రివ్యూ: బసంతి

Basantiరొటీన్ టెర్రరిజం ‘బ‌సంతి‘:  తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5

టెర్రరిజం.. ఈ జోన‌ర్‌ని ముట్టకోవ‌డానికి గ‌ట్స్ఉండాలి. దేశ‌భ‌క్తిని చూపించ‌డానికీ దిల్ ఉండాలి. అయితే ఇందులో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. మ‌తం జోలికి వెళ్లకూడ‌దు, సున్నిత‌మైన అంశాల్ని కెల‌క్కూడ‌దు. అలాగ‌ని వాటిని ట‌చ్ చేయ‌క‌పోతే కిక్ కాదు. రెండింటినీ బ్యాలెన్స్ చేయ‌డం క‌త్తిమీద సామే. దాంతో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల కోసం పాకులాడ‌కూడ‌దు. ఇవ‌న్నీ ఎందుకులే… అని ఈ జోన‌ర్ జోలికి వెళ్లడానికి భయ‌ప‌డుతుంటారంతా. కానీ న‌వ‌త‌రం ద‌ర్శకులు మాత్రం ఇలాంటి సాహ‌సాలు చేస్తున్నారు. వారి ప్రయ‌త్నాన్ని అభినందించాల్సిందే. అయితే అనుభ‌వ‌లేమి, ఏదో చేయాల‌న్న తాప‌త్రయం త‌ప్ప‌, ఎలా చేయాలో అర్థంకాకపోవ‌డం వ‌ల్ల అవ‌న్నీ స‌గం ప్రయ‌త్నాల్లానే మిగిలిపోతున్నాయి. చైత‌న్య దంతులూరి టెర్రరిజం నేప‌థ్యంలో సినిమా తీస్తున్నాడంటే.. ఆ సినిమాపై ఎన్నో కొన్ని ఆశ‌లు పెట్టుకోవ‌డం స‌హ‌జం. ఎందుకంటే బాణంలో న‌క్సలిజంతో కూడిన క‌థ అల్లుకొన్నారాయ‌న‌. దాన్ని అర్థవంతంగా చూపించాడు. అందుకే.. బ‌సంతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంద‌నుకొంటారు. మ‌రి ఆ ఆశ‌లు ఎంత వ‌ర‌కూ నెర‌వేరాయి. మంచి సినిమాని దంతులూరి మ‌రోసారి అర్థం చెప్పగ‌లిగాడా? లేదా? చూద్దాం.. రండి.

బ‌సంతి కాలేజీలో డిగ్రీ చ‌దువుతుంటాడు అర్జున్‌ (రాజా గౌత‌మ్‌). పెద్ద ల‌క్ష్యాలేం లేవు. బ్యాక్‌లాక్స్ పూర్తి చేస్తే చాలనుకొంటాడు. రోషిణి ( అలీషా బేగ్‌)ని తొలి చూపులోనే ఇష్టప‌డ‌తాడు. తాను క‌మీష‌న‌ర్ అమ్మాయి. రోషిని నాన్నమ్మకి ర‌క్తదానం చేసి… ఆమెకు ద‌గ్గర‌వుతాడు. ఇద్దరి మ‌ధ్య స్నేహం పెరుగుతుంది. పైచ‌దువుల కోసం లండ‌న్ వెళ్లాల‌నుకొంటుంది రోషిని. త‌న ప్రేమ‌ని చెప్పడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాడు. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో విధ్వంసం సృష్టించ‌డానికి ఉగ్రవాదులు కుట్రప‌న్నుతారు. అది పోలీసుల‌కు తెలిసిపోవ‌డంతో… త‌మ స్థావ‌రాన్ని వ‌దిలి పారిపోయే ప్రయ‌త్నంలో బ‌సంతి కాలేజీలో ఉగ్రవాదులు ప్రవేశిస్తారు. దాదాపు వంద మంది విద్యార్థుల‌ను బందీలుగా చేసుకొని ప్రభుత్వాన్ని బెదిరిస్తారు. త‌మ నాయ‌కుడిని జైలు నుంచి విడుద‌ల చేయాల‌న్నది వారి డిమాండ్‌. అర‌గంట‌కో శ‌వాన్ని బ‌య‌ట‌కు పంపుతారు. మ‌రోవైపు ఫ్లైట్‌క్యాన్సిల్ అవ్వడంతో అర్జున్ కోసం బ‌సంతి కాలేజీకి వ‌చ్చిన రోషిని.. కూడా ఉగ్రవాదుల చెర‌లో చిక్కుకొంటుంది. ఈ విష‌యం తెలుసుకొన్న అర్జున్ ఎలా స్పందించాడు? ఉగ్రవాదుల నుంచి త‌న స్నేహితుల‌ను, ప్రేమికురాలిని, కాలేజీని ఎలా కాపాడాడు అన్నదే బ‌సంతి క‌థ‌.

కొత్తత‌రం సినిమాలంటే, మంచి సినిమాలంటే, మ‌న‌సుతో తీసిన సినిమాలంటే… టెర్రరిజం నేప‌థ్యంలో తీసే సినిమాలే అనుకోవ‌డం కూడా కూడా పొర‌పాటే! మంచి సినిమా తీశాం అని చెప్పడానికైతే ఇలాంటి స‌బ్జెక్ట్‌ల జోలికి వెళ్లక‌పోవ‌డ‌మే మంచిది. ఉగ్రవాదం అన‌గానే… టెర్రరిస్టులు విధ్వంసం సృష్టించాల‌నుకోవ‌డం. ఓ నాయ‌కుడిని విడిపించాల‌ని డిమాండ్ చేయ‌డం, అందుకోసం కొంత‌మందిని త‌మ అధీనంలోకి తీసుకోవ‌డం.. – ఏకాలం నాటి ఆలోచ‌న‌లు ఇవి?? ఇంత‌కు మించి ఆలోచించ‌లేరా? ఇంకా ఇలాంటి క‌థ‌ల‌తోనే టెర్రరిజాన్ని ముడిపెడుతుంటే ఎలా.? బాణం చూసిన త‌ర‌వాత చైత‌న్య పై భ‌రోసా పెరిగింది. ఆయ‌న‌లో ఏదో విష‌యం ఉంద‌నే సంగ‌తి అర్థమైంది. ఆ స‌మ్మకంతోనే బ‌సంతి థియేట‌ర్‌కి వెళ్తాం. కానీ దాన్ని ద‌ర్శకుడు నిల‌బెట్టుకోలేక‌పోయాడు. చాలా స్లో నేరేషన్‌తో సినిమా మొద‌ల‌వుతుంది. సినిమా ఆఖ‌రి వ‌ర‌కూ అదే న‌డ‌క‌. ప్రేక్షకులు ఉద్వేగ ప‌డిన క్షణాలు, ఇలా జ‌రిగితే బాగుణ్ణు అనుకోవ‌డాలూ ఏమీ ఉండ‌వు. తెర‌పై ఏదో జ‌రుగుతూపోతుంటుంది. మ‌నం చూస్తూ కూర్చుంటాం. అంతే!

ఉగ్రవాదులు కాలేజీలో ఎంట‌ర్ అయిన త‌ర‌వాత క‌థ ఊపందుకోవాలి. అదీ లేదు. ఇది వ‌ర‌కు చూసిన సినిమాల్లో దృశ్యాలే క‌ళ్లముందు క‌ద‌లాడుతుంటాయి. థ్రిల్లర్‌గా మ‌ల‌చుకోవ‌ల‌సిన క‌థ‌ని సాదా సీదాగా తీశాడు. ప‌తాక స‌న్నివేశాల్లో ఎప్పటిలా అర్జున్‌ని హీరోని చేసి, ఉగ్రవాదుల్ని చిత‌గ్గొట్టించేశాడు.

గౌత‌మ్‌కి ఇది డూ ఆర్ డై సినిమా. ఈ సినిమా ఫ‌లితంపైనే త‌న భ‌విష్యత్తు ఆధార‌ప‌డి ఉంది. అందుకే జాగ్రత్తగా చేయాలి.. అన్న త‌ప‌న‌తో బిగుసుకుపోయాడు. మెహంలో ఒక‌టే ఎక్స్‌ప్రెష‌న్‌. 14 రీళ్ల పాటు అదే కొన‌సాగించాడు. నో ఛేంజ్. డాన్సులు అద‌ర‌గొట్టాడు.. అన్నారు గానీ, ఆ అవ‌కాశం ఈ సినిమాలో రాలేదు. క‌నీసం ప్రాణ స్నేహితుడు చ‌నిపోయిన త‌ర‌వాత అయినా అత‌ని మెహంలో ఫీలింగ్స్ మారిస్తే బాగుండేది. ఏం చూసి క‌థానాయిక‌ను ఎంచుకొన్నారో అర్థం కాదు. మొహంపై బుర్ఖావేసి మూసేస్తాం క‌దా? ఎవ‌రున్నా ఫ‌ర్లేదు అనుకొని అలీషా బేగ్‌ని ఎంచుకొని ఉంటారు. అమె కూడా ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలో హీరోని ఫాలో అయిపోయింది. భ‌ర‌ణి పాత్ర బాగుంది. ఆ పాత్రని మ‌ల‌చిన విధానం, రాసుకొన్న సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకొంటాయి. ర‌ణ‌ధీర్ ఒక్కటే కాస్త బెట‌ర్‌. షాయాజీ షిండే ఎప్పట్లా రొటీన్ గా చేశాడు.

టెర్రరిజం క‌థంటే ఇలాగే ఉండాల‌ని డిసైడ్ అయి రాసుకొన్న క‌థ‌లో కొత్త‌ద‌నం ఎక్కడ ఉంటుంది? రొటీన్ గానే ఉంది. క‌థ‌నం నీర‌సంగా సాగుతుంది. ఇంట్రవెల్ వ‌ర‌కూ అంతే. ల‌వ్ ట్రాక్ ఎక్కువైంది. ఆ నిడివి త‌గ్గించుకొంటే బాగుండేది. ఒక్కో సీన్‌లో ద‌ర్శకుడి మెరుపు క‌నిపించినా అది అంతంత మాత్రమే. సంభాష‌న‌లు కొన్ని ఆక‌ట్టుకొంటాయి. ముఖ్యంగా భ‌ర‌ణి చెప్పిన డైలాగులు. రొటీన్ క్లైమాక్స్ ఇంకొంచెం నీర‌సం తీసుకొచ్చింది. ఈ తిరుగుబాటులో మిగిలిన‌ కాలేజీ విద్యార్థులకూ భాగం ఇస్తే కాస్తయినా బాగుండేది. మ‌ణి బాణీలు బాగున్నాయి. థియేట‌ర్లో చూడ‌డం కంటే… వింటేనే బెట‌రేమో..? ఆర్‌.ఆర్ విష‌యంలో ఆయ‌న‌కు పేరు పెట్టగ‌ల‌మా? కెమెరా, ఎడిటింగ్‌.. ఓకే అనిపించుకొన్నాయి.

బాణంతో చైత‌న్య దంతులూరిపై విమ‌ర్శకులు చాలా న‌మ్మకాలు పెంచుకొన్నారు. ఆయ‌న ఎప్పుడు సినిమా తీసినా …. బాణం స్థాయిలో ఉంటుంద‌నుకొన్నారు. అయితే… ఈ సినిమా మాత్రం వారి న‌మ్మకాల్ని నిల‌బెట్టలేక‌పోయింది. బాణం కంటే ముందు.. బ‌సంతి తీసుంటే.. ఓకే – మంచి ప్రయ‌త్నం చేశాడు అనేవారంతా. కానీ ఇప్పుడు అలా కూడా అన‌డానికి ఏం లేదు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5                                – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు