రివ్యూ: ‘రాజా రాణి’

rajarani

నాలుగు స్థంభాలాట‌ : రాజా రాణీతెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5 |Click Here for English Review|

ఎన్ని ప్రేమకథలు తెరకెక్కినా, ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే వుంటాయి. వచ్చిన వాటినే మళ్లీ అటు మార్చి, ఇటు మార్చి కొత్త లైన్ పుట్టించడం అన్నది సినిమా దర్శకులకు అచ్చివచ్చిన సృజన. హీరో హీరోయిన్లలో ఒకరి ప్రేమ విఫలమై, వేరే పేళ్లి జరగడం, ఆపై పుట్టే సంఘర్షణలు జనం చూసేసారు .అందుకే, ఇద్దరికి ప్రేమ విఫలమై, ఫెళ్లి జరిగితే ఎలా వుంటుంది అన్న లైన్ తీసుకుని, ప్రేమలో విఫలమైనంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు. మళ్లీ మనకు నచ్చినవాళ్లతో ఎక్కడో ఓ పాయింట్ లో జీవితం మళ్లీ ప్రారంభమవుతుంది అన్న చిన్న మెసేజ్ జోడించి తీసిన సినిమా రాజు రాణి. మానవ సంఘర్షణలు తెరకెక్కించడం, అవి జనరంజకంగా సాగడం అన్నది కాస్త కష్టమైన ప్రక్రియ కాబట్టి, దర్శకుడు కాస్త లైటర్ వీన్ గా నడిపించాలని చూసిన సినిమా ఇది. ఇంతకీ కథేంటంటే,.,.

జాన్(ఆర్య), రెజీనా(నయనతార)లకు చర్చిలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి సమయంలోనే కాస్త ఎడమొహం పెడమొహంతో వుంటారు. ఎందుకంటే ఇద్దరికీ పెళ్లి ఇష్టం వుండదు. దాంతో ఒకరిని మరొకరు బాధ పెట్టుకునే కార్యక్రమం ప్రారంభిస్తారు. కానీ అంతలోనే ఒకరి కథ మరొకరికి తెలుస్తుంది. జానీ అంతకు ముందు కీర్తన అనే అమ్మాయిని(నజ్రియా నజీమ్) వెంటబడి మరీ ప్రేమిస్తాడు. పెద్దలకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంటాడు.కానీ ఆమె ప్రమాదంలో మరణిస్తుంది. రెజీనాకూ ఓ ప్రేమ కథ వుంటుంది. ఆమె సూర్య(జై)ని ప్రేమిస్తుంది. కానీ సూర్య తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. తండ్రి బలవంతంపై సూర్య అమెరికా వెళ్లిపోతాడు. అతగాడు, అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు కబురు వస్తుంది. చివరకి తప్పని సరిగా, తండ్రి కోసం జాన్ ను పెళ్లి చేసుకుంటుంది. ఇరువైపుల కథలు తెలిసాక, జాన్, రెజీనా ఒకరంటే మరొకరు ఇష్టపడడం ప్రారంభిస్తారు. కానీ ఎవరూ బయటపడరు. చివరకు వారు కలిసే వున్నారా లేదా అన్నది మిగిలిన కథ.

చూడ్డానికి ఓ కథలా కనిపించినా, ఇది మూడు కథలతో ముడిపడిన నాలుగు స్తంభాలాట. ఓ కథలో అమ్మాయి వీర ప్రేమికురాలు. మరో కథలో అబ్బాయి గొప్ప ప్రేమికుడు. అలాంటి వాళ్లు తమ తమ ప్రేమలో విఫలమై, అనుకోకుండా కలిస్తే ఎలా వుంటుంది. లైన్, దానికి సంబందించిన డైలాగులు, ఈ మూడు కథలు కలిసే జంక్షన్ పాయింట్లు అన్నీ దర్శకుడు బాగానే ఆలోచించుకున్నాడు. కానీ కథల నిడివి, దానికి కావాల్సిన బలమైన సన్నివేశాలు, లాజిక్ వంటివి పూర్తిగా విస్మరించాడు. దాంతో నిడివి పెరిగింది. సన్నివేశాల బలం తగ్గింది. కళ్ల ముందు సినిమా నడుస్తుంటుంది. కానీ కదిలిన అనుభవం వుండదు మళ్లీ అంతలోనే కాదు కాదు, నడుస్తోంది అనిపిస్తుంది. రెజీనా-సూర్యల ప్రేమ కథపై తీసుకున్న శ్రద్ధ, జాన్ – కీర్తనల పెళ్లి వ్యవహారంలో చూపించలేదు. ఇక ఈ రెండు కథలను కలిపే ప్రథాన కథ అయితే అస్సలు లాజిక్ కు అందదు. తప్పని సరై పెద్దల వత్తిడితో పెళ్లి చేసుకున్న ఇద్దరూ, అయితే ఎడమొహం పెడమొహంగా వుండాలి. లేదా, రాజీ పడాలి కానీ, ఒకరిపై మరొకరు శాడిజం చూపించుకోవడం ఎందుకో? పైగా వారు ప్రేమను అనుభవించినవారే. అలాంటిది మరొకరిని ఎలా ఇబ్బంది పెడతారు అన్న లాజిక్ విస్మరించాడు దర్శకుడు. పోనీ ఆ ఎపిసోడ్ అయిపోయింది, ఒకరంటే మరొకరికి అభిమానం ఏర్పడిన తరువాత దానిని చేతల్లో ప్రధర్శించడానికి ముందుకు వచ్చినవారు, మాటల్లో వ్యక్డ పరుచుకోకపోవడం అన్నది కేవలం సినిమా నడక కోసం అన్నట్లుంది. ఇక ఇవన్నీ చాలదన్నట్లు క్లయిమాక్స్ లో ట్విస్ట్ ఒకటి. దాని వల్ల ఉపయోగం లేదు కూడా.

ఇలాంటి సినిమాలో కీలక పాత్ర ధారులు ఆర్య-నయనతార-జై-నజ్రియా-సంతానం-సత్యరాజ్. అందరూ మంచి నటులే. బాగానే చేసారు. సత్యరాజ్-నయనతార నడుమ సన్నివేశాలు బాగా పండాయి. జివి ప్రకాష్ కుమార్ పాటలేమిటో? ఆ లోకమేమిటో? నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. జార్జి విలియమ్స్ ఫొటోగ్రఫీ బాగుంది. పాటల కోసం ఎన్నుకున్న థీమ్ లు బాగున్నాయి. సినిమా ఆద్యంతం రిచ్ లుక్ సంతరించుకోవడానికి ఫోటోగ్రఫీ తో పాటు లోకషన్లు కూడా దోహదం చెసాయి. అందరు సాంకేతిక నిపుణుల్లా, ఎడిటర్ కూడా కాస్త పని చేసి వుంటే సినిమా నిడివి కనీసం ఇరవై నిమషాలు తగ్గేది. అయితే అందుకు దర్శకుడు కూడా సహకరించాలి కదా. మొత్తం మీద వర్తమాన కుర్రకారుకు కాస్తలో కాస్త నచ్చే సినిమాగా మిగలింది తప్ప, ఓ మంచి ప్రేమకథా చిత్రం కాలేకపోయింది రాజు రాణి.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5                          – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click Here for English Review