రివ్యూ : రౌడీ

rowdy-telugu-review

స‌ర్కార్ కాదు.. స‌ర్క‌స్‌ ‘రౌడీ’: తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5

పూల‌మ్ముకొన్న చోటే… క‌ట్టెలు అమ్ముకోవ‌డం అంటే ఏమిటో… రాంగోపాల్ వ‌ర్మ‌ని చూస్తే తెలుస్తుంది. ఎక్క‌డి శివ‌.. ఎక్క‌డి రౌడీ! శివ మాటెందుకు లెండి. సర్కార్‌నే తీసుకోండి. ప్ర‌తీ ఫ్రేమ్‌నీ క‌ళ్ళ‌ల్లో పెట్టి దాచుకోవాల‌నిపిస్తుంది. టెక్నిక‌ల్‌గా వ‌ర్మ‌ని వేలు పెట్టి చూపించేవాళ్లు ఈ భూ ప్ర‌పంచంలోనే ఉండ‌రు అనుకొన్నాం! అదొక్క‌టేనా ఎమోష‌న్స్ మీద గ్రిప్ లేక‌పోతే స‌త్య‌లాంటి సినిమా తీస్తాడా?? టోట‌ల్ గా వ‌ర్మ ఓ జాదూ. అత‌ని మాయాజాలానికి అంద‌రూ ముగ్థులైపోవాలి. కానీ ఆ స‌ర్కార్ స్థాయి ఎక్క‌డ? ఇప్పుడ‌న్నీ సర్క‌స్ గంతులు మిన‌హా ఏం మిగిలింది. రౌడీ సినిమా చూస్తే ఇలాంటి ఫీలింగే క‌లుగుతుంది. వ‌ర్మ భ‌క్తులు, అభిమానులు… ఎవ‌రైనా కానివ్వండి. వ‌ర్మని ఓ స్థాయిలో ఊహించుకొన్న వాళ్ల‌కు ఈ రౌడీ ఆన‌డు. అదెందుకో.. రివ్యూలోకి ఎంట‌రైతే మీకే తెలుస్తుంది.

రాయ‌ల‌సీమ‌లోని ఓ ప్రాంతానికి అన్న (మోహ‌న్ బాబు) దేవుడు. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్ట‌మొచ్చినా ఆదుకొంటాడు. అందుకోసం రౌడీయిజం చేస్తుంటాడు. ఆ ప్రాంతంలో నంద‌వ‌రం అనే ప్రాజెక్టు క‌ట్టాల‌నుకొంటుంది ప్ర‌భుత్వం. ఆ ప్రాజెక్టు వ‌ల్ల కొన్ని గ్రామాలు ముంపుకు గుర‌వుతాయి. అందుకే అన్న అడ్డుగా నిల‌బ‌డ‌తాడు. అన్న‌కు ఇద్ద‌రు కొడుకులు. పెద్ద కొడుకు భూష‌ణ్ ( కిషోర్‌) మ‌హా చెడ్డ‌వాడు. అమ్మాయిల పిచ్చి. అన్న ఆ ప్రాంతానికి దైవం అయితే… భూష‌ణ్ దెయ్యంలాంటి వాడు. చిన్న కొడుకు కృష్ణ (విష్ణు) చ‌దువు పూర్తి చేసి… ఇంట్లోనే ఉంటాడు. త‌ను శిరీష (శాన్వి)ని ప్రేమిస్తాడు. ప్రాజెక్టుకు అడ్డు త‌గులుతున్నాడ‌ని కొంత‌మంది అన్న‌ని చంపాల‌నుకొంటారు. అందులో.. భూష‌ణ్ కూడా భాగ‌స్వామి అవుతాడు. వంద కోట్ల‌కు ఆశ‌ప‌డి క‌న్న‌తండ్రినే మ‌ట్టుపెట్టాల‌ని చూస్తాడు. ఈ కుట్ర‌ని కృష్ణ ఎలా అడ్డుకొన్నాడు? ఆ ప్రాజెక్టు ఏమైంది? ఇంత‌కీ శిరీష ఎవ‌రు? ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే రౌడీ చూడాలి.

