రివ్యూ : భీమ‌వ‌రం బుల్లోడు

beemavaram-telugu-review
బుల్లోడు కాస్త బెట‌రే..! తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5

కామెడీ సినిమా… అని కూర‌లో క‌రివేపాకులా తీసిపాడేయ‌లేం. ఎందుకంటే ఈ రోజుల్లో న‌వ్వించ‌డం చాలా కష్టం. ఎస్సెమ్మెస్సుల్లో జోకులు, జ‌బ‌ర్ద‌స్త్‌లాంటి కామెడీషోల హ‌వా ఎక్కువ‌య్యాక‌.. సినిమావాళ్లు న‌వ్వించ‌డానికి కొత్త దారులు వెతుక్కోవ‌ల‌సి వ‌స్తోంది. కామెడీ పండించ‌డానికి క‌ష్టప‌డాల్సొస్తోంది. ఇలాంటి సినిమాల్లోనూ… కొత్త దారుల్లో వెళ్లిన వాళ్లకే విజ‌యం వ‌రిస్తుంది. కొత్తగా న‌వ్విస్తేనే… హిట్టొస్తుంది. అర‌వై స‌న్నివేశాలుంటే క‌నీసం స‌గం సీన్లలో జ‌నం హాయిగా న‌వ్వుకోవాలి. సునీల్‌లాంటి క‌మెడియ‌న్లు హీరోలైతే ఓ స‌మ‌స్య ఉంది.. ఇప్పుడు అర‌వైకి అర‌వై సీన్లూ న‌వ్వులు పండాలి. సునీల్ కూడా ఓ మాటిచ్చాడు.. నేను ప‌ది సినిమాల‌లో చేసే కామెడీ భీమ‌వ‌రం బుల్లోడు లోనే చేసేస్తాన‌ని. మ‌రి ఆ మాట నిల‌బెట్టుకొన్నాడా?? ఈ సినిమాలో ఎన్ని న‌వ్వులు పండాయి. సునీల్ ఈ సినిమాలో కొత్త‌గా న‌వ్వించిందేమిటి?? ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే ఆల‌స్యం చేయ‌కుండా రివ్వ్యూలోకి టేకాఫ్ తీసుకోవ‌ల్సిందే.

భీమ‌వ‌రంలో ఉండే రాంబాబు (సునీల్) భ‌య‌స్తుడు. ఇద్దరు గొడ‌వ ప‌డుతున్నా.. మ‌ధ్యలో వెళ్లడు. దానికి తోడు రాంబాబు ఏ అమ్మాయినైనా చూసి `పిల్ల బాగుంది..` అంటే ఆ పిల్లకు మ‌రొక‌రితో వెంట‌నే పెళ్లయిపోతుంది. అందుకే ఊర్లోవాళ్లంతా `మా అమ్మాయి న‌చ్చింద‌ని చెప్పు…` అంటూ వెంట‌ప‌డుతుంటారు. ఇలాంటి రాంబాబుకి ఓసారి బుర్రపై దెబ్బత‌గులుతుంది. డాక్టర్ ఏమో.. ఇది బ్రెయిన్ ట్యూమ‌ర్ – నువ్వొక ప‌ది రోజుల్లో చ‌చ్చిపోతావ్ అని చెప్తాడు. ఊర్లోవాళ్లంతా చూసే జాలి చూపుల‌కు త‌ట్టుకోలేక‌.. హైద‌రాబాద్ వచ్చేస్తాడు. బ‌తికేది ఎలాగూ ప‌దిరోజులే క‌దా… ఈ ప‌ది రోజులూ మంచి ప‌నులు చేద్దాం, ధైర్యంగా ఉందాం.. అని హైద‌రాబాద్‌లోని రౌడీ మూక‌ల‌ను ఉతికి ఆరేస్తుంటాడు. ఆ దారిలోనే నందిని (ఎస్తేర్‌)ని కాపాడ‌తాడు. నందిని రాంబాబుని ప్రేమిస్తుంది. కానీ రాంబాబు మాత్రం ప‌ట్టించుకోడు. ఎలాగూ ప‌దిరోజుల్లో పోయేవాడికి ప్రేమ ఎందుకు..? అనుకొంటాడు. హైద‌రాబాద్‌లోని రౌడీ మూక‌ల్ని ఏరిపారేశాక‌… ఓ విష‌యం తెలుస్తుంది. త‌న‌కు బ్రెయిన్ ట్యూమ‌ర్ లేదు, డాక్టర్లు రిపోర్ట్ మార్చేశాడ‌ని. దాంతో ఖంగుతింటాడు రాంబాబు. ఈ ప‌ది రోజుల ధైర్యం ఏమైంది? రాంబాబు ఎప్పట్లానే ఉన్నాడా? ఆ రౌడీ మూక‌ల బారి నుంచి ఎలా కాపాడుకొన్నాడు? నందిని ప్రేమ విష‌యం ఏమైంది? ఇవ‌న్నీ సెకండాఫ్ లో తెలుస్తాయి.

కామెడీ సినిమాల‌కు క‌థ అవ‌స‌రం లేదు… కొన్ని స‌న్నివేశాలు న‌వ్విస్తే చాలు అనుకొంటారు. అయితే ఈసినిమాలో కామెడీ పండించ‌డానికి అనువైన క‌థ ఉంది. అది కొత్తది కాక‌పోయినా.. న‌వ్వించ‌డానికి ఈమాత్రం సందు దొరికితే చాలు. రాంబాబుకి బ్రెయిన్ ట్యూమ‌ర్ అని తొలి స‌న్నివేశాల్లోనే చెప్పేసి – క‌థ‌లోకి నేరుగా వెళ్లిపోయాడు ద‌ర్శకుడు. దాంతో క‌థ‌లో సోది త‌గ్గింది. ప‌దిరోజుల్లో రాంబాబు చేసే అద్భుతాలు, ఫైటింగులు, స‌ర్కసుల‌తో ఫ‌స్టాఫ్ గ‌డిచిపోతుంది. రాంబాబుకి ఏ జ‌బ్బూ లేద‌ని సంగ‌తి ఇంట్రవెల్ వ‌ర‌కూ దాచ‌కుండా, దాన్నే ముందు రివీల్ చేసి మంచి ప‌ని చేశాడు ద‌ర్శకుడు. దాంతో రాంబాబు సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నా…అస‌లు సంగ‌తి ప్రేక్షకుల‌కు తెలుసు కాబ‌ట్టి.. స‌ర‌దాగా ఉంటుంది. ఇంట్రవెల్ కార్డు ఎక్కడ ప‌డుతుందో, సెకండాఫ్ క‌థ ఎలాంటి మ‌లుపు తీసుకొంటుందో ప్రేక్షకుడు ఈజీగా ఊహించేస్తాడు. ఇక్కడ చేయాల్సింది.. ఆయా స‌న్నివేశాల్ని కామెడీగా మ‌ల‌చుకోవ‌డం.

ఇంట్రవెల్ వ‌ర‌కూ బండి బాగానే నెట్టుకొచ్చిన ద‌ర్శకుడు సెకండాఫ్ మాత్రం నీర‌శించాడు. అస‌లు విల‌న్స్ అంద‌రినీ వ‌దిలేసి హీరోయిన్ తండ్రి షాయాజీ షిండేని విల‌న్‌ని చేశాడు. ల‌వ్ ట్రాక్‌, దాన్ని సాధించ‌డానికి క‌థానాయ‌కుడు వేసే ప్లాన్‌ల న‌డుమ సెకండాఫ్ న‌డిపించేశాడు. అది ఈ సినిమాకి పెద్ద మైన‌స్. సినిమాలోవిల‌న్ గ్యాంగ్ ఎక్కువే ఉంది. వాళ్లంద‌రినీ గాలికి వ‌దిలేసి.. కొత్త పాత్ర ప్ర‌వేశ పెట్ట‌డంలో అర్థం లేదు. ఇక 80ల నాటి క్లైమాక్స్ తో జ‌నాన్ని థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు పంపాడు. సునీల్ పోలీస్ డ్రస్ వేసుకొని.. వేసే వేషాలు త‌డాఖా సినిమాని గుర్తుకు తెస్తాయి, ఫ‌స్టాఫ్ అంతా అదే హ‌వా. కాక‌పోతే.. తడాఖాలో నాగ‌చైత‌న్య చేసిన పాత్ర‌.. ఇక్కడ సునీల్‌కి వ‌చ్చింది. అంతే తేడా.

