రివ్యూ : సైకో

Psyco-movie-review-ratingపేరుకి త‌గ్గట్టే సైకోః

వ‌ర్మ సినిమా అంటే… ఎగురుకొంటూ థియేట‌ర్లో వాలిపోయే జ‌నాలు ఇప్పటికీ ఉన్నారు. దాన్ని ఎప్పటిక‌ప్పుడు  క్యాష్ చేసుకొంటున్నాడు వ‌ర్మ. త‌న శిష్యగ‌ణాన్ని బ‌రిలోకి దింపి – ఆ సినిమాకీ తన పేరునే బ్రాండ్‌గా వాడుకొంటూ… పైసా ఖర్చు లేకుండా ఫ్రీ పబ్లిసిటీ చేసుకొంటున్నాడు. 5డీ వ‌చ్చేశాక‌.. ఖ‌ర్చు విప‌రీతంగా త‌గ్గింది. ల‌క్షల్లో సినిమా ముగించి కోట్లు దండుకోవ‌డానికి ఈ టెక్నాల‌జీ ఓ వ‌రంగా మారింది. అందుకే షార్ట్ ఫిల్మ్‌కి ప‌నికొచ్చే క‌థ‌ల్ని కూడా సినిమాలుగా తీసి జ‌నం మీద‌కు రుద్దుతున్నాడు. ఏఫిల్మ్ బై… రాంగోపాల్ వ‌ర్మ అని వేసుకొంటే ఉన్న ప‌రువు కాస్తా ఎక్కడ బ‌జారున ప‌డిపోతుందో అనే భ‌యంతో క‌థ‌, స్ర్కీన్ ప్లే మాత్రమే అంటూ… త‌న‌వైపుకు వ‌చ్చే బాణాల‌ను త‌న శిష్యుల‌వైపుకు మ‌ళ్లిస్తుంటాడు. ఇప్పుడు వ‌ర్మ స్కూల్ నుంచి మ‌రో సినిమా వ‌చ్చింది. అదే.. సైకో! ఈ సినిమాకి కిషోర్ భార్గవ్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు. క‌థ‌, స్ర్కీన్ ప్లే మాత్రమే వ‌ర్మ అందించాడు. ఇంత‌కీ ఈ సినిమాలో ఏముంది? వర్మ మార్కు ఎంత వ‌ర‌కూ క‌నిపించింది? తెలుసుకొందాం ప‌దండి.

మీరా (నిషా కొఠారీ) బాధ్యత తెలిసిన అమ్మాయి. నాన్న రిటైర్డ్ ఉద్యోగి. త‌మ్ముడు రొనాల్డోలా ఫుడ్‌బాల్ ప్లేయ‌ర్ కావాల‌నుకొంటాడు. ఆఫీసులో శేఖ‌ర్ అనే ఓ అబ్బాయి మీరాని ప్రేమిస్తుంటాడు. కానీ మీరా ప‌ట్టించుకోదు. మీరాకి ఓసారి బ‌స్సు ప్రయాణంలో నిఖిల్ ప‌రిచ‌యం అవుతాడు. ఆ త‌ర‌వాత..వెంట ప‌డ‌తాడు. సినిమాకి వెళ్తాం అంటాడు. రాను.. అంటే టికెట్లు చింపేసి త‌న సైకో త‌నాన్ని బ‌య‌ట‌పెడ‌తాడు. రాత్రంతా ఫోన్ల‌లో మెసేజ్‌లు పెట్టి  నిద్రలేకుండా చేస్తాడు. అప్పుడే సారీ అంటాడు. మ‌ళ్లీ అప్పుడే భ‌య‌పెడ‌తాడు. ఈ బాధ త‌ట్టుకోలేక పోలీస్ స్టేష‌న్‌కి వెళ్తుంది. అక్కడ ఈ కేస్‌ని చాలా లైట్ తీసుకొంటారు. ఇక చేసేదేం లేక‌.. శేఖ‌ర్ కి చెప్తుంది. అప్పుడు శేఖ‌ర్ ఏం చేశాడు? దానికి ఈ సైకో రియాక్షన్ ఏమిటి? సైకో నుంచి మీరా త‌ప్పించుకొంది? అనేదే ఈ సినిమా క‌థ‌.

దీన్ని ఓ సినిమా అన‌లేం. డాక్యుమెంట‌రీలానే ఉంటుంది. ఈటీవీలో నేరాలూ ఘోరాలూ ఎపిసోడ్ చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. నిజానికి ఒక ఎపిసోడ్‌లో చెప్పాల్సిన క‌థ‌ని సినిమాగా తీశాడు. పైగా ఇదో యాదార్థ గాథ‌, ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అంటూ ప్రచారం చేశాడు. స‌మాజంలోని పాజిటీవ్ పాయింట్‌ని ప‌ట్టుకొని సినిమా తీయ‌డం వ‌ర్మకి ఎప్పుడూ చేత‌కాదు. అత‌న్ని నెగిటీవ్ అంశాలే ఆక‌ట్టుకొంటాయి. వాటినే క‌థ‌లుగా మ‌ల‌చుకొంటాడు. ఇది కూడా అందులో భాగ‌మే. అయితే వ‌ర్మకి ఉండే ఆస‌క్తి అటు ప్రేక్షకుల‌కూ ఉండాలి క‌దా? అక్కడే అత‌ని సినిమాలు బోల్తా ప‌డ‌తాయి. ఎంత సేపూ సైకో వికృత చేష్టలు చూస్తూ కాలం గ‌డ‌పండి అంటే ఎలా? సినిమా అంతా ఇదే. దాంతో… ఒక టైమ్ వ‌చ్చేస‌రికి – ఈ సైకోగాడిని చూడాల్సిన అవ‌స‌రం మ‌న‌కుందా? అనిపిస్తుంది.

కెమెరా క‌ద‌లిక‌లు కూడా అస‌హ‌నానికి గురి చేస్తాయి. క‌ళ్లకు కొంచెం ఇబ్బందే! ఆ త‌ర‌వాత ఏం జ‌రుగుతుంది?? అనే ఉత్కంఠ‌త ఎవ‌రిలోనూ ఉండ‌దు. ఎందుకంటే ఏ సీన్ చూసినా అందులో సైకో భ‌య‌పెడుతూనే ఉంటాడు. టెక్నిక‌ల్‌గా చెప్పుకోవ‌ల‌సిన అంశం ఏమైనా ఉంది.. అంటే అది నేప‌థ్య సంగీత‌మే. ఆర్‌.ఆర్‌తో ఇంకొంచెం భ‌య‌పెట్టగ‌లిగారు. సైకోగా క‌నిపించిన న‌టుడుకి మంచి మార్కులు ప‌డతాయి. ఇలాంటి న‌టుల్ని వ‌ర్మ చ‌క్కగా ప‌ట్టేస్తాడు. నిషాకొఠారీ ఫ‌ర్వాలేద‌నిపించింది. ప‌తాక స‌న్నివేశాల్లో మాత్రం బాగా న‌టించింది. మిలింద్ గునాజ్‌ని స‌రిగా వాడుకోలేదు. ఈ సినిమా ఎక్కువ‌గా రెండు పాత్రల మ‌ధ్యే న‌డ‌వ‌డంతో ప్రతీ సీన్ ఒకేలా క‌నిపిస్తుంది.

ప్రస్తుతం అమ్మాయిల్ని వేధిస్తున్న స‌మ‌స్య ఇది. అయినా మ‌ళ్లీ దాన్ని తెర‌పై చూడాలా? సినిమాకి కావ‌ల్సింది స‌న్నివేశాలు, సంఘ‌ట‌న‌లు కాదు. క‌థ‌. అది లేక‌పోవ‌డంతో.. ఉన్న స‌న్నివేశాల్ని ప్రేక్షకుడిని భ‌య‌పెట్టడానికికే అన్నట్టు తీర్చిదిద్దడంతో ఈ సినిమాపై ఎవ‌రికీ ఓ సాఫ్ట్ కార్నర్ ఏర్పడ‌దు. పైగా డ‌బ్బింగ్ ల‌క్షణాలు అణువ‌ణువూ నిండిపోయిన క‌థ కావ‌డంతో ఈ సినిమా మ‌న‌ది కాదులే అనే ఫీలింగ్ వ‌చ్చేస్తుంది. ఇప్పటి వ‌ర‌కూ సినిమాలు తీసిన వ‌ర్మని డాక్యుమెంట‌రీ స్థాయికి తీసుకొచ్చిన సినిమాగా సైకో నిల‌బ‌డిపోతుంది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2/5స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.