రివ్యూ : ల‌డ్డుబాబు

laddu babu

మ‌హా జిడ్డు బాబు‘ ల‌డ్డుబాబు’  తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5

ల‌డ్డు బాబుకి ఊబ‌కాయం. కొవ్వు క్వింటాళ్ల లెక్క‌నుంది. పాపం.. అంద‌రూ అత‌న్ని ఉత్తి పుణ్యాకి కొడుతుంటారు
వాళ్ల నాన్న మ‌హాపిసినారి. నిన్ను చిన్న‌ప్పుడే చంపేయాల్సింది అంటుంటాడు.
మ‌రో బాబుకి గుండె జ‌బ్బు..
ఎవ‌రో కిడ్నాప్ చేయాల‌ని చూస్తుంటారు.
బాబుకి నాన్న లేడు…
అమ్మ ఎప్పుడూ ఏడుస్తుంటుంది..
బాబాయ్ మంచోడు కాదు..
సీను సీను సెంటిమెంట్‌తో బ‌రువెక్కిపోతోంది!! గుండె జారిపోతోంది. క‌ర్చీప్‌లు త‌డిసిపోతున్నాయి. ఇలాంటి సినిమాలో హీరో అల్ల‌రి న‌రేష్‌
అంటే మీరేం చేస్తారు…?? ఛీపోవ‌య్యా… క‌థ‌కీ న‌రేష్ ట్రాక్‌కీ ఎక్క‌డైనా మ్యాజింగ్ అయ్యిందా?? అని అడుగుతారు..? అడ‌క్కుండా ఈ క‌థ తెలుసుకోకుండా వెళ్లిన‌వాళ్లు మాత్రం ల‌డ్డుబాబుకి బ‌లైపోతారు..!

ఇంట్రడ‌క్ష‌న్‌లోనే షార్ట్‌గా క‌థ చెప్పేశాం. ఇప్పుడు షార్ప్ గా చెప్పుకొందాం. అదేదో ఓ ర‌క‌మైన దోమ (పేరు చెప్పినా మీకు అర్థం కాదులెండి. అందుకే ఈ రకంగా అన్నాం) ల‌డ్డుబాబుకి కుట్టేస్తుంది. దాంతో స‌న్న‌గా ఉండే ల‌డ్డుబాబు… మ‌హాలావుగా త‌యార‌య్యాడు. ప‌ది డ‌బులెక్స్ క‌డ్రాయ‌ర్లు కొడితేగానీ అత‌నికి ఓ మోస్త‌రు డ్రాయిరు త‌యార‌వ్వ‌దు. అంత‌లావ‌న్న‌మాట‌. అంత‌లావుంటే… పిల్ల‌నెవ‌రిస్తారు..,?? అయినా స‌రే నాన్న కృష్ణ‌య్య (కోట‌) త‌న కొడుక్కి ర‌క‌ర‌కాల సంబంధాల తీసుకొస్తాడు. బ‌ట్ట‌త‌ల వొచ్చిన అమ్మాయి, మీసాలు మొల‌చిన అమ్మాయి, భూమికు జాన‌డున్న మ‌రుగుజ్జు.. చివ‌ర‌కి అవిభ‌క్త క‌వ‌ల‌ల్ని కూడా తీసుకొచ్చి పెళ్లి చేయాల‌నుకొంటాడు. కొడుకు మీద ప్రేమ‌తో కాదు. పెళ్ల‌యితే గానీ.. ఇల్లు అమ్ముకొనే ఛాన్స్ ఉండ‌దు. ఆ డ‌బ్బుల‌తో గోవా ఉడాయించి అక్క‌డ సెటిలైపోవాల‌న్న‌ది కృష్ణ‌య్య ప్లాన్‌. మ‌రోవైపు మూర్తి (మాస్ట‌ర్ అతులిత్‌) అనే ఓ కుర్రాడు ల‌డ్డుబాబుని తెగ హింసింస్తుంటాడు. నాతో ఫ్రెండ్‌షిప్ చేయాల్సిందే అని ప‌ట్టుప‌డుతుంటాడు. ఒంట్లో కొవ్వుతో పాటు ల‌వ్వు చేయాల‌న్న ఆశ కూడా ఉంది ల‌డ్డుబాబుకి. అందుకే మాయ (పూర్ణ‌) అనే అమ్మాయిని తెగ ప్రేమిస్తాడు. మాయ కూడా ల‌డ్డుబాబుని ప్రేమిస్తున్న‌ట్టు న‌టిస్తుంది. వంద కిలోలు త‌గ్గిరా.. అప్పుడు నిన్నే పెళ్లి చేసుకొంటా.. అంటుంది. మ‌రి ల‌డ్డుబాబు వంద కిలోలు త‌గ్గాడా?? ఇంకీ మూర్తి ల‌డ్డుబాబు వెంట ఎందుకు ప‌డుతున్నాడు..?? ఇవ‌న్నీ ల‌డ్డుబాబు చూస్తేగానీ తెలీదు.

ఇదో ఊబ‌కాయుడి క‌థ‌. అత‌ని బాధ‌లు, ప్రేమ పాట్లు.. మ‌ధ్య‌లో ఓ కుర్రాడు త‌ల్లికోసం ప‌డే ఆరాటం – చెప్ప‌లేనంత సెంటిమెంట్ ఉంది ఈ క‌థ‌లో.కానీ న‌రేష్ – ర‌విబాబు సినిమా అంటే ప్రేక్ష‌కులు కామెడీ ఆశిస్తారు. అదొక్క‌టీ వ‌దిలేసి మిగ‌తా దినుసుల‌న్నీ వేసి ద‌ట్టించాల‌నుకొన్నాడు ర‌విబాబు. అక్క‌డే సినిమాకి బాగా తేడా చేసింది. సినిమా అంత‌టికీ ప‌గ‌లప‌డి న‌వ్వే సీన్ ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు. ప్రేక్షకుల్ని న‌వ్వించకూడ‌దు.. అని గ‌ట్టిగా అనుకొని ఈ సినిమా తీశాడేమో అనిపిస్తుంది. లడ్డుబాబుని అంద‌రూ చీద‌రించుకోవ‌డం, బాసుల చేత త‌న్నించుకోవ‌డం, చిన్న పిల్లాడి చేతిలో ప‌రాభ‌వం… వీటితో ఫ‌స్టాఫ్ గ‌డుస్తుంది. రెండోభాగంలో అస‌లు సిస‌లైన ట్రాజెడీ ఉంది. అక్క‌ర్లేని కిడ్నాప్ లు, విల‌న్ ఎంట్రీ… ఇవన్నీ క‌థ‌నే కాదు, థియేట‌ర్లో కూర్చున్న ప్రేక్ష‌కుల్నీ రాచి రంపాన పెట్టేశాయి. న‌వ్వుకొందామ‌ని థియేట‌ర్‌కి వెళ్తే ఇలా అడ్డ‌దిడ్డంగా ఏడిపించేస్తాడేంటి..?? అని బుర్ర గోక్కొవ‌డం ప్రేక్ష‌కుల వంతు అవుతుంది. కోటకు పెళ్లిచేయాల‌నుకొన్న మిత్రుల ప్ర‌హ‌స‌నం…. ఇంకాస్త శిరోభారం క‌లిగింది. ఆయా స‌న్నివేశాలు సినిమా నిడివి పెంచి త‌ల‌నొప్పి మ‌రింత తీవ్ర‌మ‌య్యేలా చేశాయి త‌ప్ప‌… వాటి వ‌ల్ల లాభం శూన్యం. చివ‌ర్లో వేణుమాధ‌వ్ – కోట‌ల మ‌ధ్య కామెడీ సీన్ అతికించారు. అది కూడా బ‌ల‌వంతంగా చ‌క్క‌లిగిలి పెట్టించేదే. సోగ్గాడు సినిమా త‌ర‌వాత ఇంత పేల‌వ‌మైన సినిమా చేయ‌డం ర‌విబాబుకి ఇదే తొలిసారేమో..? ఒక విధంగా చెప్పాలంటే సోగ్గాడే బెట‌రేమో…?