గాడ్ ఫాద‌ర్ ప్ర‌భావం వ‌ర్మ‌కి ఇంకా పోలేదు. ఆ ఎఫెక్ట్‌తోనే సర్కార్ సినిమా తీశాడు. అ ప్ర‌భావం ఇంకా ఎక్క‌డో ఉండిపోయింది. ఇప్పుడు రౌడీని తీశాడు. ఒకే క‌థ‌ని ఎన్నిసార్లు తిప్పి చూపించినా ఫ‌ర్లేదు. ప్రేక్ష‌కులు కూడా ఫీల‌వ్వ‌రు. టేకింగ్‌బాగుంటే ఆద‌రించ‌డానికి సిద్ధ‌మే. కానీ ఆ విష‌యంలోనూ వ‌ర్మ న్యాయం చేయ‌లేకపోయాడు. తండ్రిని చంపాల‌నుకొన్న ముఠాని కొడుకు ఎలా అంతం చేశాడు? అన్న‌దే ఈ స్టోరీ కాన్సెప్ట్‌. ఇందులో కొత్త‌ద‌నం ఏముంది? అస‌లు ఎగ్జ‌యిట్ అయ్యి సినిమా తీసేంత ఇందులో ఏం క‌నిపించింది. వ‌ర్మ టెక్నిక‌ల్ బ్రిలియ‌న్సీపై న‌మ్మ‌కం ఉండి ఈసినిమాకి ఓకే చెప్పారే అనుకొందాం? మ‌రి ఏమైంది ఆటెక్నిక‌ల్ బ్రిలియ‌న్స్. స‌న్నివేశాలు పేర్చుకొంటూ పోవ‌డం త‌ప్ప‌… వ‌ర్మ ప‌నిత‌నం ఎక్క‌డ క‌నిపించింది. ఆ మాత్రం షాట్స్‌.. ఈత‌రం కుర్రాళ్లు, వ‌ర్మ శిష్యులు పెట్ట‌లేరా?? వ‌ర్మ సినిమాలు చూసో, గాడ్‌ఫాద‌ర్‌ని మ‌ళ్లీ ప్రేర‌ణ తెచ్చుకొనో ఇలాంటి సినిమాల్ని ఇంకా క్వాలిటీగా తీసే దర్శ‌కులున్నారు. మ‌రి వ‌ర్మ గొప్ప‌ద‌నం ఏమిటి?

సీన్ ఎలాంటిదైనా ఓ మూడ్ క్రియేట్ చేయ‌డం వర్మ స్టైల్‌. కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్ప‌.. ఆ ఎఫెక్ట్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మ‌ణిర‌త్నం సినిమా నాయ‌కుడు చూడండి. క‌మ‌ల్‌హాస‌న్ జ‌నంతోక‌దులుతుంటే రోమాలు నిక్క‌బొడుస్తాయి. ఆ ప్లేస్ లో మ‌నం ఉన్న‌ట్టు అనిపిస్తుంది. నాయ‌కుడిని అలానేచూపించాలి. అలా చూపించాలంటే బ‌ల‌మైన ప్ర‌తినాయ‌క గ‌ణం ఉండాలి? ఈ సినిమాలో ఏదీ ఆ గ‌ణం?? భ‌ర‌ణి, జీవా అండ్ గ్యాంగ్‌ని చూస్తుంటే.. వీళ్లు జోక‌ర్లా, విల‌న్లా? అనిపిస్తుంది. ఒక‌డేమో కేక్ తింటుంటాడా? ఇంకోక‌డేమో అర్థం ప‌ర్థం లేని వేదాంతాలు, వేదాలు చెబుతుంటాడా?? వ‌ర్మ పైత్యాన్ని భ‌ర‌ణి పాత్ర‌లో జొప్పించేశారు పూర్తిగా. నువ్వు పుట్టావంటే అది నీ గొప్ప‌ద‌నం కాదు. నీ తండ్రికి నీమీద ప్రేమ ఉండీ కాదు. కోరిక తీర్చుకోవ‌డానికి మీ అమ్మ ప‌క్క‌న ప‌డుకొంటే పుట్టావ్‌. అంతే త‌ప్ప‌.. నిన్ను క‌నాల‌న్న పోగ్రాం పెట్టుకోలేదు మీ అమ్మానాన్న‌.. అన‌డంలో వ‌ర్మ‌సిద్దాంతాలు, పిచ్చి ఆలోచ‌న‌లు క‌నిపిస్తున్నాయంతే.

మోహ‌న్ బాబు న‌ట‌నా ప‌టిమ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి త‌ర‌వాత మోహ‌న్ బాబు కోసం ఇంత స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్‌ని ఎవ్వ‌రూ డిజైన్ చేయ‌లేదు. ఈ విష‌యంలో వ‌ర్మ‌ని అభినందించాలి. మోహ‌న్ బాబు డైలాగ్ డెలివ‌రీ, బాడీ లాంగ్వేజ్ కొత్త‌గా ఉంటాయి. మోహ‌న్ బాబు అభిమాని కానివాడు కూడా.. ఈ సినిమాలో మోహ‌న్‌బాబుని చూస్తే ఫ్యాన్ అయిపోతారు. ఆ ఒక్క క్యారెక్ట‌ర్ త‌ప్ప‌.. ఈ సినిమాలో మ‌రేం క‌నిపించ‌దు. జ‌య‌సుధ‌… ఓకే అనిపించింది. విష్ణు స‌పోర్టింగ్‌కే ప‌నికొచ్చాడు. భ‌ర‌ణి చాలా మంచి న‌టుడు. ఈ సినిమాలో భ‌ర‌ణి న‌ట‌న చూస్తే.. కాస్త వికారంగా అనిపిస్తుంది. ఆ ఘ‌న‌త కూడా వ‌ర్మ మూట‌గ‌ట్టుకోవాల్సిందే. శాన్వి క్యారెక్ట‌ర్ శుద్ధ దండ‌గ‌. ఓ పాట కోసమే ఆమెను తీసుకొన్న‌ట్టు అనిపిస్తుంది. ప‌రుచూరి గోపాల‌కృష్ణ, రవిబాబు…. తెర‌పై క‌నిపించారు అని చెప్పుకోవాలేమో.?!

సాంకేతికంగా వ‌ర్మ సినిమాల స్థాయి… ఈ సినిమాకి లేదు. వ‌ర్మ సినిమాలో క‌నీసం ఒక్క ఫ్రేమ్ అయినా.. భ‌లే కొత్త‌గా ఉందే…అనిపిస్తుంది. ఈ సినిమాలో సుమో పేలే సీన్ ఓ కొత్త యాంగిల్‌లో తీశాడు. అది మిన‌హా టెక్నిక‌ల్ మెరుపుల్లేవు. సాయికార్తిక్ ఇచ్చిన రొమాంటిట్ ట్యూన్ ఒక్క‌టే బాగుంది. ఆర్‌.ఆర్ విష‌యానికొస్తే… ఒక్క బిట్ కొట్టి అది ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడేసుకొన్నారు. డైలాగులు ఫ‌ర్వాలేద‌నిపించాయి. మోహ‌న్ బాబు – జ‌య‌సుధ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన డైలాగులు బాగున్నాయి.

మొత్తానికి వ‌ర్మ అభిమానులు నిరాశ ప‌డే సినిమా ఇది. యాక్ష‌న్ హంగామా కోసం సీ సెంట‌ర్ ప్రేక్ష‌కులు చూస్తారేమో. బీవాళ్లు తెలివైన వాళ్లు… సినిమా రిజ‌ల్ట్ తేలాకే థియేట‌ర్ల‌కు వెళ్తారు. ఏ క్లాస్ వాళ్ల కు ఓపిక ఎక్కువ.. ఈ సినిమా డీవీడీ వ‌చ్చేవ‌ర‌కూ ఆగుదామ‌నుకొంటే…మంచి నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టే.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5            – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు