రివ్యూ : పోరా.. పోవే

Pora-Pove-REVIEW
టైమ్‌, మ‌నీ రెండూ పోతాయ్‌! : తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5 |Click here for English Review|

యువ‌త‌రం ద‌ర్శ‌కుల్లో కావ‌ల్సినంత టాలెంట్ ఉంది. కొత్త‌గా ఆలోచించ‌గ‌ల‌రు. జిమ్మిక్కుల‌తో ఆక‌ట్టుకోగ‌ల‌రు. అయితే ఈ ఆలోచ‌న‌, ఆక‌ర్ష‌ణ‌ల విద్య కొన్ని అంశాల‌కే ప‌రిమితం అయిపోతోంది. సీన్‌ని కొత్త‌గా డిజైన్ చేసుకోగ‌లుగుతున్నారు గానీ.. ఆ సీన్‌కి అవ‌స‌ర‌మైన మూల క‌థ‌ని కొత్త‌గా రాసుకోలేక‌పోతున్నారు. దాంతో… చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడ‌సి కొడుతున్నాయి. ఓ పాత క‌థ‌ని ఎంత కొత్త‌గా చెప్పాల‌నుకొన్నా .. ఏదో మిస్స‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది. పైగా ఆ తెలివితేట‌లు సినిమాని ఆద్యంతం ర‌క్తికంట్టించేంత స్థాయిలో లేక‌పోవ‌డంతో… ఉడికీ ఉడ‌క‌ని.. డిష్ త‌ర‌యావుతోంది. అరె.. ఇంకాస్త ఆలోచిస్తే బాగుణ్ణు… ఈ విష‌యాల‌పై శ్ర‌ర్థ చూపిస్తే బాగుణ్ణు… అంటూ అసంతృప్తితో థియేట‌ర్ల‌నుంచి బ‌య‌ట‌కు రావాల్సివ‌స్తోంది. అలా ప్రేక్ష‌కుల చేత అనిపించిన సినిమా… పోరా పోవే.

వికాస్ (కిర‌ణ్‌) ఇంజ‌నీరింగ్‌లో విద్యార్థి. అప్ప‌టి వ‌ర‌కూ బోయ్స్ కాలేజీలోనేచ‌ద‌వ‌డం వ‌ల్ల‌… అమ్మాయిలంటే ట‌చ్ లేదు. మ‌రోవైపు చైత‌న్య (సౌమ్య‌) ప‌రిస్థితి కూడా అంతే. గాళ్స్ కాలేజీ నుంచి వ‌స్తుంది కాబ‌ట్టి… బోయ్స్‌తో ప‌రిచ‌యం లేదు. సో.. కో ఎడ్యుకేష‌న్ కాలేజీలో చేరేస‌రికి… కొత్త రెక్క‌లొస్తాయి. ఊహ‌లు గాల్లో ఎగురుతాయి..! ఇలాంటి జంట‌లు ఆ కాలేజీలో కో కొల్ల‌లు. కాలేజీలో. అమ్మాయిలను చూస్తే, అబ్బాయిలకు ఎట్రాక్ష‌న్‌. అబ్బాయిల క‌ళ్ల‌లో ప‌డాల‌ని అమ్మాయిల‌కు ఆత్రుత‌. వికాస్‌, చైత‌న్య‌ తొంద‌ర్లోనే ఒక‌రిపై మ‌రొక‌రు ఆక‌ర్ష‌ణ పెంచుకొంటారు. అంతా ఓకే అనుకొనే స‌రికి… చైత‌న్య‌కు వికాస్‌కు సంబంధించిన ఓ నిజం తెలుస్తుంది. అదేంటంటే.. అప్ప‌టికే వికాస్ ఇద్ద‌రిని ప్రేమించాడు. వాళ్లు కాదంటే… నన్ను ప్రేమిస్తావా? నువ్వూ వద్దు, నీ ప్రేమా వ‌ద్దు అంటూ చీ కొట్టి వెళ్లిపోతుంది. అస‌లు వికాస్ ప్రేమించింది ఎవ‌రిని?? చైత‌న్య‌ని వికాస్ మ‌ళ్లీ క‌ల‌సిశాడా? లేదా? పోరా, పోవే అని విడిపోయిన ఈ జంట ఎప్పుడు ఎలా క‌లుసుకొంది? అనేదే ఈ సినిమా.

ఈమ‌ధ్య వ‌స్తున్న కాలేజీ ప్రేమ‌క‌థ‌ల్లో ఇదీ ఒక‌టి. క‌థ‌లో వైవిధ్యం ఏమీ లేదు. అబ్బాయి, అమ్మాయి ఆక‌ర్ష‌ణ‌లో ప‌డ‌డం, ప్రేమించుకోవ‌డం… విడిపోవ‌డం, మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం. వేల వేల ప్రేమ‌క‌థ‌ల్లో ఉన్న పాయింటే. కాలేజీ నేప‌థ్యం, కుర్రాళ్ల స‌ర‌దాలు, పాట‌లూ, కొన్ని చిన్న చిన్న ఎమోష‌న్స్ జోడించి.. సినిమాని లాగించేద్దాం అనుకొన్నాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌లో మెలోడ్రామాకు ఏమాత్రం చోటివ్వ‌లేదు. భ‌యంక‌ర‌మైన ట్విస్టులూ లేవు. భారీ క‌థ‌ని చెప్పి.. ప్రేక్ష‌కుల్ని విసిగించొద్దు… అని ద‌ర్శ‌కుడు ముందే డిసైడ్ అయ్యాడేమో. అందుకే మ‌న ఊహ‌కంద‌ని స‌న్నివేశాలేం ఉండ‌వు. రొటీన్ సీన్లే.. అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా తీశాడు. కాలేజీ నేప‌థ్యంలో క‌థ‌లంటే ఇంతేనేమో.. అనుకొనేలా త‌యారైంది తెలుగు సినిమా. అమ్మాయిలు-అబ్బాయిల మ‌ధ్య ఉండే ఆక‌ర్ష‌ణ త‌ప్ప మ‌రేం చూపించ‌డం లేదు. ప్రేమ‌లో ప‌డ‌డం, డేటింగ్‌, ప‌బ్బులు, పార్కులు, ఐ ల‌వ్ యూ చెప్పుకోవ‌డాలూ, క‌ళ్లలో క‌ళ్లు పెట్టి చూసుకోవ‌డాలూ… నాలుగు అడ‌ల్డ్స్ జోకులూ నింపేసి సినిమా చుట్టేస్తున్నారు. ద‌ర్శ‌కుడి భావుక‌త‌, సృజ‌నాత్మ‌క‌త‌, టాలెంట్ కొన్ని కొన్ని స‌న్నివేశాల‌కే ప‌రిమితం అవుతోంది. ‘పోరా-పోవే’లోనూ ఇవే లోపాలు క‌నిపించాయి. అయితే బూతుల శాతం చాలా త‌క్కువ‌. ఆ విష‌యంలో టీమ్‌ని అభినందించాల్సిందే. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ క‌థ‌ని బోర్ కొట్టించ‌కుండా న‌డిపేశాడు. ఆ త‌ర‌వాత ద‌ర్శ‌కుడికి చేయ‌డానికి ఏం మిగ‌ల్లేదు. చూపించాల్సిన టాలెంట్‌.. ఫ‌స్టాఫ్ లోనే అయిపోయింది.. అంటూ చేతులెత్తేశాడు. దాంతో.. థియేట‌ర్లో సెగ‌లు మొద‌ల‌వుతాయి.

లైన్ మ‌రీ బ‌ల‌హీనంగా ఉంటే వ‌చ్చే చిక్కే ఇది. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ జిమ్మిక్కులు చేయొచ్చు. ఆ త‌ర‌వాత ఆ పప్పులు ఉడ‌క‌వు. హీరో, హీరోయిన్లు బ్రేకప్ చెప్పేసిన త‌ర‌వాత‌… క‌థ అక్క‌డే గింగిరాలు తిరుగుతుంటుంది. దాంతో ఫస్టాఫ్ లో సినిమాపై పెంచుకొన్న ప్రేమ‌.. కాస్త కాస్త క‌రిగి… శూన్య‌మైపోతుంది. దానికి తోడు సినిమాలో వినోదం లేదు. క‌నీసం రెండు మూడు ఎపిసోడ్ల‌యినా వినోదం పంచేలా ఉంటే… సెకండాఫ్ కూడా న‌డిచేద్దును.

క‌ర‌ణ్ కి ఇదే తొలిసినిమా. కుర్రాడు చూడ్డానికి బాగున్నాడు గానీ, న‌ట‌న‌లో తేలిపోయాడు. ఈజ్‌గా చేయాల్సిన సీన్ల‌ను చాలా ఇబ్బందిగా చేశాడు. ఈ సినిమాకి అతి పెద్ద మైన‌స్‌.. క‌ర‌ణ్‌! సౌమ్య ఓకే అనిపిస్తుంది. నిజానికి ఆమెన‌ట‌నా సాధార‌ణ‌మే. అయితే క‌ర‌ణ్ తో పోలిస్తే… సౌమ్య మ‌న క‌ళ్లకు సావిత్రిలా క‌నిపిస్తుంది. సాంకేతికంగా సినిమా చాలా చాలా బాగుంది. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకొంటుంది. క‌థ‌ని చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించాడు. సంగీతం కూడా విన‌సొంపుగా ఉంది. కుర్ర‌కారుని ఆ బాణీలు న‌చ్చుతాయి. ద‌ర్శ‌కుడిలో టాలెంట్ ఉంది. అయితే… మంచి క‌థ దొరికిన‌ప్పుడు మాత్ర‌మే… అది మ‌రింత‌గా ఎలివేట్ అవుతుంది. ఈ సాదా సీదా క‌థ‌ని న‌డిపంచే… అనుభ‌వం మాత్రం లేద‌ని స్ప‌ష్ట‌మైంది.

ముఫ్ఫై మార్కుల సినిమాలూ, న‌ల‌భై మార్కుల సినిమాలూ మ‌న కంటికి ఆన‌డం లేదు. సినిమా అంటే ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌వ్వాలంతే. కానీ ఆ స్టామినా ఈ చిన్న చిత్రానికి స‌రిపోలేదు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5                        – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

|Click here for English Review|