రివ్యూ: బంగారు కోడి పెట్ట

bangaru-kodipetta-telugu-re
ప్చ్‌… గుడ్డు పెట్టలేదు..’కోడిపెట్టతెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5

డ‌బ్బు చుట్టూ న‌డిచే క‌థ‌లు కొన్నుంటాయి. మ‌ని, మ‌నీ మ‌నీ, క్షణం క్షణం ఈ జాబితాలో చేర‌తాయ‌న్నమాట‌. ప్రతీ పాత్రా ఏదోలా డ‌బ్బు సంపాదించాల‌ని టార్గెట్ పెట్టుకొంటుంది. అంద‌రూ ఓ `పాయింట్‌` ద‌గ్గర‌కు చేరుకొంటారు. అక్కడి నుంచి ఎత్తులూ, పై ఎత్తులూ ఎలా వేశారు, చివ‌రికి ఏమైంద‌న్నది క‌థ‌. ఇదే పాయింట్‌ని ఎన్నిర‌కాలుగా తీయండి… జ‌నం చూస్తారు. ఎందుకంటే.. డ‌బ్బుకంటే ఇంట్రస్ట్రింగ్ స‌బ్జెక్ట్ ఏదీ ఉండ‌దు. కాక‌పోతే.. ఈ క‌థ‌ని ఎంత ఆస‌క్తిగా, ఎన్ని ట్విస్టుల‌తో చెప్పామ‌న్నదే పాయింట్‌. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే బంగారు కోడి పెట్ట కూడా డ‌బ్బు సంపాదించ‌డం చుట్టూ న‌డిచే క‌థే! పైన ఉద‌హ‌రించిన మ‌ని, క్షణం క్షణం ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. మ‌రి… ద‌ర్శకుడు దీన్ని జ‌న‌రంజ‌కంగా మ‌లిచాడా? లేదా? తెలుసుకొందాం..రండి.

భాను (స్వాతి) ఎన‌ర్జటిక్ డ్రింక్‌ కంపెనీలో సేల్స్ ప్రమోట‌ర్‌. దొంగ స‌ర్టిఫికెట్‌ల‌తో సంపాదించిన జాబ్ ఇది. ఇంగ్లీష్ రాదు. ప్రమోష‌న్ కోసం ప‌డిగాపులు కాస్తుంటుంది. బాస్ కుమార్ (హ‌ర్షవ‌ర్థన్‌) మాత్రం… నాకు `కోప‌రేట్‌` చేస్తే ప్రమోష‌న్ గ్యారెంటీ అంటాడు. ఛీ కొట్టి వ‌చ్చేస్తుంది. జాబ్ పోతుంది. అంత‌కు ముందే ఫ్లాట్ కొనాల‌న్న ఉద్దేశంతో రూ.2 ల‌క్షలు అడ్వాన్స్ ఇస్తుంది. మిగిలిన డ‌బ్బులు క‌ట్టక‌పోతే అవీ రావు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు వంశీ (న‌వ‌దీప్‌). మ‌నోడికి దొంగ‌త‌నాలంటే స‌ర‌దా. భానుని ఇష్టపడుతుంటాడు. ఆ ఎన‌ర్జీ డ్రింక్ కంపెనీలో ఓ పండ‌గ ఆఫ‌ర్ న‌డుస్తుంటుంది. అదేంటంటే… ప్రతి వంద డ్రింక్ బాటిల్స్ కీ ఓ బంగారు నాణెం గిఫ్ట్ గా దొరుకుతుంది. అంతే కాదు.. ల‌క్కీ డిప్‌లో విజేత‌లైన ఓ బంగారు ఇటుక కూడా ఇస్తారు. ఇందుకు సంబంధించిన 500 బంగారు నాణాలు, 4 బంగారు ఇటుక‌లు కంపెనీ నుంచి ఓ ట్ర‌క్కులో హైద‌రాబాద్ వ‌స్తుంటాయి. వాటి వివ‌రాలు భానుకు తెలుస్తాయి. వంశీతో క‌ల‌సి ఆ బంగారాన్ని కాజేసి లైఫ్‌లో సెటిల్ అయిపోవాల‌న్నది ప్లాన్‌. ఈ క‌థ‌తో పాటుగా మ‌రో రెండు క‌థ‌లు స‌మాంత‌రంగా న‌డుస్తుంటాయి. ఒక‌డు సినిమా హీరో కావాల‌నుకొనే పిజ్జా బోయ్‌. రెండోది భీమ‌వ‌రంలో అన్నద‌మ్ముల గొడ‌వ‌. ఈ అన్ని క‌థ‌లూ ఎక్క‌డ మ‌లుపు తీసుకొన్నాయి? ఆ బంగారం దోపిడీ ప్లాన్ ఎంత వ‌ర‌కూ విజ‌య‌వంత‌మైంది? అన్నదే ఈ బంగారు కోడి పెట్ట క‌థ‌.

రాబ‌రీకి సంబంధించిన ఏ క‌థ కూడా బహుశా ఇంత‌కంటే `గొప్ప‌`గా ఉండ‌దు. కానీ సినిమా `గొప్ప‌`గా ఉండాలంటే ఈ కథ చాల‌దు. క‌థ‌నం, ట్విస్టులు, క‌థ‌ని న‌డిపించే విధానం ఇవ‌న్నీ ఆస‌క్తిక‌రంగా ఉండాలి. అక్కడే ఈ సినిమా ప‌ల్టీ కొట్టింది. ప్రతీ క్యారెక్టర్‌కీ ఓ లీడ్ ఇవ్వాల‌న్న ఉద్దేశంతో స‌న్నివేశాలు రాసుకొంటూ పోయాడు ద‌ర్శకుడు. దాంతో న‌స పెరుగుతుంది. అస‌లు క‌థ ద‌గ్గర‌కు వ‌చ్చేస‌రికి ఇంట్రవెల్ ప‌డిపోతుంది. ఆ త‌ర‌వాత రాబ‌రి ప్లానింగ్‌, అందుకోసం ప‌డిన పాట్ల‌తో క్లైమాక్స్ వ‌చ్చేస్తుంది. క్లైమాక్స్ కి ముందు దొంగ‌త‌నం జ‌రుగుతుంది. అంటే.. క‌థ‌లోని అస‌లు పాయింట్ వ‌ర‌కూ రావ‌డానికి క్లైమాక్స్ వ‌ర‌కూ ఓపిక ప‌ట్టాల‌న్నమాట‌. అంత‌.. స‌హ‌నం ఎక్కడుంది?? దొంగ‌త‌నం జ‌రుగుతుంది అనేది రెండో సీన్‌లో అర్థమైపోయిన‌ప్పుడు ఎలా జ‌రిగింద‌న్నది ఆస‌క్తిక‌రం. దాన్ని నేరుగా చూపించ‌కుండా.. సాగ‌దీయ‌డం ఈ సినిమాకి ఉన్న ప్రధాన మైన‌స్‌. భానుకి దొంగ‌త‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉన్నా.. వంశీకి ఏమాత్రం లేదు. అయినా ఇందులో ఎలా ఇన్‌వాల్వ్ అయ్యాడు? మేనేజ‌ర్ భానుని ఇందులో ఎందుకు ఇన్‌వాల్వ్ చేశాడు? ఈ ప్రశ్నల‌కు క్లారిటీ లేదు. భాను – వంశీల‌కు అనుబంధంగా న‌డిచే రెండు క‌థ‌ల నిడివీ ఎక్కువైంది. దాంతో… రాబ‌రీ అనే కాన్సెప్ట్ ప‌క్కకు జ‌రిగింది. ఇంతా చేస్తే చివ‌ర్లో మ‌ళ్లీ రొటీన్ శుభం కార్డ్‌!

న‌వదీప్ చాలా కాలం త‌ర‌వాత క‌నిపించాడు. హీరోయిజం చూపించే పాత్ర‌ల‌కంటే త‌న‌కి ఇలాంటివే సో బెట‌ర్‌. త‌న‌వ‌ర‌కూ న్యాయం చేశాడు. ఇక స్వాతి.. న‌టిస్తున్నట్టు ఎక్కడా అనిపించ‌లేదు. అది ఆమెకు ప్ల‌స్సో, మైన‌స్సో ఆమెకే తెలియాలి. పిజ్జా డెలివ‌రీ బోయ్‌.. కూడా ఫ‌ర్వాలేద‌నిపిస్తాడు. రామ్‌, లక్ష్మన్‌కి మంచి పాత్రలే ద‌క్కాయి. హ‌ర్షవ‌ర్థన్ కూడా ఓకే. అంత‌కు మించి ఈ క‌థ‌లో చెప్పుకోద‌గిన పాత్రలేం లేవు.

చిన్న సినిమాలు.. అందునా ఇలాంటి సినిమాల్లో స్ర్కిన్ ప్లే చాలా కీల‌కం. అన్ని క‌థ‌లూ ఓచోట లింక్ చేయ‌డం అనుకొన్నంత తేలికేం కాదు. కానీ ద‌ర్శకుడు.. కొంత వ‌ర‌కూ న్యాయం చేశాడు. ఇంట్రవెల్‌లో పేద్ధ ట్విస్ట్ వ‌చ్చి ప‌డింద‌నుకొంటే… ఆ త‌ర‌వాత దాన్ని తూచ్‌… అని తేల్చేశాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ ఇంత‌కంటే ఏమీ వేయ‌లేం.. అనుకొన్నాడో ఏమో..? ప్రేక్షకుల్ని వెర్రి వెంగ‌ల‌ప్పలుగా చేసే ఇలాంటి బ్యాంగ్ లు ఎందుకో అర్థం కాదు. లాజిక్‌కు అంద‌ని సిల్లీ థింక్స్ ఇందులో చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోక‌పోవ‌డం మంచిది. ఒక్క బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ త‌ప్ప‌.. పాట‌ల‌కు అవ‌కాశం లేదు. నేప‌థ్య సంగీతం అంత టెమ్టింగ్‌గా ఏమీ లేదు. సాంకేతికంగానూ ఈ సినిమా అంతంత‌మాత్రమే.

త‌క్కువ బ‌డ్జెట్‌లోనూ నాణ్య‌మైన సినిమాలొస్తున్నాయి. అంటే బ‌డ్జెట్‌కీ విజ‌యానికీ సంబంధం లేద‌నే క‌దా..? రాబ‌రీ క‌థ లంటే సేఫ్ గేమే. కాక‌పోతే.. థియేట‌ర్లో కూర్చోబెట్టే నేర్పు ఆ ద‌ర్శ‌కుడికి తెలియాలి. బంగారు కోడి పెట్ట‌… ఈమ‌ధ్య వ‌చ్చిన‌, వ‌స్తున్న చాలా చిన్న సినిమాల్లో ఒక‌టి. అంత‌కు మించిన ప్రత్యేక‌త ఏమీ క‌నిపించ‌దు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5        – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు