రివ్యూ : దృశ్యం

drishyam telugu movie review rating
ఓ మంచి క‌థ‌కి ఏదీ అడ్డు కాకూడ‌దు. స్టార్ డ‌మ్‌, ఇమేజ్ స్పీడ్ బ్రేక‌ర్లుగా నిల‌వ‌కూడ‌దు. నేల‌ని విడ‌చి సాము అస్స‌లు చేయ‌కూడ‌దు. అలాంట‌ప్పుడే – సామాన్య ప్రేక్ష‌కుడి హృద‌యాన్ని ట‌చ్ చేసే సినిమాలు వ‌స్తుంటాయి. అయితే క‌థ‌ని క‌థ‌గా తీసే ప్ర‌య‌త్నంలోనే మ‌న ద‌ర్శ‌కులు విఫ‌ల‌మ‌వుతున్నారు. ఓ క‌థ‌లో స్టార్ హీరో చేర‌గానే… కలుషితం అవ్వ‌డం మొద‌ల‌వుతుంది. ఆ హీరో ఇమేజ్‌కి అనుగుణంగా సీన్స్‌, ఆ హీరో ఫ్యాన్స్ కోసం పాట‌లు, ఆ హీరో స్టార్ డ‌మ్‌ని కాపాడే ప్ర‌య‌త్నంలో ఫైట్లూ జోడించుకొంటూ పోయి…. క‌థ‌ని కాకులు చింపిన విస్త‌రి చేస్తుంటారు. దాంతో మంచి క‌థ‌లు కూడా మ‌లిన‌మైపోతున్నాయి. ఇలాంటి అన‌వ‌స‌ర‌మైన హంగుల‌న్నీ ప‌క్క‌న పెట్టి, ఓ క‌థ‌ని బ‌తికించే ప్ర‌య‌త్నం చేసింది `దృశ్యం`. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ చేసిన ఈ దృశ్యం.. తెలుగులో వెంకటేష్ క‌థానాయ‌కుడిగా రీమేక్ అయ్యింది. మ‌రి మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్‌కి వ‌చ్చిన రిజ‌ల్టే… వెంకీకీ ద‌క్క‌బోతోందా?? ఈ ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కూ చేరువ అవుతుంది?? ఈసినిమాతో తెలుగు సినిమా కొత్త‌గా నేర్చుకొన్న పాఠాలేంటి?? చూద్దాం. రండి.

రాంబాబు (వెంక‌టేష్‌) ఓ కేబుల్ ఆప‌రేట‌ర్‌. ఊరికి దూరంగా ఇల్లు. ఊర్లో షాపు. సినిమాలంటే పిచ్చి. ఎంత పిచ్చంటే రాత్రంతా సినిమాలు చూడ‌డం కోసం ఇంటికి కూడా వెళ్ల‌డు. ఏదైనా స‌మ‌స్యొస్తే… ఆ స‌మ‌స్య‌కి ఏ సినిమాలో ఏ హీరో ఎలాంటి ప‌రిష్కార మార్గం క‌నుక్కొన్నాడో ఆలోచించి… అదే ప‌ద్ధ‌తి ఇక్క‌డా ఫాలో అయిపోతాడు. త‌న‌కు త‌న కుటుంబం అంటే ప్రాణం. భార్య జ్యోతి (మీనా) ఇద్ద‌రు పిల్ల‌ల‌తో… స‌ర‌దాగా జీవితాన్ని సాగిస్తుంటాడు. అయితే.. అనుకోకుండా రాంబాబు జీవితంలో అతి పెద్ద కుదుపు. పెద్ద కూతురు అంజూని వ‌రుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఆవిష‌యం రాంబాబుకి తెలీదు. ఈ సంగ‌తి తెలిసేలోగా… త‌న కూతురు అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు వ‌రుణ్‌. వ‌రుణ్ ఎవ‌రో కాదు… ఐజీ గీతా ప్ర‌భాక‌ర్ (న‌దియా) గారాల కొడుకు. త‌న కొడుకు ఆచూకీ కోసం ముమ్మ‌ర‌మైన గాలింపు మొద‌లెడుతుంది గీత‌. వ‌రుణ్ త‌ప్పిపోయిన రోజు… రాంబాబు ఇంటికి వెళ్లాడ‌న్న సాక్ష్యాలు ల‌భ్య‌మ‌వుతాయి. కానీ త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోవ‌డానికి రాంబాబు…. త‌న‌కున్న సినిమా తెలివితేట‌ల్ని ఉప‌యోగించ‌డం మొద‌లెడ‌తాడు. పోలీసుల నుంచి త‌న కుటుంబాన్ని ఎలా ర‌క్షించుకొన్నాడు?? అందుకోసం ఎలాంటి ఎత్తులు వేశాడు?? పోలీసుల్ని ఎలా ఆటాడించాడు?? అన్న‌దే దృశ్యం క‌థ‌.

ముందే చెప్పిన‌ట్టు మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన దృశ్యం సినిమాకి రీమేక్ ఇది. పేరునేకాదు… క‌థ‌, క‌థ‌నాల్నీ, ఆఖ‌రికి డైలాగుల‌నీ వీలైనంత వ‌రకూ య‌ధావిధిగా దింపేసే ప్ర‌య‌త్నం చేశాడు. కూతుర్ని, త‌న కుటుంబాన్నీ కాపాడుకోవ‌డానికి ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి ఆడిన మైండ్ గేమ్ ఈ సినిమా. కాబ‌ట్టి.. నేటివిటీలో పెద్ద‌గా మార్పులు చేయాల్సిన అవ‌స‌రం రాలేదు. మ‌ల‌యాళ ద‌ర్శ‌కురాలే.. తెలుగు సినిమా తీయ‌డం మ‌రిం త క‌లిసొచ్చింది. అక్క‌డ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ ఇక్క‌డా దింపేసింది. అయితే… అదే స‌మ‌యంలో ఫీల్‌ని క్యారీ చేయ‌డంలో కూడా స‌క్సెస్ అయ్యింది. అందుకే… యాజ్ ఇట్ ఈజ్ దింపేసినా… మాతృక‌లో ఉన్న ఆత్మ ఎక్క‌డా మిస్ కాలేదు. ఓ పెద్ద హీరో సినిమా అంటే క‌చ్చితంగా అత‌ని కోసం కొన్ని మార్పులు చేయాల్సిందే. ఫ్యాన్స్ ఫీల‌వుతారు అనే వంక పెట్టి హీరోయిజం ఎలివేట్ స‌న్నివేశాల్ని జోడిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. క‌థ మాత్ర‌మే హీరో. దాన్ని ముందుండి న‌డిపించిన పాత్ర రాంబాబుది. ప్రేక్ష‌కుల్లోనూ అలాంటి ఫీలింగే క‌లుగుతుంది. తెర‌పై రాంబాబుని ఓ సామాన్య మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రిగానే చూస్తాం. అలా ఎప్పుడేతే అనుకొన్నామో, అప్ప‌టి నుంచే సినిమా స‌క్సెస్ బాటలో న‌డ‌వ‌డం మొద‌ల‌వుతుంది.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలోకి క‌థ న‌డ‌వ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకొంటుంది. రాంబాబు కుటుంబ వ్య‌వ‌హారాలు, అత‌ని మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వం చూపించ‌డానికి ఆ స‌న్నివేశాలు వాడుకొన్నారు. వెంకీలోని రొమాంటిక్ యాంగిల్‌ని ఈ స‌న్నివేశాల్లోనే చూపించే అవ‌కాశం ద‌క్కింది. థ్రిల్ల‌ర్ సినిమాకి వ‌చ్చే చిక్కు ఒక‌టుంది. టేకాఫ్ కి కాస్త స‌మ‌యం తీసుకొంటుంది. అక్క‌డి వ‌ర‌కూ ఓపిగ్గా చూస్తే… ఆ త‌ర‌వాత సినిమాలోని థ్రిల్ అనుభవించొచ్చు. కాసేప‌ట్లో ఇంట్ర‌వెల్ అన‌గా…. కథ హైవే ఎక్కేస్తుంది. ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ ఆగ‌కుండా ప‌రిగెడుతుంటుంది. రాంబాబు ఆలోచ‌న‌లు, పోలీసుల ఇన్విస్టిగేష‌న్‌… ప్రేక్ష‌కుడిన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. రాంబాబు దొరికిపోతాడేమో..? అన్న టెన్ష‌న్ క్రియేట్ చేసి త‌ద్వారా ప్రేక్ష‌కుడిని సీట్లోంచి క‌ద‌ల‌కుండా చేసింది ద‌ర్శ‌కురాలు. ఆమె పనిత‌నం, స్ర్కీన్ ప్లే… ఈ సినిమాకి ఆయువు ప‌ట్టుగా నిలిచాయి.

