రివ్యూ : ఊహలు గుసగుసలాడే

Oohalu-Gusagusalade-telugu-movie-review-rating

                                                      |Click here for English Review|

గుస‌గుస + న‌స‌ – ఊహ‌లు గుస‌గుస‌లాడే – తెలుగు మిర్చి రేటింగ్స్2.5/5

సినిమాల్లో రెండే రెండు రకాలు అని చెప్తుంటారు పెద్ద పెద్దోళ్లు. హిట్టు సినిమా, ఫ్లాప్ సినిమా అంతే! అయితే రెంటికీ కాకుండా మ‌ధ్య‌లో ఊగిస‌లాడే కొన్ని సినిమాలుంటాయి. సినిమా బాలేదా..? అంటే చెప్ప‌లేం. బాగుందా?? అంటే నోరువిప్ప‌లేం…
అలాంటి సినిమానే.. ఊహ‌లు గుస‌గుస‌లాడే. టైటిల్ కూడా క‌రెక్ట‌గా పెట్టారు. గుస‌గుస అంటే మౌనం కాదు. మాట్లాడ‌డం కాదు. జస్ట్ గుస‌గుస అంతే. ఈ సినిమా కూడా ఇంతే!

యుబి ఛాన‌ల్ య‌జ‌మాని…. ఉద‌య్‌బాబు (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌). వ‌య‌సు ముదిరిపోతున్నా.. పెళ్లికాదు. ప్ర‌భావ‌తీ శిరీష (రాశిఖ‌న్నా)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమెనే పెళ్లిచేసుకొందాం అనుకొంటాడు. త‌న‌ని ఇంప్రెస్ చేయ‌డానికి ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటాడు. కానీ వ‌ర్క‌వుట్ అవ్వ‌దు. ఉద‌య్ ఛాన‌ల్లోనే వెంక‌టేశ్వ‌ర్లు (నాగ‌శౌర్య‌) ప‌నిచేస్తుంటాడు. న్యూస్ రీడ‌ర్ కావాల‌న్న‌ది త‌న ల‌క్ష్యం. అమ్మాయిల్ని తేలిగ్గా బుట్ట‌లో ప‌డేస్తుంటాడు. అందుకే ఉద‌య్‌.. వెంకీ ని వాడుకోవాల‌నుకొంటాడు. వెంకీ స‌ల‌హాల‌తో… ప్ర‌భావ‌తిని ఫ్లాట్ చేయ‌డానికి ట్రై చేస్తుంటాడు. `మ‌రో సంబంధం చూస్తా. అదీ కుద‌ర‌క‌పోతే.. అప్పుడు ఉద‌య్‌ నే పెళ్లి చేసుకొంటా..` అని ఇంట్లోవాళ్ల‌కు చెబుతుంది. వెంకీని పెళ్లి చూపుల‌కు పంపి, శిరీష చేత నో చెప్పించుకొంటే… త‌న‌కు లైన్ క్లియ‌ర్ అయిపోతుంద‌న్న‌ది ఉద‌య్ ప్లాన్‌. `నాకు శిరీష‌తో పెళ్ల‌యితే.. నిన్ను న్యూస్ రీడ‌ర్ ని చేస్తా..` అని వెంకీని ఊరిస్తాడు ఉద‌య్‌. ఇక త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో శిరీష తో పెళ్లి చూపుల త‌తంగానికి ఒప్పుకొంటాడు. అయితే ఆ శిరీష ఎవ‌రో కాదు.. రెండేళ్ల క్రితం వైజాగ్‌లో తాను ప్రేమించిన అమ్మాయే. మ‌రి అప్పుడు వీళ్లిద్ద‌రూ ఎందుకు విడిపోయారు.?? ఇప్పుడ న్యూస్ రీడ‌ర్ పోస్ట్ కోసం త‌న ప్రేమ‌ని త్యాగం చేస్తాడా? బాస్ ప్రేమ‌ని గెలిపిస్తాడా?? అన్న‌దే ఊహ‌లు గుస‌గుస‌లాడే…సినిమా.

ఈ సినిమా ఇప్పుడు చెప్పుకొన్న క‌థ ఫార్మెట్‌ లో ఉండ‌దు. ముందు.. వెంకీ, శిరీష‌ల ప్రేమ‌క‌థ చూపిస్తాడు. ఆ త‌ర‌వాత‌… ఉద‌య్ ప్రేమ వ్య‌వ‌హారంలోకి వ‌స్తాడు. ఫ్లాష్ బ్యాక్‌ల పేరుతో అన‌వ‌స‌ర‌మైన బిల్డ‌ప్పులు ఇవ్వ‌కుండా స్ట్ర‌యిట్ గా ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా ఆడియ‌న్‌కి క‌థ చెప్పాల‌నుకొన్నాడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌. ఆ విష‌యంలో చాలా వ‌ర‌కూ స‌క్సెస్ అయ్యాడు. ఒక విధంగా ఇది ముక్కోణ‌పు ప్రేమ క‌థ‌. ఒక అమ్మాయి కోసం ఇద్ద‌రు అబ్బాయిలు ట్రై చేస్తారు. అస‌లు హీరో త‌న ల‌క్ష్యం కోసం ప్రేమ‌ని త్యాగం చేయ‌డానికి రెడీ అంటాడు. ఇక రెండో హీరోలాంటి విల‌న్ (చివ‌ర్లో నెగిటీవ్ ల‌క్ష‌ణాలు ఆపాదించారు లెండి) త‌న ప్రేమ‌ని గెలిపించుకోవ‌డానికి నానా పాట్లూ ప‌డుతుంటాడు. వీళ్లిద్ద‌రిలో ఎవ‌రి ప్రేమ‌ని ఓకే చేయాలో తెలీక స‌త‌మ‌త‌మ‌వుతుంటుంది క‌థానాయిక‌. ఈ మూడు అంశాల చుట్టూ ఈ క‌థ న‌డుస్తుంది.

బ్లూటూత్‌ లో ల‌వ్ టిప్స్ చెప్ప‌డం.. వాటిని మ‌రొక‌రు ఫాలో అయిపోవ‌డం, అమ్మాయిని ప్రేమ‌లో దింపేయ‌డం – హిందీ సినిమా పార్ట‌న‌ర్ నుంచీ చూస్తున్నాం. మొన్నామ‌ధ్య వ‌చ్చిన గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాలోనూ పాయింట్ ఇదే క‌దా..?? సో… బేసిగ్గా ఈ క‌థ కొత్త‌ది కాదు. కానీ ఉన్న క‌థ‌ని కొత్త‌గా, ఆ మాట కోస్తే ప్ల‌జెంట్‌గా చెప్పాల‌నుకొన్నాడు. థ్యాంక్ గాడ్ – ఎంత వెదికినా ఒక్క డ‌బుల్ మీనింగ్ డైలాగూ క‌నిపించ‌లేదు. వాడాల్సిన అవ‌స‌రం వ‌చ్చినా… అవ‌స‌రాల వాడ‌లేదు. ఈ విష‌యంలో … అవ‌స‌రాల‌ని మెచ్చుకోవ‌ల్సిందే.

ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ… వెంకీ, ప్ర‌భావ‌తిల స్వీట్ ల‌వ్ స్టోరీ న‌డుస్తుంది. స్వీట్ అంటే మ‌రీ మొహం మొత్తేసేంత స్వీట్ కాదు. లైట్ ట‌చ్ ఇచ్చాడంతే. దాంతో క్యూట్‌గా అనిపిస్తుంది. అవ‌స‌రాల డైలాగుల‌తో బాగానే మేనేజ్ చేశాడు. ముఖ్యంగా మ‌హ్మ‌ద్ ర‌ఫీ పాట‌ల గురించీ, పికాసో పెయింట్ గురించీ బిల్డ‌ప్పులిచ్చి.. అమ్మాయిని ప‌డేద్దాం అనుకొన్న సీన్ భ‌లేగా పండింది. సెకండాఫ్‌లో ఇలానే బ్లూటూత్ ద్వారా వ‌చ్చిన క‌మ్యునికేష‌న్ గ్యాప్‌ని వినోదాత్మ‌కంగా చెప్పి న‌వ్వులు పూవులు పూచించాడు ద‌ర్శ‌కుడు. కామెడీ ట్రాక్ సెప‌రేట్ గా పెట్ట‌కుండా.. ఉన్న పాత్ర‌ల‌మ‌ధ్యే వినోదాన్ని సృష్టించాడు. అయితే ఈ కామెడీ బిట్ల‌కు మ‌ధ్య సాగిన క‌థ‌… మ‌రీ సాగింది. అందుకే అక్క‌డ‌క్క‌డ బోర్ కొడుతూ ఉంటుంది. పైగా మ‌నం చూస్తున్న‌ది కొత్త పాయింట్ కాద‌న్న‌ప్పుడు ఆ బోరింగ్ మ‌రింత ఎక్క‌వ అవుతుంది. సినిమాలో లాగ్ ఉంటే మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ ని క‌నెక్ట్ అయిపోతుందిలే…అనుకొని సాధ్య‌మైనంత సాగ‌దీసి ఉంటారు.

సెకండాఫ్ లో అవ‌స‌రాల చేసిన కామెడీ మిన‌హా చెప్పుకోవ‌డానికి మ‌రేం లేకుండా పోయింది. పైగా ఉద‌య్ ని పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స్ అయిన ప్ర‌భావ‌తిలోని ప్రేమ‌ని సందేహించాల్సివస్తుంది. సినిమాని కామెడీ ట‌చ్‌తోనే ముగించొచ్చు. కానీ అక్క‌డ అవ‌స‌రాల శ్రీ‌నివాస్ పాత్ర‌లో లేని విల‌నిజాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం క‌నిపించింది.

సినిమాటోగ్ర‌ఫీ చాలా ప్ల‌జెంట్‌గా ఉంది. క‌ల‌ర్స్ వాడిన విధానం బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా అవ‌స‌రాల రాసిన డైలాగ్స్ బాగున్నాయి. గుర్తుపెట్టుకోవ‌డం క‌ష్టంగానీ, థియేట‌ర్ లో టైమ్ పాస్ అయిపోతుంది. క‌ల్యాణీ మాలిక్ ఇంకా మెలోడీల‌నే అంటిపెట్టుకొన్నాడు.మెలోడీ పాట‌లు ఇవ్వ‌డం త‌ప్పేం కాదు. క‌థ ఇంత స్లోగా ఉన్న‌ప్పుడు క‌నీసం పాట‌ల‌తోనైనా హుషారు తెప్పించాలి. పైగా విన్న పాట‌లే మ‌ళ్లీ ఇంటున్న‌ట్టున్నాయి. ఆర్‌.ఆర్‌లో మాత్రం ఓకే అనిపించాడు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ తొలి సినిమా ఇది. ప్ర‌య‌త్నం వ‌ర‌కూ బాగుంది. అయితే కొత్త పాయింట్ ఉన్న క‌థ ఎంచుకొంటే… అత‌ని ప్ర‌తిభ మరింత ఎలివేట్ అవుదును. చిన్న సినిమాని రిచ్‌గా తీసి.. త‌న అభిరుచిని చాటుకొన్నారు సాయికొర్ర‌పాటి.

ఈమ‌ధ్య యూత్ సినిమాల పేరుతో వ‌స్తున్న బూతు సినిమాల‌తో పోలిస్తే వంద రెట్లు న‌యం ఈసినిమా. అయితే.. 100 % సంతృప్తి ఇచ్చిందా? అంటే లేదు. 50 % మార్కుల‌తో పాసైన యావ‌రేజ్ స్టూడెంట్‌ని మొద్ద‌బ్బాయ్ అన‌లేం. అలాగ‌ని ముద్దూ పెట్టుకోలేం. ఈ సినిమా కూడా అంతే.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5             – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 |Click here for English Review|