రివ్యూ : జంప్ జీలాని

jump

                             |Click here for English Review|

జంపు కాదు.. కంపు – తెలుగు మిర్చి రేటింగ్స్ :1.5/5

కామెడీ అంటే అంద‌రికీ కామెడీ అయిపోయింది. సీనుకో ముత‌క జోకు, అర్థం ప‌ర్థం లేని స‌న్నివేశాలు, లాజిక్ లేని క‌థ‌లు.. జోడించి బ‌మ్మిని తిమ్మి చేస్తున్నారు. ప్రేక్షకుల్ని బ‌క‌రాల్ని చేస్తున్నారు. మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుకోవ‌డం మాట ప‌క్క‌నుంచితే… ఈ సినిమాకి ఎందుకొచ్చాంరా బాబూ… అంటూ త‌ల‌లు ప‌ట్టుకోవ‌డం ఒక్క‌టే త‌రువాయి. కామెడీ సినిమా క‌దా.. న‌వ్వుకోక‌పోతే – చుట్టు ప‌క్క‌ల వాళ్లు హాస్య గ్రంధులు లేవ‌నుకొంటార‌ని న‌వ్వాలి త‌ప్ప‌…. న‌వ్వు రాదు. ఆ బాప‌తు సినిమాలు చాలా వ‌చ్చాయి. ఇంకా వ‌స్తున్నాయి. మ‌న దుర‌దృష్టం ఏమిటంటే… ఈ జాబితాలో మ‌న అల్ల‌రి న‌రేష్ కూడా చేరిపోవ‌డం. ఈ విధి వైప‌రీత్యానికి కార‌ణ‌భూత‌మైన సినిమా… జంపు జిలానీ.

స‌త్తిబాబు, రాంబాబు (ఇద్ద‌రూ న‌రేష్‌లే) అన్నాద‌మ్ములు. స‌త్తిబాబు.. బుద్దిమంతుడు. ఎలాగైనా స‌రే… త‌న తాత‌ల కాలంనాటి హోట‌ల్‌ ని డ‌వల‌ప్ చేయాల‌ని అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తుంటాడు. కానీ… ఆ హోట‌ల్‌ కి క‌ష్ట‌మ‌ర్ల క‌రువు. ఊరంతా అప్పులు పెరుగుతుంటాయి. మ‌రోవైపు రాంబాబు జ‌ల్సా రాయుడు. పేకాట పిచ్చి. చేతివాటం ఎక్కువ. దొంగ‌త‌నం చేస్తూ దొరికిపోయి.. జైలుకి కూడా వెళ్తాడు. మాధ‌వి (ఇషా చావ్లా)ని ప్రేమిస్తాడు స‌త్తిబాబు. ఆమె ఫుడ్ ఇన‌స్పెక్ట‌ర్‌ గా ప‌నిచేస్తుంటుంది. జైలు నుంచి వ‌చ్చిన రాంబాబు త‌న మ‌ర‌ద‌లు పిల్ల‌ని లైన్‌ లో పెట్టుకొంటుంటాడు. తాత‌య్య (కోట‌) ఇచ్చిన స‌ల‌హాతో హోట‌ల్ ని డ‌వ‌లప్ చేసే వీలు చిక్కుతుంది. అనాకారిగా ఉన్న ఆ హోట‌ల్‌… మంచి లాభాల్లోకి వ‌స్తుంది. ఈ హోట‌ల్ జ‌గా పై ఆ ఊరి పెద్ద మ‌నిషి (బెన‌ర్జీ) క‌న్ను ప‌డుతుంది. ఎలాగైనా ఆ స్థలం ద‌క్కించుకోవాల‌నుకొంటాడు. పేకాట మోజులో ఆ స్థ‌లాన్ని ఎస్సైకి తాక‌ట్టు పెడ‌తాడు రాంబాబు. ఈలోగా మాధ‌వికి ఊర్లో ఉగ్ర న‌ర‌సింహం (పోసాని)తో పెళ్లి కుదురుతుంది. వాళ్ల‌దో ఫ్యాక్ష‌నిస్టు ఫ్యామిలీ. ఎస్సై నుంచి రాంబాబు త‌న స్థ‌లం డాక్యుమెంట్స్ ఎలా ద‌క్కించుకొన్నాడు? మాధ‌వి పెళ్లిని స‌త్తిబాబు ఎలా అడ్డుకొన్నాడు? అన్న‌దే ఈ సినిమా క‌థ‌. మ‌ధ్య‌లో ప‌దికోట్ల విలువ చేసే వ‌జ్రాల క‌హానీ ఉంది. ఇవ‌న్నీ క‌ల‌సి ఈ క‌థ‌ని, ప్రేక్ష‌కుల్ని ఎన్ని జంపింగులు చేయించిందో తెలియాలంటే జంప్ జిలానీ సినిమా చూడాలి.

క‌ల‌గ‌ల‌ప్పు అనే త‌మిళ సినిమాకి రీమేక్ ఇది. నిజానికి అక్క‌డ నుంచి డ‌బ్బులిచ్చి కొనుక్కోవ‌ల‌సిన మ‌హ‌త్త‌ర‌మైన క‌థ కాదిది. ఇలాంటివి గ‌తంలోనూ చాలా క‌థ‌లొచ్చాయి. అస‌లు ఈ సినిమాలో క‌థంటూ ఉన్న‌దా?? అన్న‌ది మెయిన్ పాయింట్‌. అన్నీ లింకులు లేని స‌న్నివేశాలే. న‌రేష్ ద్విపాత్రాభిన‌యం చేశాడు. ద్విపాత్రాభిన‌యం సినిమాలంటే… క‌న్‌ ఫ్యూజ‌న్ల గోల ఎక్కువ‌గా ఉంటుంది. అన్న‌య్య అనుకొని త‌మ్ముడితో.. త‌మ్ముడు అనుకొని అన్న‌య్య‌తో క‌మిట్ అయిపోతే వ‌చ్చిన వినోదం కూడా బాగుంటుంది. అయితే ఆ యాంగిల్ స‌త్తిబాబు పూర్తిగా వ‌దిలేశాడు. అలాగ‌ని కొత్త పాయింట్ ఏమైనా ప‌ట్టుకొన్నాడా?? అంటే అదీ లేదు. నిజానికి ద్విపాత్రాభిన‌యం డిమాండ్ చేసే క‌థ కాదిది. న‌రేష్ ఒక్క‌డైనా ఓకే! రెండో పాత్ర వ‌ల్ల కొత్త‌గా ఒరిగిందేం లేదు. రెండు పాత్ర‌ల‌కు పేర్లు మార్చి, బుద్దిమంతుడికి క‌ళ్ల‌జోడు పెట్టేశారు.. దాన్నే డ్యూయ‌ల్ రోల్ అనుకోమ‌న్నారు. క‌నీసం గెట‌ప్పుల విష‌యంలోనూ శ్ర‌ద్ధ తీసుకోక‌పోతే ఎలా…?.

సీను త‌ర‌వాత సీను… సీను త‌ర‌వాత సీను వ‌స్తుంటుంది. దేనికీ లింకుఉండ‌దు. ఏది ముందు, ఏది వెనుక అయినా.. పెద్ద‌గా తేడా ఉండ‌దు. కామెడీ ఛాన‌ళ్లో బిట్లు బిట్లు కింద చూసిన ఫీలింగ్‌. అందులోనూ న‌వ్వు ఉండ‌దు. చెప్పాంగా.. ఎందుకొచ్చాంరా భ‌గ‌వంతుడా… అని ఏడ్వ‌లేక న‌వ్వ‌డం త‌ప్ప న‌వ్వు రాద‌ని. స‌న్నివేశ ప‌రంగా కామెడీ సృష్టించ‌లేన‌ప్పుడు డైలాగ్‌ల‌నున‌మ్ముకోవాలి. డైలాగులు రాసుకోలేన‌ప్పుడు స‌న్నివేశాలు త‌మాషాగా తీర్చిదిద్దాలి. ఈ రెండింటి వైఫ‌ల్యం ఈ సినిమాలో స్ప‌స్టంగా క‌నిపించింది. వీక్ క‌థ‌కి మ‌రింత బ‌ల‌హీన‌మైన స‌న్నివేశాలు రాసుకొని… ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్ష పెట్టారు. అస్థి వ్య‌వ‌హారంలోకి క‌థ జంప్ చేయ‌డానికి చాలా స‌మ‌యం తీసుకొంది. సెకండాఫ్‌లో క‌థ‌ రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్టులోకి జంప్ చేస్తుంది. అక్క‌డ మ‌రీ ఘోరం. ధియేట‌ర్లోంచి మ‌నం ఎప్పుడు జంప్ చేయాలా..?? అన్నంత క‌సి, కోపం పెరిగిపోతాయి. సెకండాఫ్‌లో ప్రేక్ష‌కుల్ని మ‌రిన్ని ముప్పుతిప్ప‌లు పెడితే గానీ ద‌ర్శ‌కుడికి స‌ర‌దా తీర‌లేదు.

