రివ్యూ : రేసుగుర్రం

qxs5z959

 

                            |Click here for English Review|

వినోదాలతో దౌడు తీసిన‌రేసుగుర్రం’ – తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.75/5

ఎంట‌ర్‌ టైన‌ర్ సినిమా కంటే సేప్ జోన్ లేదు.. ఎప్ప‌టికీ రాదు. రెండున్న‌ర గంట‌ల పాటు.. ప్రేక్ష‌కుడు త‌న‌ని తాను, బ‌య‌టి ప్ర‌పంచాన్ని మ‌ర్చిపోయే ద‌మ్ము ఆ సినిమాలో ఉంటే… క‌చ్చితంగా హిట్టే. అందుకే… క‌థ లేద‌న్న సంగ‌తి ప‌క్క‌న పెట్టండి. లాజిక్కులు మ‌ర్చిపోండి. ఓన్లీ ఎంట‌ర్‌ టైన్ మెంట్‌ ని మాత్ర‌మే న‌మ్ముకోండి… విజ‌యం త‌థ్యం అని న‌మ్ముతున్నారంతా. రేసుగుర్రం కూడా అలాంటి కొల‌త‌ల‌తో వ‌చ్చిందే. ప్రేక్ష‌కుడు సినిమా నుంచి ఏవేం ఆశిస్తాడో అవ‌న్నీ ఇందులో రంగ‌రించే ప్ర‌య‌త్రం చేశారు. వినోదాల‌తో ఈ గుర్రాన్ని దౌడు తీయించారు. ఇంకేముంది.. సినిమా చూపిస్త మావా.. అన్న బ‌న్నీ మాట‌ల నిజ‌మ‌య్యాయి. అచ్చ‌మైన వినోదాల విందు పంచేశాడు.. బ‌న్నీ. ఇంత‌కీ ఈ రేసుగుర్రం ఎలా ఉంది? ఎవ‌రు ఎంత స్పీడుతో ప‌రిగెట్టారు..?? తెలుసుకోవాలంటే క‌థ‌లోకి ఎంట‌రైపోవాల్సిందే.

రామ్ (కిక్ శ్యామ్‌), ల‌క్కీ (బన్నీ) అన్నాద‌మ్ములు. ఒక‌రంటే ఒక‌రికి ఒక్క క్ష‌ణం కూడా ప‌డ‌దు. టామ్ అండ్ జ‌ర్రీలా కొట్టుకొంటుంటారు. రామ్ బాగా చ‌ద‌వి పోలీస్ అవుతాడు. ల‌క్కీ చ‌దువు అబ్బ‌క‌… బేవార్స్ అవుతాడు. ఆ సిటీలో శివారెడ్డి పెద్ద గుండా. మంత్రి అవ్వాల‌న్న‌ది అత‌ని ఆశ‌యం. అయితే త‌న‌పై చాలా కేసులుంటాయి. ఇవ‌న్నీ పోలీస్ డిపార్ట్ మెంట్ తిర‌గేస్తుంటుంది. సాక్ష్యాలు సంపాదించి.. శివారెడ్డిని ఎమ్మెల్యే కాకుండా చేయాల‌న్న‌ది పోలీసుల ప్ర‌య‌త్నం. శివారెడ్డిని ప‌ట్టుకోవాల‌న్న ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ప్రాణాలు కోల్పోతాడు. ఇక శివారెడ్డికి చెక్ పెట్టే బాధ్య‌త రామ్‌ పై ప‌డుతుంది. శివారెడ్డికి అరెస్టుకు కావ‌ల్సిన సాక్ష్యాల్ని సేక‌రిస్తాడు.. రామ్‌. ఈ విష‌యం తెలుసుకొన్న శివారెడ్డి రామ్‌ని చంపే ప్లాన్ చేస్తాడు. ఆధారాల‌తో శివారెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి బ‌య‌లుదేరదేర‌తాడు రామ్‌. అయితే… రామ్ పోలీస్ జీప్‌ ని కావాల‌ని దొంగిలిస్తాడు ల‌క్కీ. దాంతో.. రామ్ త‌ప్పించుకొన్నా… త‌న అన్న‌ని ఎవ‌రో చంపాల‌నుకొంటున్న సంగ‌తి ల‌క్కీకి తెలుస్తుంది. నా అన్న జోలికి వ‌స్తే.. నీ జీవితాన్ని తిర‌గ‌బెట్టేస్తా.. అని శివారెడ్డికి వార్నింగ్ ఇచ్చి. నామినేష‌న్ వేయ‌కుండా చేస్తాడు ల‌క్కీ. దాంతో శివారెడ్డి ల‌క్కీపై ప‌గ పెంచుకొంటాడు. అడ్డదారిలో మంత్రిగా మారి.. రామ్‌ ని స‌స్పెండ్ చేయిస్తాడు. ల‌క్కీ ఇంటిని కూల‌దోయిస్తాడు. ల‌క్కీ కుటుంబాన్ని రోడ్డుపై నిల‌బెడ‌తాడు. అప్పుడు మొద‌లెడ‌తాడు ల‌క్కీ.. అస‌లు రేసు. ఏ అధికారంతో త‌న అన్నని ఉద్యోగంలోంచి తీయించాడో, ఏ అధికారంతో త‌న ఇంటిని కూల‌దోల్చాడో ఆ అధికార‌మే లేకుండా చేస్తాన‌ని స‌వాల్ చేస్తాడు. మ‌రి అందుకోసం ల‌క్కీ ఏం చేశాడు? అన్న‌య్య ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకొన్నాడ‌న్న‌ది క్లైమాక్స్‌.

సురేంద‌ర్‌ రెడ్డికి స్టైలీష్ మేక‌ర్ అనే పేరుంది. ఈసారి స్టైలీష్ స్టార్ ని హీరోగా పెట్టుకొన్నాడు. దాంతో.. ఈ సినిమాలో స్టైల్ రెట్టింపు అయ్యింది. సురేంద‌ర్‌రెడ్డికి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్‌లో మంచి ప‌ట్టుంది. కిక్‌ తో అది రూఢీ అయ్యింది. ఈసారీ… సురేంద‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌నే న‌మ్ముకొన్నాడు. ప్ర‌తీ సీన్‌.. న‌వ్వుల‌తో ముంచెత్తాడు. దాంతో ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ రేసుగుర్రంలా చ‌క చ‌క ప‌రుగెడుతూనే ఉంటుంది. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రిగే గొడ‌వ కూడా చాలా ఫ‌న్నీగా ఉంటుంది. ఇక‌.. స్పంద‌న (శ్రుతిహాస‌న్‌) పాత్ర‌ని ప‌రిచ‌యం చేసిన ద‌గ్గ‌ర నుంచీ… ఆ పాత్ర‌లోని విచిత్ర‌మైన స్వ‌భావాల‌ను బ‌య‌ట‌పెట్టేంత వ‌ర‌కూ.. జ‌నం న‌వ్వుతూనే ఉంటారు. ఓ క‌థానాయిక పాత్ర‌ని ఇంత ఎంట‌ర్‌టైనింగ్‌గా ప‌రిచ‌యం చేసిస సినిమా బహుశా ఈమ‌ధ్య‌కాలంలో ఇదేనేమో…?? కామెడీని న‌మ్ముకొన్న సురేంద‌ర్‌రెడ్డి.. ప్ర‌తీ సీన్‌లోనూ ఫ్రెష్ కామెడీ పండించ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు.. అందులో స‌ఫ‌లీకృతమ‌య్యాడు. ఇక రెండో భాగంలో క‌థ ఊర‌క‌లెత్తుతుంది. హీరో – విల‌న్ల మ‌ద్య ఛాలెంజ్‌తో యాక్ష‌న్ పండించ‌డానికి కావ‌ల్సిన రంగం సిద్ధం చేసుకొన్నాడు. ఫైట్స్‌కి మాస్‌కి న‌చ్చేలా. పాట‌లు యూత్ కి ఎక్కేలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకొన్నాడు. చివ‌ర్లో బ‌న్నీని పోలీస్‌ని కూడా చేశాడు. అందులో లాజిక్ లేక‌పోయినా.. కావ‌ల్సినంత కామెడీ ఉంది. అది చాల‌దూ… జ‌నానికి న‌చ్చేయ‌డానికి.

బ‌న్నీ చాలా స్టైలీష్‌ గా క‌నిపించాడు. అత‌ని బాడీ లాంగ్వేజ్‌… చ‌లాకీత‌నం రేసుగుర్రం అనే టైటిల్‌కి ప‌ర్‌ఫెక్ట్ గా న్యాయం చేశాయి. దేవుడా… అంటూ వెరైటీగా ప‌ల‌క‌డం… అభిమానుల‌కు న‌చ్చుతుంది. బ‌న్నీ కామెడీ, యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ సీన్స్‌, డాన్స్‌… ఇలా ఒక్క‌టీ వ‌దిలిపెట్ట‌లేదు. ఇర‌గ‌దీశాడంతే! కిక్ శ్యామ్ పాత్ర కూడా చాలా కీల‌కం. ద‌ర్శ‌కుడు ఏన‌మ్మ‌కంతో ఆ బాధ్య‌త అప్ప‌గించాడో.. దాన్ని తు.చ త‌ప్ప‌కుండా నిజం చేశాడు. శ్రుతికి అంత స్కోప్ లేదు. కానీ.. ఓపెనింగ్ సీన్స్ ఆక‌ట్టుకొంటాయి. క్యూట్‌ గా క‌నిపించింది. బ‌న్నీతో డాన్సులు.. క‌ష్ట‌ప‌డి చేసింది. స‌లోని పాత్ర‌కు ప్రాధాన్యం లేదు. స‌లోని కాకుండా ఎవ‌రిని ఎంచుకొన్నా పెద్ద తేడా ఉండేది కాదు. అలీ. ఎమ్మెస్‌, జ‌యప్ర‌కాష్ రెడ్డి యాజ్ ఇట్ ఈజ్‌.. బాగా చేశారు. పోసానికి మ‌ళ్లీ మంచి మార్కులు ప‌డ‌తాయి. ఇక కొస‌మెరుపు పాత్ర‌లో బ్ర‌హ్మానందం క‌నిపిస్తాడు. చిల్‌ బుల్ పాండేగా బ్ర‌హ్మీ… చివ‌ర్లో అద‌ర‌గొట్టేశాడు. పోరాట సన్నివేశాల్లోనూ కామెడీ పండిందంటే.. అది బ్ర‌హ్మీవ‌ల్లే. ఆ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు వాడుకొన్న విధానం బాగుంది. ఇక విల‌న్‌ గా న‌టించిన న‌టుడు.. ఈ సినిమాకి పెద్ద మైన‌స్‌. తెలిసిన న‌టుడిని ఎంచుకొంటే బాగుండేది. లిప్ సింక్ అస‌లు కుద‌ర్లేదు. అంత భయంక‌ర‌మైన విల‌న్‌ ని జోక‌ర్‌గా చూపించే ప‌ద్ధ‌తి ఈ సినిమాలోనూ క‌నిపించింది. బ‌న్నీ పోలీస్ అవ్వ‌డం, స్పెష‌ల్ ఫోర్స్ న‌డిపించడం ఇవ‌న్నీ లాజిక్‌ ల‌కు ఏమాత్రం అంద‌వు. అయినా.. కామెడీగానే తీసుకోవాలి.

ప‌ర‌మ‌హంస కెమెరా ప‌నిత‌నం చూడ‌చ‌క్క‌గా ఉంది. త‌మ‌న్ పాట‌ల్లోనూ. నేప‌థ్య సంగీతంలోనూ మార్క్ చూపించాడు. పాటల్లో మెలోడీ మిస్ అయ్యింది. రేసు గుర్రం.. పేరుకు త‌గ్గ‌ట్టే ఫాస్ట్ బీట్ పాట‌లే ఎక్కువ‌గా వినిపించాయి. రెండో భాగంలో వ‌చ్చే పాట‌లన్నీ మిస్ టైమింగ్‌ లో వ‌చ్చిన‌వే. యాక్ష‌న్ స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు బాగా తెర‌కెక్కించాడు. మ‌రీ ముఖ్యంగా ఈసినిమాలో మాట‌లు బాగా పేలాయి. ప్రాస‌లు. పంచ్‌ లూ, హీరోయిజం కోసం చెప్పే డైలాగులూ లేవుగానీ.. చాలామ‌ట్టుకు ఫ‌న్నీగా ఉన్నాయి. ఈ సినిమాలో ఎంట‌ర్‌ టైన్‌మెంట్ ఇంత బాగా పండిందంటే.. సంభాష‌ణ‌లు ప్ర‌ధాన కార‌ణం. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది.

లాజిక్‌లు వ‌దిలేసి చూస్తే.. రేసుగుర్రం బాగా ఎంట‌ర్‌ టైన్ చేస్తాడు. స‌మ్మ‌ర్ సీజ‌న్ ఇది. లెజెండ్ త‌ప్ప‌.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర మ‌రో సినిమా లేదు. మాస్‌, క్లాస్‌…. మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆక‌లి తీర్చే సినిమా రేసుగుర్రం.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.75/5                           – స్వాతి
***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 Click here for English Review