సునీల్ త‌న భుజాలపై సినిమా అంతా న‌డిపించ‌డానికి విశ్వ ప్రయ‌త్నాలు చేశాడు. కామెడీ టైమింగ్ విష‌యంలో త‌న‌కి తిరుగులేదు. అయితే అప్పుడ‌ప్పుడూ ఆ టైమింగ్ ఎక్కువై… శ్రుతి త‌ప్పింది. సెంటిమెంట్ డైలాగులు మ‌రీ డ్రమ‌టిక్‌గా చెప్పడం…. కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మిలిగిన విష‌యాల్లో కేక పుట్టించాడు. డాన్సులు, ఫైటింగులూ.. మాస్‌కి న‌చ్చుతాయి. ఎస్తేర్ మైన‌పు ముద్దలా క‌నిపించింది. ఆమెలో ఒక్కటంటే ఒక్క ఎక్స్‌ప్రెష‌న్ కూడా ప‌ల‌క‌లేదు. పైగా ముదురు ఫేసు. ఈ సినిమాకి ప్రధాన మైన‌స్ క‌థానాయిక‌. ఆమెపై ఎక్కువ సీన్లు రాసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌.. ప్రేక్ష‌కులు బ‌తికిపోయారు. న‌ట‌వ‌ర్గం గ్యాంగ్ పెద్ద‌దే. ర‌ఘుబాబు బ‌న్నీ సినిమాని మ‌రోసారి గుర్తుకు తెచ్చాడు. ఆ సినిమాలో ఎలా న‌టించాడో…. ఇక్కడా అంతే! ఇక‌.. థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ్రస్ట్రీ ఫృద్వీ పాత్ర మాత్రం ఆక‌ట్టుకొంటుంది. షాయాజీ, జ‌య‌ప్రకాష్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌… పేరుకు ఉన్నారంతే. కొత్తగా చేసిందేం లేదు.

సాంకేతిక వ‌ర్గంలో సంభాష‌ణ‌లు ప్రధాన ఆక‌ర్షణ‌. శ్రీ‌ధ‌ర్ రాసిన పంచ్‌లు బాగా పేలాయి. స‌ర‌దా స‌ర‌దాగా చిన్న చిన్న ప‌దాల‌తో కామెడీ పండించాడు. స‌న్నివేశ బ‌లం కూడా తోడైతే బాగుండును. అనూప్ అందించిన ది వ‌ర‌స్ట్ ఆల్బమ్ ఇదే. ఒక్క పాట కూడా మ‌ళ్లీ గుర్తుతెచ్చుకొని పాడుకొనేలా ఉండ‌దు. అనూప్ త‌న బాణీ మార్చాల్సిన అవ‌స‌రం ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఇక ఉద‌య్ శంక‌ర్‌… ఫ‌స్టాఫ్ ని బాగానే డీల్ చేసినా సెకండాఫ్ దెబ్బడిపోయింది. క‌డుపుబ్బా న‌వ్వుకొనే లెంగ్తీ ఎపిసోడ్ ఒక్క‌టంటే ఒక్కటీ సినిమాలో లేదు. సెకండాఫ్‌లో గుడి ద‌గ్గర తీసిన సీన్ నిడివి మ‌రీ ఎక్కువ‌. అందులో విష‌యం లేదు. కేవ‌లం నిడివిపెంచ‌డానికే అన్నట్టుంది. నిర్మాణ విలువ‌లు.. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స్థాయిలో లేవు. సినిమాని చుట్టేయాల‌న్న తాప‌త్రయం క‌నిపించింది.

టైమ్ పాస్ అయిపోయే సినిమా ఇది. అదీ… ఫ‌స్టాఫ్ వ‌ర‌కూ మాత్రమే. చాలా సింపుల్ క‌థ‌ని.. సింపుల్‌గా తేల్చేసి.. సింపుల్‌గా చుట్టేశారు! ఫలితం కూడా ఇంతే సింపుల్‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు