రివ్యూ : ఐస్ క్రీమ్‌

Ice-cream-review
చప్ప‌టి ఐస్ క్రీమ్‌ : తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5  |Click here for English Review|

వ‌ర్మ నిజంగానే జ‌నాల్ని భ‌య‌పెడుతున్నాడు. దెయ్యం సినిమాలు తీసి కాదు, దౌర్భాగ్య‌పు సినిమాలు తీసి. వ‌ర్మ ఇలా అయిపోయాడేంటి?? ఇంత‌కు దిగ‌జారిపోయాడేంటి? ఇంత‌లా మారిపోయాడేంటి? అస‌లు సిస‌లైన వ‌ర్మ‌ని మ‌నం ఇంకెప్పుడూ చూళ్లేమా..? అనే భ‌యం మ‌న‌ది. ఆ భ‌యాన్ని మ‌రోసారి `భూత‌`ద్దంలోంచి చూపించి… ఇంకాస్త భ‌య‌పెట్టాడు వ‌ర్మ‌! నానాటికీ తీసిక‌ట్టు నాగంబొట్టులా త‌యార‌వుతున్న వ‌ర్మలోని ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు తాజా తార్కాణం… ఐస్ క్రీమ్‌.

సినిమా అంతా ఒక ఇంట్లోనే లాగించేయ‌డం వ‌ర్మ‌కు ఎప్ప‌టి నుంచో అల‌వాటే. ఈసారీ అదే ఫార్ములాలో వెళ్లిపోయాడు. ఓ కుటుంబం కొత్త‌గా ఓ ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది. బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్తూ అమ్మాయి రేను (తేజ‌స్వి)ని వ‌దిలి వెళ్తారు. ఆ ఇంట్లో ఒంట‌రిగా ఉన్న రేనుకి త‌లుపు చ‌ప్పుడు అవుతున్న‌ట్టు.. ఏవేవో శ‌బ్దాలు వినిపిస్తుంట‌తాయి. ఆ ఇంట్లో తాను కాకుండా మ‌రొక‌రెవ‌రో ఉన్న‌ట్టు అనుమానం వేస్తుంది. బోయ్ ఫ్రెండ్ విశాల్ (న‌వ‌దీప్‌)ని పిలిస్తే… ఇదంతా నీ భ్ర‌మ అని కొట్టి పారేస్తుంటాడు. విశాల్ బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాత్రం.. మ‌ళ్లీ శ‌బ్దాలు మొద‌ల‌వుతుంటాయి. స‌డ‌న్‌గా ఓ ముస‌ల‌మ్మ క‌నిపిస్తుంది. ఆమె ఎవ‌రు..? దెయ్యమా? లేదంటే మ‌నిషేనా? ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా? లేదంటే అదంతా రేను భ్ర‌మ మాత్ర‌మేనా? అన్న‌ది ఐస్ క్రీమ్ చ‌ప్ప‌రిస్తేగానే తెలీదు.

బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌న అని బిల్డ‌ప్ ఇచ్చాడు వ‌ర్మ‌. అయితే అంత సీన్‌.. ఈ సినిమాకి లేద‌నిపిస్తుంది. రాము ఇది వ‌ర‌కు తీసిన దెయ్యం క‌థ‌ల్లానే.. ఈ క‌థ కూడా అత్యంత నాసిర‌కంగా రాసుకొని `య‌దార్థ సంఘ‌ట‌న‌` అన్న‌ట్టు బిల్డ‌ప్పులు ఇచ్చాడు. క‌థాలోపం త‌న‌ది కాద‌న్న‌ట్టు త‌ప్పించుకొన్నాడు. వ‌ర్మ సినిమాల్లో క‌థ‌ల్ని వెదుక్కోవ‌డం కంటే మ‌రో బుద్ది త‌క్కువ ప‌ని మ‌రోటి ఉండ‌దు. అందుకే అలాంటి ప్ర‌య‌త్నాల జోలికి వెళ్లొద్దు. హార‌ర్ సినిమాల్లో క‌థ కంటే.. భ‌యంకే ఎక్కువ ప్రాధాన్యం. క‌నీసం ఆ విష‌యంలోనైనా వ‌ర్మ సంతోష‌పెట్టాడా?? అంటే అదీ లేకుండా పోయింది. కేవ‌లం సౌండ్ సిస్ట‌మ్‌తో, భ‌యంక‌ర‌మైన బొమ్మ‌ల‌తో వ‌ర్మ ఎంత కాల‌మ‌ని ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెడ‌తాడు…?? థియేట‌ర్ మొత్తాన్ని చీక‌టి చేసేసి.. స‌డ‌న్‌గా సౌండ్ పెంచితే… గుండె వేగం ఎవ్వ‌రికైనా పెరుగుతుంది. ఆ మాత్రం చేయ‌డానికి వ‌ర్మే సినిమా తీయాలా??

సినిమా అంతా రేణు పాత్ర చుట్టూనే న‌డిపాడు. న‌వ‌దీప్‌, ఆ ముసలి దెయ్యం అప్పుడ‌ప్పుడు గెస్ట్ ఎప్పీరియ‌న్స్‌లా వ‌స్తుంటారంతే. రేణు మొహాన్ని ఎంత‌సేప‌ని భ‌రించ‌గ‌లం?? ప‌డుకొంటుంది, ఇల్లాంతా పిచ్చిప‌ట్టిన‌ట్టు తిరుగుతుంటుంది, లేదంటే పియానో వాయించుకొంటుంది…. ఇంత‌కు మించి రేణు పాత్ర చేసేది ఏముంది? మ‌ధ్య మ‌ధ్య‌లో త‌లుపు చ‌ప్పుడు, ఆ ఇంట్లో ఎవ‌రో ఉన్న‌ట్టు బిల్డ‌ప్పులు. దెయ్యం సినిమా అంటే ఇదేనా?? అనిపిస్తుంది. భ‌య‌ప‌డ‌డం దేవుడెరుగు. వ‌ర్మ చేసిన కొన్ని పిచ్చి ప్ర‌య‌త్నాల‌కు న‌వ్వుకూడా వ‌స్తుంటుంది. భ‌యంక‌ర‌మైన సెంటిమెంట్ సినిమా తీస్తే.. ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రంగా అవార్డు ఇస్తే… ఎంత ద‌రిద్రంగా ఉంటుంది..? ఈ సినిమా కూడా అంతే. భ‌య‌పెడ‌దామ‌నుకొన్న వ‌ర్మ‌.. ప్రేక్ష‌కుల్ని న‌వ్వించి బ‌య‌ట‌కు పంచాడు. అవేమైనా ఆరోగ్య‌క‌ర‌మైన న‌వ్వులా అంటే అదీ కాదు. ఏడ్వ‌లేక న‌వ్వ‌డ‌మ‌న్న‌మాట‌.

తేజ‌స్వి న‌ట‌న ఓకే. కొన్ని సార్లు అతి చేసింది గానీ… చాలా సంద‌ర్భాల్లో మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. భ‌యం కంటే… గ్లామ‌రే ఎక్కువ చూపించాల‌న్న త‌ప‌న క‌నిపించింది. న్యూడ్ సీన్ ఉంది అని కొంత‌మంది ఆశ ప‌డి థియేట‌ర్ల‌కు రావొచ్చు. అదేం లేదు ఈ సినిమాలో. సెన్సార్‌లో క‌త్తిరించారో, లేదంటే జ‌నాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి ఈ డ్రామా ఆడాడో తెలీదుగానీ…. ఆ స‌న్నివేశం ఈ సినిమాలో లేదు. న‌వ‌దీప్ ది గెస్ట్ పాత్రే. ఈ మాత్రం దానికి ఏం చేస్తాలే అనుకొని మ‌నోడూ లైట్ తీసుకొన్నాడు. తెర‌పై క‌నిపించే మిగ‌తా రెండు మూడు పాత్ర‌ల‌కూ ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ఫ్లో కేమ్ అనే టెక్నాల‌జీని ఈ సినిమాతో ప్ర‌వేశ పెట్టాడు వ‌ర్మ‌. ఫ్లో సౌండ్ అనే విధానం కూడా వాడాడు. వాటి వ‌ల్ల హార‌ర్ సినిమాలు ఇంకాస్త వెసులుబాటు దొరుకుతుంది. ప్రేక్ష‌కుల్ని ఇంకాస్త క‌థ‌లోకి లాక్కెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఎంత సేప‌ని టెక్నాల‌జీతో భ‌య‌పెడ‌తాడు…?? క‌థ‌ని బ‌లంగా చెప్పడానికి సాంకేతిక ఉప‌యోగ‌ప‌డాలి. అంతేత‌ప్ప‌… అదొక్క‌టే మ్యాజిక్ చేయ‌లేదు. త‌క్కువ బ‌డ్జెట్‌తో, త‌క్కువ రోజుల్లో సినిమా తీసి కాల‌ర్ ఎగ‌రేస్తుంటాడు వ‌ర్మ‌. దాని వ‌ల్ల ఎవ‌రికి లాభం?? సినిమా క్వాలిటీలోనే కాదు, వ‌ర్మ ఆలోచ‌న‌లూ నాశిర‌కంగానే త‌యార‌య్యాయి. అందుకే ఇలాంటి సినిమాలు తీసి జ‌నాల మీద‌కు వ‌దులుతున్నాడు. వ‌ర్మ మార‌క‌పోతాడా..? వ‌ర్మ నుంచి మ‌రో మంచి సినిమా రాక‌పోతుందా? అనుకొనే వర్గం ఎప్పుడూ ఉంటుంది. వర్మ సినిమా వ‌స్తోంద‌న‌గానే రెక్క‌లు క‌ట్టుకొని వాలిపోయేది వాళ్లే. చివ‌రికి బ‌లైపోయేదీ వాళ్లే. ఈసారీ అదే తంతు!

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5                       – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

|Click here for English Review|