నేను కొంచెం కొత్త‌గా క‌నిపించాలి.. అని త‌ప‌న ప‌డిన న‌రేష్ ల‌డ్డుబాబు పాత్ర చేయ‌డానికి ఒప్పుకొని ఉంటాడు. అది మిన‌హా… ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి ఇంకేం కార‌ణ‌మూ క‌నిపించ‌లేదు. మొహానికి అంత మేక‌ప్ పూసిన త‌ర‌వాత‌.. ఎక్స్ ప్రెష‌న్స్ ఎక్క‌డి నుంచి ప‌లుకుతాయి..?? ఆకారం అటూ ఇటూ క‌దులుతుంది త‌ప్ప ఆ భావాల్ని క్యాచ్ చేయ‌లేం. న‌రేష్ కామెడీ టైమింగ్‌కు తిరుగు ఉండ‌దు. ఈ సినిమాలో అది కూడా చూసే అవ‌కాశం ద‌క్క‌లేదు. భూమిక‌, పూర్ణ‌…. ఇద్ద‌రివీ సో సో పాత్ర‌లే. ఈ సినిమాల‌తో వాళ్ల‌కు ఒరిగేదేమీ లేదు. కోట ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌కుండా ఉండ‌డానికి ట్రై చేశాడు. అతులిత్ బాగా న‌టించాడు. ఈ సినిమాలో న‌రేష్ త‌ర‌వాత ఆక‌ట్టుకొన్న క్యారెక్ట‌ర్ అదొక్క‌టే. మిగ‌తావ‌న్నీ వేస్ట్ పాత్ర‌లే.

ఈమాత్రం క‌థ‌ని నేను కూడా మ్యూజిక్ ఇవ్వాలేంటి?? అనుకొన్నాడు చ‌క్రి. అత‌ని పాట‌లు అలాగే త‌యార‌య్యాయి. కెమెరా, ఆర్ట్ ఇవి రెండూ ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్టే న‌డుచుకొన్నాయి. ఎందుకంటే వాటిల్లోనూ ర‌విబాబు మార్క్ క‌నిపించింది. ఫ‌స్ట్ పాట కాన్సెప్ట్ బాగుంది. అది త‌ప్ప‌… ఈ సినిమాలో ఎక్క‌డా ర‌విబాబు స్టైల్ క‌నిపించ‌లేదు. త‌క్కువ బ‌డ్జెట్‌తో తీసినా.. భారీ లెవిల్లో భ్ర‌మ ప‌ర‌చ‌డం ర‌విబాబుకి అల‌వాటు. ఈ సినిమా ఎంత‌లో తీశాడో గానీ.. నిర్మాణ విలువ‌లు ఫ‌ర్వాలేద‌నిపించే స్థాయిలో ఉన్నాయి. మాట‌ల్లో ప‌దును, పంచ్ రెండూ లేవు.

నరేష్ సినిమా అంటే న‌వ్వుకోవాల్సిందే. ఆ న‌వ్వులు ఈ సినిమాలో లేవు. ర‌విబాబు సినిమాలో మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ కూడా ఈ సినిమాలో లేదు. టైటిల్‌, ట్రైట‌ర్‌, గెట‌ప్‌ల‌తో ఆక‌ట్టుకొన్న ల‌డ్డుబాబు 70 ఎమ్ ఎమ్‌లో బొమ్మ ప‌డేస‌రికి చ‌తికిల‌ప‌డిపోయాడు. అస‌లే వేస‌వి… ఇన్ని ఎండ‌ల్లో బ‌య‌ట‌కు వ‌చ్చి…. ఇలాంటి భ‌యంక‌ర‌మైన సినిమా చూసేబ‌దులు… హాయిగా ఇంటిప‌ట్టున ఉండి ఓ కొబ్బరిబొండాం తాగండి. ఒంటికి మంచిది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.25/5                           – స్వాతి
***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.