ‌డంలో అనుభ‌వ లేమి క‌నిపించింది. ఇది చాల‌ద‌న్న‌ట్టు అడ‌వి కాచిన వెన్నెల పార్ట్ 2 వ‌స్తుంది చూడండి.. అంటూ ఓ హింట్ ఇచ్చాడు. అది చూసి… అమ్మ బాబోయ్‌.. అనుకొని బ‌య‌ట‌ప‌డ‌డం ప్రేక్ష‌కుల వంతైంది.

తెలుగు మిర్చి రేటింగ్స్ :  2/5                        – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

|Click here for English Review|