రివ్యూ : రారా కృష్ణ‌య్య‌

ra ra

క‌ష్టమే అన్నయ్యారారా కృష్ణయ్య: తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5

నువ్వు కాపీ క‌థ తీశావా?? కొత్త క‌థ చెప్పావా… అన్నది కాద‌న్నయ్యా. సినిమా ఆడిందా, లేదా?? అన్నదే ముఖ్యం – ఇదీ ఇప్పటి జ‌న‌రేష‌న్‌. థియేట‌ర్లో కూర్చున్నంత సేపూ – బ‌య‌టి ప్రపంచం గుర్తుకు రాకూడ‌దు. బ‌య‌ట‌కు ఎప్పుడెళ్లిపోదామా… అని చూశావంటే, కొత్త క‌థ చెప్పినా వేస్టే. ఇప్పుడొచ్చిన రా రా కృష్ణయ్యలో `కాపీ` ఎలిమెంట్స్ చాలా ఉన్నాయ్‌. క‌థ ఓ హిందీ సినిమాకి స్ఫూర్తి అన‌బ‌డే కాపీ. సందీప్ కిష‌న్ ఏమో… మ‌హేష్ బాబుని అచ్చుగుద్దిన‌ట్టు దింపేద్దాం అనుకొనే తాప‌త్రయం. రెజీనాను చూస్తే జెనీలియా, ఇలియానాల్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సంగీత ద‌ర్శకుడు అచ్చు పాత సినిమాల ఆర్‌.ఆర్‌ని `అచ్చు` గుద్ది న‌ట్టు దింపేస్తున్నాడు. అయితే ఇక్కడ ద‌ర్శకుడు చేయాల్సింది.. ట్రీట్‌మెంట్ కొత్తగా ఆవ్వడం. మ‌రి కొత్త ద‌ర్శకుడు మ‌హేష్ ఆ విష‌యంలో త‌డ‌బ‌డ్డాడా? నిల‌బ‌డ్డాడా?? తెలుసుకోవాలంటే రివ్యూలోకి ఎంట‌రైపోవాల్సిందే.

కిట్టు (సందీప్ కిష‌న్‌) ఓ క్యాబ్ డ్రైవ‌ర్‌. పైసా పైసా సంపాదించి, ఎంతో ఎత్తుకు ఎద‌గాల‌ని క‌ల‌లు కంటుంటాడు. నీతి, నిజాయితీల‌తో బ‌త‌కాల‌నుకొంటాడు. తాను క‌ష్టప‌డి సంపాదించిన సొమ్మంతా సేటు (భ‌ర‌ణి) ద‌గ్గర దాస్తుంటాడు. సేటు కూతురు నందు (రెజీనా). ఇంట్లో త‌న‌కు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నందుకు ప్రతిఘ‌టిస్తుంటుంది. అదే సమ‌యంలో కిట్టుని సేటు మోసం చేస్తాడు. డ‌బ్బులు ఇవ్వను పొమ్మంటాడు. దాంతో సేటుపై కోపం తెచ్చుకొన్న కిట్టు… నందుని పెళ్లి మండమం నుంచి ఎత్తుకొస్తాడు. డ‌బ్బులిస్తేనే.. నీ కూతుర్ని వ‌దులుతా అని డిమాండ్ చేస్తాడు. నందు కూడా పెళ్లి త‌ప్పిపోయినందుకు హ్యాపీగా ఫీల‌వుతుంది. క్రమంగా కిట్టు అంటే ప్రేమ పెంచుకొంటుంది. తానో కిడ్నాప‌ర్‌గా మిగ‌ల‌డం ఇష్టం లేక‌… నందుకి సేట్‌కి అప్పగించాల‌ని నిర్ణయించుకొంటాడు కిట్టు. స‌రిగ్గా ఇంట్రవెల్ ముందు.. నందుకి మ‌రొక‌రు (బ్రహ్మాజీ) కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాడు. ఇంత‌కీ.. నందుకు ఎవ‌రు కిడ్నాప్ చేశారు? కిట్టూకీ, జ‌గ్గూభాయ్ (జ‌గ‌ప‌తిబాబు)కీ ఉన్న సంబంధం ఏమిటి?? కిట్టు, నందులు ప్రేమించుకొన్నారా? లేదా?? అనేదే రారా కృష్ణయ్య స్టోరీ..

స్టోరీ లైన్ లో క‌మ‌ర్షియ‌ల్ హంగులన్నీ ఉన్నాయి. అయితే ఇది తేరే ప్యార్ మే న‌ల్ హోగ‌యా… అనే హిందీ సినిమాకి కాపీ. తొలి స‌గంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ ఛాయ‌లు కూడా క‌నిపిస్తుంటాయి. సీన్లు కొత్తగా, ఫ‌న్నీగా ఉంటే.. ప్రేక్షకుల్లో ఈ ఫీలింగ్ రాకుండా జాగ్రత్తప‌డొచ్చు. కానీ ఈ విష‌యంలో కొత్త ద‌ర్శకుడు మ‌హేష్ కొంత వ‌ర‌కూ మాత్రమే స‌క్సెస్ అయ్యాడు. హీరో, హీరోయిన్ క్యారెక్టర్లు బిల్డప్ చేసుకొని అస‌లు క‌థ‌లోకి తొంద‌ర‌గానే ఎంట్రీ ఇచ్చేశాడు. ఎప్పుడైతే కిడ్నాప్ డ్రామా మొద‌లైందో, అప్పుడు సినిమా కూడా హైవే ఎక్కుతుంది. అయితే… అక్కడే కొత్త స‌న్నివేశాలు రాసుకోవల్సింది. ఇలాంటి క‌థ‌ల్లో రొటీన్‌గా క‌నిపించే స‌న్నివేశాలే.. తెర‌పైనా ద‌ర్శన‌మిస్తుంటాయి. దానికి తోడు చెన్నై ఎక్స్‌ప్రెస్ ఛాయ‌లు క‌నిపిచండంతో.. బోర్ కొడుతుంటుంది. కేర‌ళ ఎపిసోడ్ శుద్ధ దండ‌గ‌. ఇంట్రవెల్ బ్యాంగ్ కాస్త ఆస‌క్తి క‌లిగించింది. ఆ త‌ర‌వాత‌.. జ‌గ్గూభాయ్ ఎంట్రీతో కాల‌క్షేపం అయిపోతుంది. ఆ ఇంట్లో అల్లుకొన్న సీన్స్‌, కిట్టు ఫ్లాష్ బ్యాక్ ఓ మాదిరిగా న‌డిచాయి. ర‌విబాబు, వేణుల‌తో కాస్త కామెడీ లాగించారు. అదొక్కటే సెకండాఫ్‌ని బ‌తికించింది. దానికి తోడు జ‌గ్గూభాయ్ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. మ‌ళ్లీ య‌ధావిధిగా రొటీన్ క్లైమాక్స్ కార్డ్ వేసుకొని హ‌మ్మయ్య అనిపించాడు.

సందీప్ కిష‌న్ ఈజ్ ఉన్న ఆర్టిస్ట్‌. అత‌నితో ఎలాంటి క్యారెక్టరైనా పండించొచ్చు. అయితే మ‌హేష్ బాబుని ఇమిటేట్ చేయ‌డం మానుకోవాలి. మ‌హేష్ ని డిట్టో దింపేద్దామ‌నే ప్రయ‌త్నం చాలాసార్లు క‌నిపించింది. తాను త‌న‌లా చేయొచ్చు క‌దా, అనిపిస్తుంది. రెజీనా మ‌రోసారి ఆక‌ట్టుకొంటుంది. అందం, న‌ట‌న‌.. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌. దాంతో పాటు న‌డుం, బొడ్డు కూడా చూపించి మాస్‌ని అల‌రిస్తుంది. లిప్ లాక్ కిస్‌…. యువ ప్రేక్షకుల‌కు బోన‌స్‌. జ‌గ్గూభాయ్‌గా జ‌గ‌ప‌తి న‌ట‌న కూడా ఆక‌ట్టుకొంటుంది. కామెడీ చేద్దామ‌నుకొన్నప్పుడు పండ‌లేదు గానీ, కాస్త ఎమెష‌న‌ల్ ట‌చ్ ఇచ్చిన‌ప్పుడు మాత్రం అందులో జ‌గ‌ప‌తి మార్క్ క‌నిపించింది. భ‌ర‌ణి, స‌త్యం రాజేష్‌, ర‌విబాబు….. త‌మ ప‌రిధిలో చ‌క్కగానే రాణించారు.

సాంకేతికంగా కెమెరా ప‌నిత‌నానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. చాలా రిచ్ ఫీల్ వ‌చ్చింది. గ్రీన‌రీని బాగా తెర‌పై చూపించారు. అచ్చు సంగీతంలో రెండు పాట‌లు ఆక‌ట్టుకొంటాయి. ఆర్‌.ఆర్‌లో స్వామి రారా ఛాయ‌లు ఎక్కువ‌గా వినిపించాయి. మాట‌లు ఓకే. అయితే ద‌ర్శకుడిగా మ‌హేష్ అర‌కొర మార్కులే తెచ్చుకొన్నాడు. సీన్స్ డ‌వ‌లెప్ చేసుకోవ‌డంలో అత‌ని అనుభ‌వ రాహిత్యం క‌నిపించింది. సినిమా అంతా ఒకే చోట‌.. తిరుగాడుతుంటుంది. కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. సినిమా ఎంత రిచ్‌గా క‌నిపించినా, ఫీల్ మాత్రం మిస్ అవుతూవ‌చ్చిందంటే కార‌ణం ద‌ర్శకుడిలో లోప‌మే.

చిన్న సినిమా అయినా హైస్టాండ‌ర్డ్‌లో తీశారు. భారీగా ఖ‌ర్చు పెట్టారు. కానీ.. అందుకు త‌గిన ప్రతిఫ‌లం ద‌క్కక‌పోవ‌చ్చు. పాత సినిమాల ప్రభావం ఉండొచ్చు. కానీ అలాంటి సినిమానే మ‌ళ్లీ మ‌ళ్లీ తీస్తే, జ‌నం చూస్తార‌నుకోడం భ్రమ‌. బీసీల్లో ఈ సినిమాకి టికెట్లు కొన్ని తెగొచ్చు. బాక్సాఫీసు ద‌గ్గర మ‌రో పెద్ద సినిమా లేక‌పోవ‌డం ఈ సినిమాకి ప్లస్‌. కానీ అదొక్కటే ఈ సినిమా కాపాడ‌గ‌ల‌దా?? అన్నది అతి పెద్ద ప్రశ్న.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.