న‌రేష్ చ‌లాకీ న‌టుడు. ఆ విష‌యంలో తిరుగులేదు. త‌న‌కు అల‌వాటైన దారిలో చేసుకొంటూ పోయాడు. న‌రేష్ ఈ సినిమాతో కొత్త‌గా సాధించిందేం లేదు. అలాగ‌ని పోగొట్టుకోలేదా?? అంటే అదీ ఉంది. త‌న‌పై ప్రేక్ష‌కులు పెట్టుకొన్న న‌మ్మ‌కాన్ని నిలువునా పోగొట్టుకొంటున్నాడు. రొటీన్‌లో ప‌డిపోయి… ముత‌క కామెడీ అందిస్తున్నాడు. ప్రేక్ష‌కులు త‌న‌ని చూసి న‌వ్వ‌ర‌ని. తాను కామెడీ చేస్తేనే న‌వ్వుతార‌న్న విష‌యం గ‌మ‌నించ‌డం లేదు. క‌నీసం రెండో గెట‌ప్ లో డైలాగ్ డెలివ‌రీ మార్చ‌డం కూడా చేయ‌లేదు. ఇక ఈ సినిమా కోసం ఏం క‌ష్ట‌ప‌డిన‌ట్టు. చెప్పుకోవ‌డానికి ఈ సినిమాలో కామెడీ గ్యాంగ్ చాలానే ఉంది. అయితే ఏంలాభం..? అరుచుకోవ‌డాలూ, గోల పెట్ట‌డాలూ త‌ప్ప ఏం చేసిన‌ట్టు..?? ఇద్ద‌రు హీరోయిన్లూ బొమ్మ‌లే. వాళ్ల న‌డుములు చూపించి… త‌రింప‌చేయ‌డం ఒక్క‌టే ప‌నిగా పెట్టుకొన్నారు. రావు ర‌మేష్ ఇప్ప‌టికైనా త‌న డైలాగ్ డెలివ‌రీ మార్చుకొంటే బెట‌ర్.

సంగీతం మ‌రీ అధ‌మ స్థాయిలో ఉంది. పాడుకోవ‌డానికి ఒక్క పాటా బాగోలేదు. పాట‌లూ అడ్డే. నేప‌థ్య సంగీతం గురించి మాట్లాడుకోవ‌ద్దు.. ప్లీజ్‌! ఎడిట‌ర్‌కి ఎక్క‌డ క‌త్తెర్లు వేయాలో అర్థం కాలేదు. ఎంత క‌ట్ చేసినా ఈ సినిమా ఇంతే… అని వ‌దిలేశాడు. సినిమాని మాత్రం రిచ్‌గా తీయాల‌న్న తాప‌త్ర‌యం క‌నిపించింది. డైలాగుల్లో మెరుపులేం లేవు. అవీ సాదా సీదాగానే ఉన్నాయి.

రీమేక్ కథ‌లంటూ మ‌న‌వాళ్లు ఎందుకు ఎగ‌బ‌డుతున్నారో అర్థం కావడం లేదు. మొన్న‌.. ఉల‌వ‌చారు. ఇప్పుడు జంప్ జిలానీ. ఇద్ద‌రూ పప్పులో కాలేశారు. ప్రేక్ష‌కుల్ని ముప్పు తిప్ప‌లు పెట్టారు. ఏరా.. న‌రేష్ సినిమాకి వెళ్తామా అని ఎవ‌రైనా అడిగార‌నుకోండి. మీరు జంప్ జిలానీ అయిపోండి చాలు.. బ‌తికిపోయిన‌ట్టే.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 1.5/5                  – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

|Click here for English Review|