రాంబాబు పాత్రలో వెంక‌టేష్ ఒదిగిపోయిన విధానం అంద‌రికీ న‌చ్చుతుంది. అత‌నో ఫ్యామిలీ హీరో! చాలా కాలం త‌ర‌వాత త‌న బ్రాండ్ న‌ట‌న చూపించాడు. కుటుబం అంటే ప్రాణం పెట్టే ఓ తండ్రిగా, మ‌ధ్య‌త‌ర‌గ‌తి మాన‌వుడిగా, కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్‌గా, రొమాంటిక్ భ‌ర్త‌గా ఇలా ప‌లు కోణాలున్న పాత్ర‌కు సునాయ‌సంగా న్యాయం చేశారు. చాలా కాలం త‌ర‌వాత మీనా తెర‌పై క‌నిపించింది. మీనా పాత్ర‌.. ఈ సినిమాకి మ‌రో ప్ర‌ధాన ఎస్సెట్‌. ఆమె కూడా త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించింది. తెర‌పై వెంకీ – మీనా రొమాన్స్ చేస్తుంటే ముదురు త‌నం అనిపించ‌దు. అదీ… ముచ్చ‌ట‌గానే ఉంటుంది. ఇక పిల్ల‌లుగా చేసిన ఇద్ద‌రూ…. చ‌క్క‌టి ప‌రిణితితో ఆక‌ట్టుకొన్నారు. తాను ఓ బాధ్య‌త గల పోలీస్ అధికారిణి అని కూడా మ‌ర్చిపోయి, త‌న బిడ్డ కోసం త‌ల్లిగా న‌దియా ప‌డిన ఆరాటం ఆమె పాత్ర‌ని బాగా ఎలివేట్ చేసింది. మిగిలిన పాత్ర‌ధారులంతా… రాణించారు.

ఈ సినిమాని వీలైనంత త‌క్కువ బ‌డ్జెట్‌లో లాగించేద్దాం అనుకొన్నారేమో నిర్మాత‌లు. కాస్త.. సాదా సీదాగానే తీశారు. నిజానికి అదే క‌రెక్ట్‌. ఎందుకంటే సినిమాలో క్వాలిటీ కంటే.. క‌థ‌లో ఉన్న క్వాలిటీనే ముఖ్యం. అది ఈ సినిమాలో కావ‌ల్సినంత ఉంది. అయినా స‌రే.. ఎస్‌.గోపాల్ రెడ్డి త‌న‌వంతుగా ఏ లోటూ రాకుండా చేశారు. సంగీతం, కూర్పు… ఆక‌ట్టుకొంటాయి. ఇక స్ర్కీన్ ప్లే.. సూప‌ర్బ్‌. సంభాష‌ణ‌ల్లో నాట‌కీయ‌త చాలా త‌క్కువ‌. మ‌ల‌యాళంలో సినిమాని హిట్ చేయడానికి ఎలాంటి మ్యాజిక్‌లు న‌మ్ముకొందో… ఇక్క‌డా అదే అప్ల‌య్ చేసింది శ్రీ‌ప్రియ‌.

క‌థే హీరో. ఈమాట‌కు తిరుగులేదు. ఈ సిద్దాంతం నమ్ముకొంటే మంచి క‌థ‌లొస్తాయి. స్టార్స్ కూడా త‌మ ఇమేజ్ ని ప‌క్క‌న పెట్ట‌డానికి ధైర్యం చేస్తే… మ‌నం, దృశ్యంలాంటి మంచి ప్ర‌య‌త్నాలు చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. దృశ్యం సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో కొత్త ఆలోచ‌న‌ల‌కు బీజం ప‌డుతుంది అని చెప్ప‌డంలో ఎలాంటి సంశ‌యం అక్క‌ర్లెద్దు. కుటుంబమంతా క‌ల‌సి చూసి థ్రిల్ ఫీల‌య్యే సినిమాగా… దృశ్యం మిగిలిపోతుంది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.5/5                               – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.