రివ్యూ: అల్లుడు శీను

alluduఇంట్ర‌డ‌క్ష‌న్ ఓకే ‘అల్లుడు శీను’

సినిమా అంటేనే ఓ మ్యాజిక్. జ‌ర‌గ‌నిది జరిగిన‌ట్టు, లేనిది ఉన్న‌ట్టు భ్ర‌మ క‌ల్పించ‌డం. అందుకే ఈ విష‌యంలో లాజిక్‌లు వెదుక్కోకూడ‌దు. అయితే.. ప్రేక్ష‌కుల‌కు చెప్పాల్సిన పాయింట్ ఎంత క‌న్వినెన్స్‌గా చెప్ప‌గ‌లిగాం.. అన్న‌దే ఇక్క‌డ చాలా ఇంపార్టెంటు. పాత క‌థ తీసుకోండి, లాజిక్‌ల‌న్నీ వ‌దిలేయండి… కానీ – రెండున్న‌ర గంట‌ల పాటు ప్రేక్ష‌కుల్ని క‌ద‌ల‌నివ్వ‌కుండా కూర్చోబెట్టాలి. ఈ విద్య‌లో ఆరితేరిన వాడు.. వి.వి.వినాయ‌క్‌. ఆయ‌న చేతికి ఓ మెరుపులాంటి హీరో త‌గిలాడు. కోరిన‌దంతా ధార‌బోసే నిర్మాత దొరికాడు. ఇక బండి.. జెట్ స్పీడ్‌లో దూసుకుపోవ‌డం ఖాయ‌మే! మ‌రి అల్లుడు శీను… సీను కూడా ఇంతేనా. ఈ సినిమా – ఏ వ‌ర్గానికి చేరువ అవుతుంది? హీరోగా శ్రీ‌నివాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఎలా సాగింది?? చూద్దాం.. ప‌దండి.

న‌ర‌సింహం (ప్ర‌కాష్‌రాజ్‌)కి ఎవ‌రూ లేరు. శ్రీ‌ను (శ్రీ‌నివాస్‌)ని అల్లుడు.. అల్లుడూ అనిపిలుస్తుంటాడు. శ్రీ‌నుగాడికీ ఎవ‌రూ లేరు. కానీ ఊళ్లో బోలెడ‌న్ని అప్పులు. అవ‌న్నీ తీర్చ‌లేన మామ‌తో క‌ల‌సి చెన్నై చెక్కేద్దామ‌నుకొంటారు. కానీ… విధి వాళ్ల‌ను హైద‌రాబాద్ తీసుకొస్తుంది. అక్క‌డ అంజ‌లి (స‌మంత‌)ని చూసి మ‌న‌సు పారేసుకొంటాడు శీను గాడు. అంజ‌లిది మామూలు బ్యాక్‌గ్రౌండ్ కాదు. వెనుక‌.. భాయ్ (ప్ర‌కాష్‌రాజ్‌) ఉన్నాడు. త‌నో పెద్ద డాన్‌. హైద‌రాబాద్ దాదా. భాయ్ కూతురే… అంజ‌లి. ఇక్క‌డో షాకింగ్ విష‌యం ఏమిటంటే… భాయ్‌, న‌ర‌సింహం ఒకేలా ఉంటారు. అందుకే శీను ఓ ప్లాన్ వేస్తాడు. భాయ్‌లా న‌ర‌సింహానికి గెట‌ప్ వేసి, దాందాలు న‌డుపుతాడు. దాంతో… ల‌క్ష‌లు సంపాదిస్తాడు. మ‌రోవైపు అంజ‌లిని ప్రేమ‌లో దింపుతాడు. ఈ విష‌యం భాయ్‌కి తెలిసిపోతుంది. శ్రీ‌ను, న‌ర‌సింహం అండ్ బ్యాచ్‌ని బంధించి… అంజ‌లిని తీసుకొని షార్జా పారిపోతాడు. అక్క‌డ అంజ‌లికి పెళ్లి నిశ్చ‌యిస్తాడు. అస‌లింత‌కీ న‌ర‌సింహాం, భాయ్‌ల మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటి?? అంజ‌లి శీనుని నిజంగానే ప్రేమించిందా? బంధీలుగా ఉన్న శీను అండ్ బ్యాచ్ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చారు? అన్న‌దే అల్లుడు శీను సినిమా.

బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.40 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు వార్తలొచ్చాయి. దానికి తోడు యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు వినాయ‌క్ టేక‌ప్ చేసిన సినిమా ఇది. స్టార్ కాస్టింగ్ భారీ లెవిల్లో ఉంది. టీజ‌ర్లో కుర్రాడిని చూస్తే.. ఆశ‌లు రేగాయి. సో… ఈ సినిమాపై అంచ‌నాలు పెర‌గ‌డానికి ఇంత‌కంటే కార‌ణాలు అక్క‌ర్లేద్దు. వినాయ‌క్.. శ్రీ‌నివాస్‌తో నేల విడ‌చి సాములు చేయించాల‌ని చూళ్లేదు. త‌నేం చేయ‌గ‌ల‌డో అన్నింటినీ తెర‌పై చూపించాల‌నుకొన్నాడు. ఓ హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సినిమా ఎలా ఉండాలో… ప‌ర్‌ఫెక్ట్‌గా అలానే ప్లాన్ చేసుకొన్నాడు. డాన్సులు, ఫైటింగులు, స‌ర‌దా మూమెంట్స్, రొమాంటిక్ సీన్స్‌…. వీటితో సినిమాని నింపేశాడు. అయితే వీట‌న్నింటికి రిఫ‌రెన్స్‌లుగా పాత సినిమాల్నే తీసుకోవ‌డం… కొత్త‌ద‌నానికి ఆటంకంగా మారింది. అదే క‌థ‌.. అవే సీన్లు తీస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు థ్రిల్లింగ్ ఏముంటుంది? పాత క‌థ‌లో కొత్త హీరోని చూస్తున్న‌ట్టు ఫీల‌వ్వ‌డం త‌ప్ప‌. క‌థ కొత్త క‌థేం కాదు. కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్ త‌ల‌దూర్చిన సినిమాల్లానే… హీరో విల‌న్‌డెన్‌లో ప్ర‌వేశించి – అక్క‌డున్న‌వాళ్లంద‌రినీ బ‌క‌రాలు చేయ‌డ‌మే క‌దా..! ఇక్క‌డే అదే ఫార్ములా. ఇంట్ర‌వెల్‌లో ఓ ట్విస్టు. దానికో ఫ్లాష్ బ్యాక్‌. ఫ్లాష్ బ్యాక్‌లో జ‌రిగిన దానికి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం..దాని కోసం వేషం మార్చ‌డం – అల్లుడు శీను సినిమా కూడా అచ్చంగా ఇదే. క‌థాగ‌మ‌నం ఎలా ఉంటుందో నాలుగో సీన్ నుంచే అర్థ‌మైపోతుంది. ఒక్క ట్విస్టూ ముందే రివీల్ చేసేయ్య‌డంతో.. క‌థ‌లో కిక్ లేకుండా పోయింది. స్ర్కీన్ ప్లే కూడా సాదా సీదాగా సాగ‌డంతో – అల్లుడు శీను త‌డ‌బడ్డాడు. బ్ర‌హ్మానందం వినోదం, సినిమాలో చూపించన భారీద‌నం, కొత్త హీరోలో ఉన్న ఎన‌ర్జీ, వినాయ‌క్ మయ – ఇవే ఈ సినిమాని కాపాడాలి.

సాయిశ్రీ‌నివాస్ విష‌యానికొస్తే… కుర్రాడు చూడ్డానికిబాగున్నాడు. ఇంత‌కు ముందు ఎంత క‌ష్ట‌పడ్డాడో తెలీదు గానీ, తెర‌పై మాత్రం ఎలాంటి బెరుకూ లేకుండా సులువుగా న‌టించేశాడు. డాన్సులు అద‌ర‌గొట్టాడు. ఫైట్స్ ఇర‌గ‌దీశాడు. ఒక్క మాట‌లోచెప్పాలంటే శ్రీ‌నివాస్ ఏం ఏం చేయ‌గ‌ల‌డో చెప్ప‌డానికి ఈ సినిమా ఓ డెమోగా ఉప‌యోగ‌ప‌డుతుంది. డైలాగ్ డెలివ‌రీ కూడా బాగుంది. తొలి సినిమాకే ఇన్ని చేయ‌గ‌ల‌డ‌డం నిజంగా అత‌ని టాలెంట్‌కి నిద‌ర్శ‌నం. స‌మంత తొలి సారి కేవ‌లం గ్లామ‌ర్‌కి మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. చిట్టి చిట్టి డ్ర‌స్సుల‌తో క‌వ్వించింది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓ పాట‌లో అద‌ర‌గొట్టింది. ఆ పాట మాస్‌కి న‌చ్చుతుంది. ఇక ప్ర‌కాష్ రాజ్ రెండు పాత్ర‌లే అయినా కొత్త‌గా చేసిందేం లేదు. అదే బాడీ లాంగ్వేజ్‌, అదే మాడ్యులేష‌న్‌. బ్ర‌హ్మానందం ఈ సినిమాని లాక్కురావ‌డానికి త‌న‌వంతు కృషి చేశాడు. సెకండాఫ్‌లో బ్రహ్మానందం కీల‌కం. అయితే మ‌రింత బాగా ఆ పాత్ర‌ని తీర్చిదిద్దాల్సింది.

రూ.40 కోట్లు ఖ‌ర్చు పెట్టిన సినిమా ఇది. ఇక భారీద‌నం ఏ లెవిల్లోఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ప్ర‌తీ సీన్ రిచ్‌గా తీశారు. ప్ర‌తీ పాట‌లోని సెట్స్ ఆక‌ట్టుకొంటాయి. కెమెరా ప‌నిత‌నం.. సూప‌ర్బ్‌. వినాయ‌క్ సినిమా బ్రాండ్‌ని మ‌ర్చిపోకుండా… ఓ భారీ ఛేజింగ్‌కీ చోటిచ్చారు. క‌థ పాత‌ది కావ‌డంతో.. క‌థ‌న‌మైనా కాస్త కొత్త‌గా ఉండాల్సింది. కానీ.. అది ఈ సినిమాకి అతి పెద్ద మైన‌స్‌. మాట‌లు అక్క‌డ‌క్క‌డ ఛ‌మ‌క్కులు కురిపిస్తాయి. అవి బ్ర‌హ్మానందం ప‌ల‌క‌డంతో మ‌రింత బాగుంటాయి. వినాయ‌క్ పూర్తిగా శ్రీ‌నివాస్‌పై దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తుంది. దాంతో మిగిలిన పాత్ర‌ల‌పై ఫోక‌స్‌త‌గ్గింది.

త‌న కొడుకుని హీరోగా చూడాల‌నుకొన్న బెల్లంకొండ సురేష్ కోరిక ఓ భారీ స్థాయిలో తీరింది. అందుకోసం రూ.40 కోట్లు ఖ‌ర్చు పెట్టాడు. కానీ.. త‌న బిడ్డ ఏం చేయ‌ల‌గ‌డో, త‌న‌లో ఉన్న లాటెంట్ ఏమిటో జ‌నానికి చూపింగ‌లిగాడు. ముందే చెప్పిన‌ట్టు శ్రీ‌నివాస్ టాలెంట్‌కి ఈ సినిమా ఓ డెమోలా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌హుశా సురేష్ ఆశ‌యం కూడా ఇదే అయితే… త‌న ప్ర‌య‌త్నం నెర‌వేరిన‌ట్టే.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.25/5                               – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.