రివ్యూ : లెజెండ్

legend-telugu-movie-review
సింహా మ‌ళ్లీ గ‌ర్జించింది.. తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.5/5

బాల‌కృష్ణ సినిమా అంటే ఇలానే ఉంటుంది.. అని అభిమానులు ఫిక్స్ అయ్యారు! ఆవేశం, ఆక్రోశం, బాల‌య్య టైప్ ఆఫ్ టిపిక‌ల్ మేన‌రిజం.. వీట‌న్నింటికి తోడు తొగ‌గొట్టే స‌న్నివేశాలూ – ఆ ముద్రని బ్రేక్ చేశాడు బోయ‌పాటి శ్రీ‌ను. సింహా సినిమాతో. బాల‌య్యని సెటిల్డ్‌గా చూపించి ఔరా… అనిపించాడు. సింహా క‌థ‌ని టిపిక‌ల్ బాల‌య్య స్టైల్‌లో తీస్తే.. అది కూడా బోల్తా కొట్టేదేమో…? ఆ సక్సెస్ వెనుక కొత్తద‌నం ఉంది. బాల‌య్యని కొత్తగా చూపించాడ‌న్న పేరొచ్చింది. ఇప్పుడు లెజెండ్ అంచ‌నాలు పెర‌గ‌డానికి కూడా కార‌ణం అదే. బోయ‌పాటి శ్రీ‌ను.. బాల‌య్యకి ఇంకాస్త కొత్తగా చూపిస్తాడ‌న్న ధీమాతోనే జ‌నాలు థియేట‌ర్ల వైపు అడుగులు వేశారు. ఆ అంచ‌నాల్ని ఈ సినిమా ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టింది. బాల‌య్య సినిమాల్లో ఇది లెజెండ‌రీగా మిగిలిపోయిందా? చూద్దాం ప‌దండి.

జితేంద‌ర్ ( జ‌గ‌ప‌తిబాబు)కి పొగ‌రు… అహంకారం. త‌న దానికి ఎవ‌రు అడ్డొచ్చినా ఊరుకొడు. పెళ్లి చూపుల‌క‌ని ప‌క్క ఊరు వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఊరిపెద్ద (సుమ‌న్‌)తో గొడ‌వ ప‌డి జైలుకు వెళ్తాడు. అప్పటి నుంచీ… ఆ కుటుంబంపై ప‌గ పెంచుకొంటాడు. ఒకొక్కరినీ బ‌లి తీసుకొంటుంటాడు. త‌న‌కు అవ‌మానం జ‌రిగిన ఊరికే మొగుడ‌వ్వాల‌నుకొంటాడు. ఈ గొడ‌వ‌లు భ‌రించ‌లేక అమ్మమ్మ కృష్ణ (బాల‌కృష్ణ‌)ని లండ‌న్ లో ఉండి చ‌దివిస్తుంది. కృష్ణ పెరిగి పెద్దవాడ‌వుతాడు. త‌న‌దీ ఉడుకు ర‌క్తమే. అన్యాయాన్ని స‌హించ‌డు. అక్కడ స‌త్య (సోనాలి చౌహాన్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. నాయిన‌మ్మ దుబాయ్‌లోనే పెళ్లి జ‌రిపిస్తా.. అంటుంది. కానీ అనుకోకుండా.. కృష్ణ‌, స‌త్యలు ఇండియా వ‌చ్చేస్తారు. వచ్చీ రాగానే జితేంద‌ర్ మ‌నుషుల‌తో గొడ‌వ ప‌డ‌తాడు. ఆ త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల్లో జితేంద‌ర్ త‌న కొడుకును కోల్పోతాడు. ఆ కోపంతో కృష్ణ కుటుంబంపై దాడి చేస్తాడు. అప్పుడే ఓ విష‌యం తెలుస్తుంది. అదేంటి..?? ఈ క‌థ మ‌లుపుకు కార‌ణ‌మైందెవ్వరు?? అస‌లు లెజెండ్ ఎవరు? కృష్ణ కుటుంబంపై ప‌గ పెంచుకొన్న జితేంద‌ర్ ఏమ‌య్యాడు? అనేదే లెజెండ్ క‌థ‌.

సినిమా మొద‌లెట్టడ‌మే ఓ టెంపోతో మొద‌లెట్టాడు బోయ‌పాటి శ్రీ‌ను. ప్రతి నాలుగు స‌న్నివేశాల‌కు ఓసారి ఎమోష‌న్ పీక్ లెవిల్‌కి వెళ్లేలా స్ర్కిప్టు ప్లాన్ చేసుకొన్నాడు. సింహాలో ఏమేం ఎమోష‌న్స్ వ‌ర్కవుట్ అయ్యాయో.. మ‌ళ్లీ అవే ఎమోష‌న్స్ ని న‌మ్ముకొన్నాడు బోయ‌పాటి. ఈ ప్రయ‌త్నం చాలా వ‌ర‌కూ స‌త్ఫలితాల‌ను ఇచ్చింది. బాల‌య్యను ఎలా చూడాల‌నుకొంటారో… బోయ‌పాటి శ్రీ‌నుకి బాగా తెలుసు. అవ‌న్నీ లెజెండ్ లో ప్లే చేశాడు.

ఎమోష‌న్స్‌, డైలాగ్స్‌, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నీ.. హై ఓల్టేజ్‌లోనే సాగాయి. వాటికి తోడు కుటుంబ బంధాల‌నూ చూపించ‌గ‌లిగాడు. ఇంట్రవెల్‌లో ఓ ట్విస్ట్ బ‌య‌ట ప‌డుతుంది. అదెవ్వరూ ఊహించలేనిది. ఒక‌వేళ ఊహించినా.. ఆ ట్విస్ట్ రివీల్ చేసిన విధానం.. బాల‌కృష్ణ అభిమానుల‌కు విప‌రీతంగా న‌చ్చుతుంది. సెకండాఫ్‌లో జ‌య‌దేవ్ (బాల‌కృష్ణ‌) పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆ పాత్ర ఆసాంతం సింహాలో రెండో బాల‌య్యని చూసిన‌ట్టే ఉంటుంది. కాక‌పోతే.. ఆ పాత్రని ప్రజెంట్ చేసిన విధానం వేరు. ప్రజ‌ల కోసం బ‌తికేవాడు.. ప‌దిమంది బ‌తుకు కోసం త‌న బ‌తుకును త్యాగం చేసేవాడే లెజెండ్అని ఈ సినిమాతో చెప్పే ప్రయ‌త్నం చేశాడు బోయ‌పాటి శ్రీ‌ను. మ‌రీ ముఖ్యంగా జితేంత‌ర్ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. హీరో పాత్ర ఎలివేట్ అవ్వాలంటే ప్రతినాయ‌కుడిని మ‌రింత బ‌లంగా చూపించాలి.. అన్న సూత్రాన్ని బోయపాటి స‌రిగ్గా అర్థం చేసుకొన్నాడు. అందుకే తెర‌పై హీరోయిజం మ‌రింత స‌స‌వ‌త్తరంగా పండింది.

కొన్ని మైన‌స్‌లు లేక‌పోలేదు. కామెడీ మ‌రీ వీక్‌గా ఉంది. బ్రహ్మానందం పాత్రతో న‌వ్వులు పండించ‌డానికి విప‌రీతంగా శ్రమించిన‌ట్టు అర్థమ‌వుతుంది. బాషా గెట‌ప్‌లో చేసిన విన్యాసాలు కూడా న‌వ్వుతెప్పించ‌లేక‌పోయాయి. ఆ పాత్రకి అర్థాంత‌రంగా సెండాఫ్ చెప్పేశాడు ద‌ర్శకుడు. బ్రహ్మీ ఇంకాసేపు ఉంటే.. మ‌రింత బోర్ కొట్టేది. ఫ‌స్టాఫ్‌లో ఇంట్రవెల్ వ‌ర‌కూ సాదా సీదాగానే సాగుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ మ‌ళ్లీ ఈ సినిమాకి ప్రాణం పోసింది. సెకండాప్‌లో సినిమా య‌మ స్పీడుగా సాగుతుంది. కానీ ప‌తాక స‌న్నివేశాల్ని తేల్చేసి ద‌ర్శకుడు ఉసూరుమ‌నిపించాడు. లేదంటే సినిమా స్థాయి మ‌రో రెండు రెట్లు పెరుగుదును. బాల‌య్య రెండు పాత్రల్లోనూ రాణించాడు. ముఖ్యంగా డైలాగుల్లో అత‌నికి తిరుగులేదు అని ఈ సినిమాతో మ‌రోసారి నిరూపిత‌మైంది. రాజ‌కీయ ప‌రంగా కొన్ని డైలాగులు చెప్పేట‌ప్పుడు థియేట‌ర్లో డైన‌మైట్లు పేలిన‌ట్టుంటుంది. బాల‌య్య గెట‌ప్‌, బాడీ లాంగ్వేజ్.. త‌ప్పకుండా అభిమానుల్ని ఆక‌ట్టుకొంటాయి. అయితే ఇంకాస్త ఒళ్లు త‌గ్గితే బాగుండేది. క‌నీసం యంగ్ పాత్రలోనైనా స్లిమ్‌గా క‌నిపించే ప్రయ‌త్నం చేయాల్సింది.డాన్స్‌లు అల‌రిస్తాయి. సోనాలీ చౌహాన్ అందాల ఆర‌బోత‌కు ప‌రిమిత‌మైంది. బీచ్ సీన్‌లో కెవ్వుకేక పెట్టించింది. రాధికా ఆప్టేది.. సింహాలో న‌య‌న‌తార రేంజు పాత్ర‌. త‌నూ ఓకే అనిపించుకొంది. ఇక జ‌గ‌ప‌తి కెరీర్‌కి ఇది టర్నింగ్ పాయింటే. ఇక తెలుగు తెర‌కు కొత్త విల‌న్ దొరికేసిన‌ట్టే. నిర్లక్ష్యం, క‌ర్కసం రెండింటినీ మేళ‌వించిన అత‌ని పాత్ర‌.. ఆద్యతంతం ఆక‌ట్టుకొంటుంది.

ద‌ర్శకుడు బోయ‌పాటి శ్రీ‌ను.. ఆద్యంతం బాల‌య్య అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని రాసుకొన్న క‌థ ఇది. వాళ్లని సంతృప్తిప‌రిస్తే చాలు.. అనుకొన్నాడు. అందుకే ఈ సినిమా బాల‌య్య అభిమానుల‌కు ఓ పండ‌గ‌లా ఉంటుంది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో బోయ‌పాటి మార్క్ క‌నిపించింది. స‌మ‌కాలిన రాజ‌కీయాలు, తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్‌… వీటి గురించి డైరెక్ట్‌గా చెప్పక‌పోయినా.. ప‌రోక్షంగా వాటి ప్రస్తావ‌న వినిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో బాల‌య్య చెప్పిన డైలాగులు వ‌న్స్ మోర్లే! పాట‌లు తెర‌పై బాగున్నాయి. అయితే ఐటెమ్ పాట‌లో అంత కిక్‌లేదు. నేప‌థ్య సంగీతంలో దేవి ప్రతిభ తెలుస్తూనే ఉంటుంది. బ్రహ్మానందం పాత్ర నిడివి ఇంకాస్త త‌గ్గించుకొంటే బాగుండేది.

మొత్తానికి బాల‌య్య అభిమానుల‌కు బోయ‌పాటి శ్రీ‌ను ఇచ్చిన కానుక ఈ సినిమా. సింహా కోసం ఇప్పటి వ‌ర‌కూ చెప్పుకొంటూనే ఉన్నారు. ఇంకొంత‌కాలం లెజెండ్ గురించి చెప్పుకొంటారు. సింహా త‌ర‌వాత బాల‌య్య నుంచి స‌రైన సినిమా రాలేదు అనుకొన్నవాళ్లంద‌రికీ.. ఇదో ఊర‌డింపు. ల‌య‌న్‌.. క‌మింగ్ బ్యాక్‌

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.5/5        – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు