రివ్యూ: హృదయ కాలేయం

hrudaya

రివ్యూ :  పిచ్చి పీక్‌కి వెళ్లింది     Click here for English Review

నేనే సంపూ… ముద్దుపేరూ తెగింపూ
– మినిమం ఇలాంటి పాట ఏ మాస్ హీరోకి ఇచ్చినా విజిల్సూ, ఈల‌లే! తారు డ‌బ్బాలోంచి తీసిన ఫేసు, జాన‌తో కొలిస్తే.. ఇంకొంత మిగిలిపోయే హైటు, ఎత్తు ప‌ళ్లు, చింపిరి జుట్టు… ప‌ట్ట‌ప‌గ‌లు చూస్తే, మిట్ట‌మ‌ధ్యాహ్న‌మే క‌ల‌లో కొచ్చే రూపం ఈ పాట‌కు స్టెప్పేస్తే ఎలా ఉంటుంది.!

ఎవ‌రు నువ్వు అని అడ‌గ్గానే.. 
ప‌వ‌న్ స్టైల్‌లో మెడ రుద్దుకొంటూ `హీరో…` అని ఫొర్స్‌ గా చెబితే ఏమ‌వుతుంది..?
పిల్ల‌కాకిలా ఉండే హీరో.. ఒంటిచేత్తే వందమందిని కొట్టేస్తోంటే క‌రెంట్ స్థంభాల్ని పీకేసి దాన్నే మార‌ణాయుధాలుగా ఉప‌యోగిస్తే ఏమ‌వుతుంది?
హృద‌య‌కాలేయం అనే సినిమా త‌యార‌వుతుంది. ఫేస్ బుక్ అల‌వాటు ప‌డ్డ‌వాళ్ల‌కి చ‌మ‌త్కారాలూ బాగా అల‌వాట‌వుతాయి. చిన్నసైజు కొత్త‌ద‌నం కూడా షేర్లు చేసుకొంటూ పెద్ద‌ది చేసేస్తారు. ఫేస్ వాల్యూలేని సంపూబాబు అలానే ఫేస్‌ బుక్‌ స్టార్ అయ్యాడు. వీడు హీరో ఏంటెహె.. అనుకోవ‌డం సంపూకి ప్ల‌స్ అయ్యింది. వీడేం చేస్తాడో చూద్దాం అనుకొన్నారు. అందుకే ఈ సినిమాకి ఊహించ‌నంత క్రేజ్ వ‌చ్చింది. మ‌రి ఆ క్రేజ్ ఈ సినిమా ఎంత వ‌ర‌కూ క్యాష్ చేసుకోగ‌లిగింది? సంపూ ఎలా ఉన్నాడు? ఏం చేశాడు? తెలుసుకొందాం రండీ.

న‌గ‌రంలో భారీ ఎత్తున దొంగ‌త‌నాలు జ‌రుగుతుంటాయి. సూప‌ర్ మార్కెట్లు, ఎలక్ట్రిక‌ల్ మాల్స్ లో ఎక్కువ‌గా దొంగ‌త‌నాలు జ‌రుగుతుంటాయి. పోలీస్ డిపార్ట్‌ మెంట్‌ కి ఓ స‌వాల్ గా మారుతుంది. ఆ దొంగత‌నాలు ఎవ‌రు చేస్తున్నారో అంతుప‌ట్ట‌దు. భైర‌వ్ రాథోడ్ ఈ కేసు ఛేధించ‌డానికి రంగంలోకి దిగుతాడు. చివ‌రికి అది సంపూ అని తేలుతుంది. సంపూ ఎవ‌రో కాదు.. ఓ సైంటిస్ట్‌. అత‌నికి ఓ ప్రేమ క‌థ ఉంది. ఇంత‌కీ సంపూ ఎందుకు దొంగ‌త‌నాలు చేస్తున్నాడు? ఏం చేద్దామ‌నుకొన్నాడు? అత‌ని వెనుక క‌థేంటి? అనేదే హృద‌య‌కాలేయం స్టోరీ.

స్టోరీ ప‌క్క‌న పెట్టండి సార్‌. ఈ మాత్రం స్టోరీ ఏ సినిమాలో అయినా ఉంటుంది. ప్ర‌తీ సినిమాలోనూ సంపూ ఉండ‌డు క‌దా?? అందుకే ఈ సినిమాలో స్టోరీ వ‌దిలేసి సంపూబాబుపై లుక్కేస్తారు జ‌నాలంతా. ఈ సినిమాకి ఏకైక‌, ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ సంపూనే. అత‌ని మాట‌లు, చేష్ట‌లు, బాడీ లాంగ్వేజ్ అన్నీ కిత‌కిత‌లు పెట్టిస్తాయి. ద‌ర్శ‌కుడు స్టీవెన్ శంక‌ర్ ఒక్క‌టే అనుకొన్నాడు.. సంపూతో ఎంత వెట‌కారం చేయిస్తే ఈ సినిమా అంత క్లిక్ అవుతుంది అని. అదే చేశాడు. ఈ వెట‌కారం వర్కవుట్ అయ్యింది. స్టార్ హీరోకి ఇచ్చే బిల్డ‌ప్ షాట్స్‌, ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ సంపూచేత చెప్పించారు. దాంతో… హాయిగా న‌వ్వుకొన్నారు జ‌నాలంతా. ఒక ద‌శ‌లో సంపూ.. క‌దిలినా న‌వ్వొచ్చేసేది. దాంతో ఈ సినిమాలో వినోదం పండింది. సాధార‌ణంగా వెట‌కారం కోసం మ‌రో సినిమాకి పేర‌డీ చేస్తూ స‌న్నివేశాలు రాసుకొంటారు. కానీ ఈ సినిమాలో అలా జ‌ర‌గ‌లేదు. ఏ సినిమానీ పేర‌డీ చేయ‌లేదు గానీ… సంపూబాబులోనే హీరోలంతా క‌నిపిస్తారు. అత‌నికి రాసుకొన్న డైలాగులు కూడా బాగున్నాయి. దాంతో ఏమైతే ఆశించి థియేట‌ర్ల‌కు వెళ్తారో.. అవ‌న్నీ పొందొచ్చు.

ఇదో కొత్త జోన‌ర్‌. ఫేస్ వాల్యూలోని ఓ వ్య‌క్తికి హీరోలాంటి బిల్డ‌ప్ ఇచ్చి వినోదం పుట్టించ‌డం. సాధార‌ణంగా మ‌న సినిమాల్లో కామెడీ ట్రాక్‌ గా వ‌చ్చే ఎపిసోడ్‌… ఓ సినిమాగా తీశాడు స్టీవెన్ శంక‌ర్‌. ఈ ఎత్తుగ‌డ‌కు ఫేస్ బుక్ లాంటి ప్ర‌చార మాధ్య‌మం వాడుకొన్నాడు. మీడియా కూడా సంపూ ఏం చేసినా స‌రే, మంచి హైప్ ఇచ్చింది. దాంతో.. ఈ సినిమా కోసం జ‌నాలు ఆస‌క్తిగా ఎదురుచూశారు. అయితే.. సంపూ ఒక్క‌టే చేయాల్సిన ఓవ‌ర్ యాక్ష‌న్‌.. మిగ‌తావాళ్లూ చేసేస్తుంటారు. దాంతో.. కామెడీ కాస్త శ్రుతి మించుతుంది. సంపూని చూసి న‌వ్వుకొన్న జ‌నాలు.. మిగ‌తావాళ్ల‌ని చూసి భ‌య‌పడేంత స్టేజ్ వ‌స్తుంది. సంపూ ఉన్న ఫ్రేములూ, అందునా డైలాగులు పేలిన స‌న్నివేశాలు మాత్ర‌మే ప్రేక్ష‌కుల‌కు రిలీఫ్. వాటి కోసం మిగిలిన స‌న అంతా భ‌రించాలి. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత ద‌ర్శ‌కుడు ఏం చేయ‌లేక‌పోయాడు. అతి… మ‌రింత వికృత రూపం దాల్చి, పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్లినంత ప‌నైంది. అందుకే… సినిమా అంతా కంగాళీగా త‌యారైంది. సెంటిస్ట్ అవ‌తారంలో సంపూ చేసేవ‌న్నీ చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి సినిమాల్లో లాజిక్ వెత‌కాల్సిన అవ‌స‌రం లేదు. కానీ క‌థ‌లో మూడ్ క్రియేట్ చేయ‌డానికైనా కాస్త వాటి గురించి ఆలోచించాల్సింది. సంపూ త‌ప్ప మిగిలిన క్యారెక్ట‌ర్లంద‌రినీ డిలీట్ చేయాలన్న కోపం వ‌స్తుంది. కామెడీ ట్రాక్ ఐదు, మ‌హా అయితే ప‌ది నిమిషాలు చూడొచ్చు. సినిమా అంతా అదే అయితే… న‌స పెరుగుతుంది.

చిన్న సినిమా అయినా స‌రే, నీట్‌గా ప్ర‌జెంట్ చేశారు. ఈ మాత్రం కెమెరా వ‌ర్క్‌… ఓమాదిరి సినిమాల్లో సైతం క‌నిపించ‌డం లేదు. డైలాగ్స్ బాగున్నాయి. ఒక విధంగా సంపూ త‌ర‌వాత ఈ సినిమాని ఆదుకొంది అదే. నేనే సంపూ పాట ఒక్క‌టే బాగుంది. మిగిలిన‌వి అవ‌స‌రం లేదు. సంపూ డాన్సింగ్ విన్యాసాలు ఆ ఒక్క పాట‌లో చూపించి స‌రిపెట్టుకొంటే బాగుండును. క‌థానాయిక చూడ్డానికి అందంగా లేదు. న‌ట‌న ప‌ర‌మ‌వికారంగా ఉంది. సంపూ ప‌క్క‌న న‌టించ‌డానికి మిగ‌తావాళ్లు భ‌య‌ప‌డితే.. ఈమెను ఎంచుకొన్నారేమో..?? ఫేస్ బుక్‌లో సంపూ గురించి తెలిసిన వాళ్లు మాత్ర‌మే ఈ సినిమాని ఎంజాయ్ చేయ‌గ‌ల‌రు. మిగిలిన వాళ్లు..వీడు హీరో ఏంటెహె.. అనుకొని ఛీ కొట్టినా కొడ‌తారు. ఆ ప్ర‌మాదం ఈ సినిమాకి ఉంది. పోస్ట‌ర్ల‌లో క‌నిపించిన సంపూ…. తెర‌పై ఎలా ఉంటాడో ఆస‌క్తి క‌లిగిన‌వాళ్లు, కాసేపు న‌వ్వుకొందాం అనుకొన్న‌వాళ్లు ఎలాంటి అంచ‌నాలూ లేకుండా ఈ సినిమా చూడండి. కాస్త‌లో కాస్త బెట‌ర్ గా పీల‌వుతారు. అతిని కాస్త కూడా త‌ట్టుకోలేనివాళ్లు, సంపూ అంటే ప‌రిచ‌యం లేనివాళ్లు ఈ సినిమా వెళ్తే.. హృద‌య వికారంగా బ‌య‌ట‌కు వ‌స్తారు. అప్పుడు మ‌మ్మ‌ల్ని అడ‌క్కండి.

తెలుగు మిర్చి రేటింగ్స్ : * హృద‌యాకాలేయంకి రేటింగుల్లేవు. బ‌ర్నింగ్ స్టార్ ఫ్యాన్స్ కి చూపించిన చుక్క‌లు మేమిచ్చే స్టార్ల‌కంటే ఎక్కువ‌.

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Review