రివ్యూ: ఆటోన‌గ‌ర్ సూర్య‌

auto

బ్రేకులు ఫైయిలైన బండి ‘ఆటోన‌గ‌ర్ సూర్య‌’.. తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5

ప్ర‌స్థానం చూసిన వాళ్లెవ‌రికైనా స‌రే…. దేవాక‌ట్టాపై న‌మ్మ‌కం, గౌర‌వం కంబైన్డుగా పెరిగిపోతాయి. క‌థ‌ని, అందులో ఉన్న ఎమోష‌న్స్‌ని దేవాక‌ట్టా నడిపించిన విధానం అలాంటిది. అలాంటి దేవాక‌ట్టా సినిమా, ఇన్నేళ్ల విరామం త‌ర‌వాత, ఇన్ని ఆటంకాల మ‌ధ్య విడుద‌లైనా – ఆస‌క్తిగా ఎదురుచూశారంతా. పైగా హీరో…. నాగ‌చైత‌న్య‌. ఈమ‌ధ్య మ‌నంలాంటి హిట్ సినిమాలో భాగం పంచుకొన్నాడు. వీరిద్ద‌రూ క‌ల‌సిన సినిమా ఆటోన‌గ‌ర్ సూర్య‌. ప్ర‌స్థానంలానే ఇందులోనూ ఎమోష‌న‌ల్ డ్రామా పండించే ఛాన్స్ ఉంది. త‌న మార్క్‌ని పూర్తి స్థాయిలో చూపించే స్కోప్ ఉంది. మ‌రి దేవాక‌ట్టా ఏం చేశాడు…? త‌న‌పై పెట్టుకొన్న అంచ‌నాల్ని, ఆశ‌ల్నీ ఆటోతో పాటు లాక్కెళ్లాడా…? లేదా…?? చూద్దాం రండి.

నాగ‌చైత‌న్య చిన్న‌ప్ప‌టి ఎపిసోడ్ నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. ఇంద్ర (మ‌ధు) చేతిలో త‌న అమ్మానాన్న‌ల్ని కోల్పోతాడు సూర్య (నాగ‌చైత‌న్య‌). మావ‌య్య (సాయికుమార్‌) ఉన్నాడ‌న్న‌మాటేగానీ సూర్య‌ని ఆద‌రించ‌డు. అందుకే… ఒంట‌రిగా బ‌త‌కడం మొద‌లెడ‌తాడు. ఆటోన‌గ‌ర్‌లో ఓ గ్యారెజీలో ప‌నిచేస్తూ డీజిల్ తో న‌డిచే కారుని త‌యారు చేయాల‌నుకొంటాడు. అయితే ఆటోన‌గ‌ర్ రౌడీ మూక‌ల దాడిలో త‌న స్నేహితుడిని కోల్పోతాడు. ఆ కోపంలో ఒక‌డ్ని చంపేస్తాడు. ఆనేరానికి జైలుకి వెళ్తాడు. జైల‌ర్ (త‌నికెళ్ల భ‌ర‌ణి) స‌హ‌కారంతో జైల్లోనే చ‌దువుకొంటాడు. బ్యాట‌రీతో న‌డిచే కార్ న‌మూనా రూపొందిస్తాడు. ఐదేళ్ల త‌ర‌వాత విడుద‌లై అదే ఆటోన‌గ‌ర్ కి వ‌స్తాడు. అప్ప‌టికి ఇంద్ర విజ‌య‌వాడ మేయ‌ర్ అవుతాడు. ఆటోన‌గ‌ర్‌లో త‌న దందా న‌డుపుతుంటాడు. ఆటోన‌గ‌ర్‌లో మెంబ‌ర్ షిప్ కావాలన్నా ల‌క్ష‌లు ధార‌బోయాలి. బ్యాట‌రీతో న‌డిచే కారు త‌యారు చేయ‌డానికీ డ‌బ్బులు కావాలి. కానీ… సూర్య ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు. పైగా ఆటోన‌గ‌ర్‌లో జ‌రుగుతున్న గుండాయిజాన్ని భ‌రించ‌లేక‌పోతాడు. అక్క‌డి దందాని అంతం చేసి, ఇంద్ర మెడ‌లు వంచి… ఆటోన‌గ‌ర్‌ని ఎలా మార్చాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

క‌థ‌ని ఇలా క్లుప్తంగా చెప్పాంగానీ… మ‌ధ్యలో ఎన్నో కుతంత్రాలు, ఇంకెన్నో యాక్ష‌న్ ఎపిసోడ్లు.. మ‌రెన్నో భారీ డైలాగులూ ఉన్నాయ్. వాటితో పాటు స‌మంత‌, నాగ‌చైత‌న్య మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ఒక‌టి. అవ‌న్నీ తెర‌పై చూసే భాగ్యం మీదే!

అస్థవ్య‌స్థ‌మైన వ్య‌వ‌స్థ‌ని బాగుచేయ‌డానికి. దారిలో పెట్ట‌డానికి ఓ శ‌క్తి కావాలి. ఆటోన‌గ‌ర్ కి ఆ శ‌క్తి సూర్య అయ్యాడు. అదీ…. ఈసినిమాలో ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకొన్న పాయింట్. హీరోయిజం ఎలివేట్ చేస్తూ… రివైంజ్ డ్రామాని న‌డిపించే లక్ష‌ణాలు ఈ క‌థ‌లో ఉన్నా… ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా మాత్రం అడుగ‌డుగునా విఫ‌ల‌మ‌వుతూనే వ‌చ్చాడు. ఈ క‌థ ఒక ట్రాక్ లో న‌డ‌వ‌దు. సూర్య బ్యాట‌రీతో న‌డిచే కారు త‌యారు చేసేప‌నిలో ఉంటాడు. దానితో పాటు మ‌ర‌ద‌ల్ని లైన్‌లో పెడుతుంటాడు. ఆటోన‌గ‌ర్‌లో దాందా అరిక‌డుతుంటాడు. వీటితో పాటు తాను అనాథ అవ‌డానికి కార‌ణ‌మైన విల‌న్‌పై పోరాడుతూ ఉంటాడు. ఇన్ని లింకులు పెట్టుకొని ద‌ర్శ‌కుడు క‌న్ ఫ్యూజ్ అయ్యాడు. వీటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో దేవాక‌ట్టాకు అర్థం కాలేదు. పగ ప్ర‌తీకారాల మ‌ధ్య క‌థ న‌డుపుతున్న‌ప్పుడు – హీరో ఆశ‌యం గుర్తొస్తుంది. దాంతో మ‌ళ్లీ బ్యాట‌రీతో న‌డిచే కారు ద‌గ్గ‌ర‌కు వెళ్తాడు. ఈలోగా హీరోయిన్ గుర్తొస్తుంది. దాంతో పాట పెడ‌తాడు. మళ్లీ చిన్న‌ప్పటి జ్ఞాప‌కాలు గుర్తు తెచ్చుకొని విల‌న్ పై ప‌గ పెంచుకొంటుంటాడు. ఇలా అటు తిరిగి, ఇటు తిరిగి దేనికీ న్యాయం చేయ‌లేక… నాలుగు రోడ్ల కూడ‌లలో అక్క‌డ‌క్క‌డే చ‌క్క‌ర్లు కొడుతున్న ఆటోలా తయారైంది ఈ సినిమా ప‌రిస్థితి.

ఎమోష‌న‌ల్ సీన్స్ పండించ‌డం దేవాక‌ట్టా బ‌లం. ఈ సినిమాలోనూ ఎమోష‌న్ రంగ‌రించ‌డానికి ట్రై చేశాడు. కాక‌పోతే…. అది అత‌క‌లేదు. దేవా క‌ట్టా రాసుకొన్న సంభాష‌ణ‌ల్లో బ‌లం ఉంది. కానీ వాటికీ సీనుకీ, ప‌లికే న‌టీన‌టుల బాడీ లాంగ్వేజ్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. ఈ సినిమాలో క‌నిపించే ప్ర‌తివోడూ భారీ డైలాగులు వేసుసుకొంటాడు. రొమాంటిక్ సీన్‌లోనూ రోమాంఛిత డైలాగులు రాసేశాడు. దాంతో… ఆ క‌ష్టం బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. రేప్ కీ, రొమాన్స్‌కీ తేడా తెలియ‌కుండా పోతోంది.. అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాలో డైలాగుల ప‌రిస్థితీ అంతే. క‌థ‌ని ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ తీసుకురావ‌డానికి ద‌ర్శ‌కుడు నానా తిప్ప‌లూ ప‌డ్డాడు. జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, అజ‌య్‌ల‌ను సైడ్ విల‌న్ల‌ను చేసి – వాళ్ల‌తో గొడ‌వ‌ప‌డ‌డానికై హీరోకి టైమ్ స‌రిపోదు. ఈ గ్యాంగ్ అయిపోయాక అప్పుడు విల‌న్‌పై ప‌గ తీర్చుకొంటాడు. ప‌గ తీర్చుకోవ‌డం అన్న కామ‌న్ పాయింట్‌ని ప‌ట్టుకొని రెండున్న‌ర గంట‌ల పాటు ఆటోన‌గ‌ర్‌లో ముప్పుతిప్ప‌లు పెట్టాడీ ద‌ర్శ‌కుడు.

నాగ‌చైత‌న్య దాదాపుగా సీరియ‌స్‌గానే క‌నిపించాడు. అయితే ఈ త‌ర‌హా పాత్ర‌లు అత‌నికి న‌ప్ప‌వు. సీరియ‌స్ గా డైలాగులు చెప్ప‌డం చైతూకి ఇంకా అనుభ‌వంలోకి రాలేదు. మాస్ క్యారెక్ట‌ర్ల‌ని మోసే వ‌య‌సూ కాదు. అందుకే.. చైతూ ఎంత క‌ష్ట‌ప‌డినా ఉప‌యోగం లేకుండా పోయింది. అయితే సంభాష‌ణ‌లు ప‌ల‌క‌డంలో తాను మెరుగ‌వుతూ వ‌స్తున్నాడు. స‌మంత‌కు ప్రాధాన్యం లేదు. పాట‌ల ముందు మాత్ర‌మే క‌నిపించింది. టీవీ సీరియ‌ల్ లో న‌టించే మ‌ధుని ప‌ట్టుకొని మెయిన్ విల‌నిజం అప్ప‌గించారు. ఆ పాత్ర సాయికుమార్‌కి అప్ప‌గించినా బాగుండేది. చంద్ర‌మోహ‌న్ః చేయాల్సిన క్యారెక్ట‌ర్ సాయికి అప్ప‌గించారు. బ్ర‌హ్మానందం, వేణుమాధ‌వ్‌ల మ‌ధ్య ఏజ్ ఓల్డ్ కామెడీ పండించారు. అది ఏమాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు. హీరో గ్యాంగ్ లో క‌నిపించిన‌వాళ్లంతా ఓకే.

సినిమా కోసం ఎంత ఖ‌ర్చు పెట్టారో అర్థం అవుతూనే ఉంది. పాట‌లు ఓకే అనిపించాయంతే. నేప‌థ్య సంగీతంలో అనూప్ మార్క్ క‌నిపించ‌లేదు. ఎడిట్ చేయాల్సిన పార్ట్ చాలా వుంది. నివిడి త‌గ్గించుకొంటే క‌థ‌లో వేగం వ‌చ్చే అవ‌కాశం ఉంది. బ్ర‌హ్మానందంపై ఓ పాట పెట్టారు. అది అవ‌స‌రం లేదు. ఆర్ట్ విభాగం బాగా క‌ష్ట‌ప‌డింది. ఆటోన‌గ‌ర్ సెట్ స‌హ‌జంగా క‌నిపించింది. మాట‌లు బాగున్నాయి కానీ…. అంతంత మాట‌లు వాడాల్సిన అవ‌స‌రం లేద‌నిపిస్తుంది. విన‌డానికి బాగున్నా… అవి అర్థం చేసుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డాల్సిందే. ప్ర‌స్థానం సినిమాతో విమ‌ర్శ‌కుల దృష్టి దేవాక‌ట్టాపై ప‌డింది. ఈ సినిమాలోనూ అదే డెప్త్ ఉంటుంద‌ని ఆశించిన‌వాళ్ల‌కు నిరాశే మిగిల్చాడు. భారీద‌నం చూపించాలి, హంగామా చేయాలి అన్న ధ్యాస దేవాక‌ట్టాకీ ఎక్కువైంద‌ని అర్థ‌మ‌వుతూనే ఉంది.

దాదాపుగా ఏడాదిన్న‌ర నుంచీ ఈ సినిమా వాయిదా ప‌డుతూనే వ‌చ్చింది. ఈరోజు, రేపు అంటూనే ఉన్నారు. నాగార్జున కూడా ఈ సినిమా గురంచి ప‌ట్టించుకోలేదు. ఒక ద‌శ‌లో నిర్మాత‌లూ చేతులెత్తేశారు…. ఇవ‌న్నీ ఊర‌కే చేయ‌లేదు. సినిమాలో మేట‌ర్ అలాంటిది. ర‌షెస్ చూసిన వాళ్లెవ‌రూ ఈసినిమాని ముందుకు తీసుకెళ్లే సాహ‌సం చేయ‌లేదు. ఇప్పుడు వ‌చ్చినా… ప్రేక్ష‌కులూ అలాంటి సాహ‌సం చేస్తార‌న్న న‌మ్మ‌కం లేదు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.