రివ్యూ: ‘కమలతో నా ప్రయాణం’

kamal-to-naa-prayanam

ఆర్ట్ సినిమాకి ఎక్కువ‌.. అవార్డు సినిమాకి తక్కువ‌ : తెలుగు మిర్చి రేటింగ్స్ 2.5/5

Click Here for English Review

ఎంత వింటేజ్ కారు అయినా, ఎడ్లబండికి కట్టి లాగిస్తే చూడగలమా? కారు అందం చూసి ఆనందించాలా? ఎడ్లబండికి కట్టిన వైనం చూసి అయ్యో అనుకోవాలా? అదేం ఖర్మమో, అవార్డు సినిమా అంటే అరడుగు దూరం కూడా అరగంట నడవాలన్న పడికట్టు సూత్రం, ప్రేక్షకులను ఆ తరహా సినిమాలంటే భయపడేలా చేసింది. కళ్ల ముందు మామూలుగా కనిపించే జనం, వీలయినంత నెమ్మదిగా కదులుతూ, మరింత వీలైనంత పొడిపోడిగా మాట్లాడుతూ, వ్యావహారిక జీవితానికి దూరంగా జరిగిపోతారు ఈ తరహా సినిమాల్లో. అసలే అవార్డుకు గురిపెట్టిన సినిమా.దానికి తోడు యాభయ్యవ దశకం నాటి కథాకాలం. ఇంక ఆ సినిమా ఎలా వుంటుంది..’కమలతో నా ప్రయాణం’ చూస్తే తెలుస్తుంది. ఎప్పుడో సానికొంపలు వేరే వుండే కాలంలో బాలగంగాధర్ తిలక్ రాసిన ‘ఊరి చివరి ఇల్లు’ కథ స్పూర్తిగా దర్శకుడు నరసింహ నంది తీసిన సినిమా ఇది. ఇది కేవలం దర్శకుడి తృప్తి కోసం, వీలయితే ఓ అవార్డు అందుకోవచ్చన ఆశతో తీసిన సినిమా తప్ప వేరు కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ కథ ఈకాలానికి నప్పదు. వేశ్యల జీవితంపై తీయాలంటే, ఇప్పటి వ్యవహారాలు స్పృశించాలి. ఆ పని ఇటీవల వచ్చిన చాలా సినిమాలు చేసేసాయి. అందుకే కేవలం తనకోసం దర్శకుడు ఈ సినిమాను తీసుకున్నట్లుంది.

వాయుగుండం ప్రభావంతో, నేలా నింగీ వర్షపు ధారతో ఏకమైన వేళ భీమునిపట్నం వెళ్దామని వస్తూ, దారిలో ఓ ఊరిలో ఆగుతాడు సూర్యనారాయణ (శివాజీ). ఎక్కకో అక్కడ ఆ రాత్రికి తల దాచుకోవాలనుకుంటే, బస్టాండ్ లో టీ అమ్మే కుర్రాడు, కమల (అర్చన) ఇంటికి తీసుకెళ్తాడు. ఆమె ఓ వేశ్య. అనాధ అయిన ఆమెకు పెద్ద దిక్కు ఓ ముసల్ది (పావలా శ్యామల). తనకు ఇష్టం లేకున్నా, కమల వేశ్యగా కొనసాగుతుంటుంది. మరోపక్క స్వేచ్చా విహంగంలా విహరించాలని, తనకంటూ ఓ సంసారం వుండాలన్నది ఆమె కల. అప్పుడప్పుడు సంగీతంతో సేదతీరడం ఆటవిడుపు. విషయం తెలియకుండా ఆమె ఇంటికి వచ్చిన సూర్యం ఒక్క రాత్రిలోనే ఆమెను ఆకట్టుకుంటాడు. తను కూడా ఆమెను పెళ్లాడి, ఆమెను ఆ కూపం లాంటి కొంప నుంచి బయటకు లాగాలనుకుంటాడు. కానీ ఊరి జమీందారు ఆమెపై కన్నేయడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఇలా మలుపు తిరిగిన కమల ప్రయాణం ఏ తీరాలకు చేరిందన్నది మిగిలిన కథ.

ఈ సినిమా జనరంజకమా కాదా అన్నది పక్కన పెడితే, ఓ యాభై ఏళ్ల కిందటి కథా కాలాన్ని, ఆ నాటి నుంచి ఈ నాటి వరకు వున్న సజీవ సమస్యను కళ్ల ముందు కాన్వాస్ పై చిత్రించే ప్రయత్నం చేసినందుకు మెచ్చుకోవాలి. కానీ అదే సమయంలో మళ్లీ కాస్త డబ్బులు వస్తాయన్న ఆశతో, అక్కడక్కడ నీలి చిత్రాల పోకడలు పోయినందుకు అయ్యో అనుకోవాలి. అక్కడ రాజీ పడే బదులు సినిమా టేకింగ్ లో, సంభాషణల్లో కూడా రాజీ పడి వుంటే బాగుండేది. టేకింగ్ సమస్య ఎందుకు వచ్చిందంటే లైన్ కు సరిపడా సన్నివేశాలు లేవు. అందుకోసం సినిమాను కనీస నిడివికి చేర్చేందుకు నత్త నడక నడపాల్సి వచ్చింది. ఇక కాలానుగుణంగా అయినంత మాత్రాన సంభాషణలు అలా పలికించడం కూడా కాస్త ఇబ్బంది కలిగించే అంశం. ఇక మామూలు సినిమాలకు పాత్రలు, ఔచిత్యాలు చూడరు కానీ, ఇలాంటి సినిమాలకు అవి కూడా అవసరం. కమల, ముసల్ది పాత్రలు ఔచిత్యం బాగుంది కానీ, కథానాయకుడి పాత్ర సరిపోలేదు. కమల ఇంటికి వచ్చిన తరువాత ముందు గొప్ప కబుర్లు చెపి, ఆ వెంటనే ఆమెతో శారీరకంగా కలవడం అంత బాగా లేదు. సినిమా చివర్లో కథ కోసం అన్నట్లు అలా ప్రవర్తించడం సరిపోలేదు. ఆ సంఘటన మరింత బలంగా మార్చాల్సింది. స్నేహితుడి ఇంట్లో పిల్లల వ్యవహారం సన్నివేశం కూడా సరిగ్గా పండలేదు. ఇలాంటి దర్శకుడి తప్పిదాలు కొన్ని వున్నాయి. సినిమా కథపై తిలక్ ప్రభావం కొంతవరకు వున్నట్లే శంకరాభరణం ప్రభావం కూడా వున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కమల పాత్ర తీరుతెన్నల్లో. ఆ సంగతి ఎలా వున్నా, చిత్రీకరణకు వర్షం థీమ్ ను ఎన్నకున్నాడు దర్శకుడు నరసింహ నంది.

సినిమా ఆద్యంతం వర్షం కురుస్తూనే వుంటుంది. వర్షం, దానికి తగ్గ నేపథ్య సంగీతం, పాతకాలం నాటి పరిసరాలు, ఆహార్యాలు అన్నీ ఆకట్టుకుంటాయి. కానీ హీరో మాడ్యులేషన్ తప్ప. పైగా హీరో శివాజీ తన మాడ్యులేషన్ ను అలనాటి, నాగేశ్వరరావు, రామారావుల శైలికి దగ్గరగా తీసుకెళ్లాలని చూసినట్లుంది. అది కాస్త కృతకంగా వుంది. దీనికి తోడు కథనాయికగా అర్చన ఆహార్యం బాగానే వుంది. కానీ నటనలో సహజత్వం లేదు. ఏదో నాటకంలో నటిస్తున్నట్లుంది. ఆ పాత్రకు ఆమె జీవం పోయలేకపోయింది. అయితే సినిమా ద్వితీయార్థంలో, క్లయిమాక్స్ లో ఇటు నటులు, అటు దర్శకుడు అందరూ సర్దుకున్నారు. పావలా శ్యామల స్టేజి నుంచి వచ్చిన నటి. ఆమె ఆ పాత్రకు అలా అలా కుదరిపోయింది.

నటనటుల సంగతి అలా వుంచితే సినిమాకు సంగీతం (కె కె) ఫోటోగ్రఫీ (మురళీ మోహన్ రెడ్డి) చక్కగా అమిరాయి. నేపథ్యసంగీతంలో గతకాలపు సినిమాల ప్రభావం చాలా వరకు వుంది. హిందూస్థానీ సంగీతం అక్కడక్కడ హాయిగా వినిపించింది. ఒకటి రెండు పాటలు కూడా బాగున్నాయి. కానీ ఎన్ని బాగుంటేనేం, ముందగా చెప్పుకున్నట్లు, వింటేజ్ కారును, ఎడ్లబండికి కట్టి లాగించినట్లుంది కమలతో నా ప్రయాణం.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5                        – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here for English Review