రివ్యూ: స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌

something-something-movie-r

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5 | Click here for English Review

హాయిగా నవ్వుకోవచ్చు…!

ఈనాటి ప్రేక్షకుడికి అద్భుతాలు అవ‌స‌రం లేదు. అలాగ‌ని సాదా సీదా చిత్రాన్నీ ఇష్టప‌డ‌డం లేదు. జ‌స్ట్‌… రెండుగంట‌ల ప్రయాణం జాలీగా సాగిపోతే  చాలు. ఈ విష‌యం తెలీక‌.. ద‌ర్శక నిర్మాత‌లు – సినిమా నిండా ఏవేవో నింపేయ‌డానికి తాప‌త్రయ‌ప‌డిపోతున్నారు. కొండ‌తో వెంట్రుక లాగే ప్రయ‌త్నం చేయ‌బోయి… బొక్కబోర్లా ప‌డుతున్నారు. కాస్త వినోదం, కాస్త ప్రేమ – బ‌య‌ట‌కు వ‌చ్చి చెప్పుకోవ‌డానికి కాస్త క‌థ. ఇవుంటే ఎంట‌ర్‌టైన్ చేయొచ్చు అని కొన్ని సినిమాలు రుజువు చేస్తుంటాయి. అయితే ఈ మేళ‌వింపు మ‌నం అనుకొన్నంత సుల‌భం కాదు. క‌థ త‌క్కువైన‌ప్పుడు… ఆ లోటు తెలీకుండా గ‌మ్మత్తు చేయించే స‌న్నివేశాలు రాసుకోవాలి. సుంద‌ర్ సి అదే చేశాడు. స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌తో.

ఈ సినిమా క‌థ గొప్పగా లేదు.. ఆ మాట కొస్తే క‌థే లేదు. ఇంత‌కు ముందు మీరు చూడ‌నటువంటి అబ్బుర ప‌రిచే స‌న్నివేశాలు లేవు.. భీభ‌త్సమైన గ్రాఫిక్సూ. హీరోయిజాలూ, ఎక్స్‌పోజింగ్ పాట‌లూ, భ‌యంక‌ర‌మైన మ‌లుపులూ ఏమీ లేవు.. జ‌స్ట్ మీ టికెట్టు ధ‌ర గిట్టుబాట‌య్యే గ్యారెంటీ ఉంది. ఎవ్రిథింగ్ మా సినిమాలోనే ఉన్నాయ‌నుకొని చెప్పి న‌థింగ్ న‌థింగ్ సినిమాలు చూపిస్తున్న ఈ కాలంలో… స‌మ్ థింగ్ స‌మ్‌థింగ్ చూపించిన సినిమా ఇది. ఇంత‌కీ ఈ సినిమా కథేమిటంటే…

కుమార్ (సిద్దార్థ్) ఓ ప్రేమ‌సాగ‌రం కుటుంబంలో పుట్టాడు. అంటే ఇంట్లో అంద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకొన్న బాప‌తే. కానీ కుమార్‌కి ప్రేమంటే అస్సలు ప‌డ‌దు. ఫ్లాష్ బ్యాక్‌లో అమ్మాయిల విష‌యంలో కొన్ని ఘోర‌మైన అనుభ‌వాలు ఎదురౌతాయి. అందుకే అమ్మాయిల జోలికి అస్సలు వెళ్లడు. కానీ ఆఫీసులో ఓ మెరుపు తీగ లాంటి అమ్మాయి సంజ‌న ( హ‌న్సిక ) ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. కానీ ఆ విష‌యం మాత్రం ఆమెతో చెప్పలేడు.  ఆ ఆఫీసులో అమ్మాయిల‌కు జార్జ్ (గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్‌) ఓ డ్రీమ్ బోయ్‌. జార్జ్ ప్రేమ కోసం అంద‌రూ ప‌రిత‌పిస్తుంటారు జార్జ్ మాత్రం సంజ‌న‌ని ప్రపోజ్ చేస్తాడు. జార్జ్ ప్రేమ‌ను అంగీక‌రించాలా? వ‌ద్దా అనే మీమాంస ఎదురౌతుంది సంజ‌న‌కు. ఈలోగా సంజ‌న మ‌న‌సు గెలుచుకోవ‌డానికి… కుమార్ త‌న వైపునుంచి ప్రయ‌త్నాలు చేస్తుంటాడు. ల‌వ్ గురు ప్రేమ్‌జీ (బ్రహ్మానందం) స‌ల‌హాల‌తో సంజన – జార్జ్ మ‌ధ్య మ‌స‌న్సర్థలు తెచ్చి – వారి మ‌ధ్య ఓ అడ్డుగోడ క‌ట్టేస్తాడు. మ‌రి సంజూ మ‌న‌సులో స్థానం సంపాదించాడా?  కాంప్లెన్ బోయ్‌లా ఉండే కుమార్‌ని ప్రేమ్‌జీ… కాంప్లికేటెడ్ బోయ్‌గా ఎలా మార్చాడు?  ఈ విష‌యాలు తెలియాలంటే స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ థియేట‌ర్లోకి అడుగు పెట్టాల్సిందే.

చెప్పుకోవ‌డానికి ఇందులో క‌థేం లేదు. ఇది వ‌ర‌కు చూడ‌ని సంగ‌తులూ లేవు. ఎన్నో ప్రేమ క‌థా చిత్రాల్లో పిండి పిప్పి చేసిన విషయాలే ఇవ‌న్నీ. కానీ వాటికే ఎంట‌ర్ టైన్ మెంట్ మిక్స్ చేశాడు… ద‌ర్శకుడు. తెర‌పై పేర్లు ప‌డుతుండ‌గానే ర‌చ‌యిత విజృంభ‌ణ క‌నిపిస్తుంది. పాత్రల ప‌రిచ‌యం, కుమార్ ఫ్లాష్‌బ్యాక్ ఇవ‌న్నీ ఈ సినిమాలో కామెడీ కంటెంట్‌కి ప్రతిబింబంగా నిలిచి – ముందు ఇలాంటి న‌వ్వులు చాలానే ఉన్నాయి అంటూ మ‌రిన్ని కిత‌కిత‌ల‌కు ప్రేక్షకుల‌ను సిద్ధం చేస్తాయి. ఇందులో సిద్దూ హీరో, హ‌న్సిక హీరోయిన్ – అనే విష‌యాలు రెండో సీన్ నుంచే మ‌ర్చిపోతారు. నిజంగా సిద్దూ ఇందులో హీరోగా కాకుండా ఓ క్యారెక్టర్‌గా బిహేవ్ చేయాల‌ని అనుకొన్నాడో అప్పుడే – స‌మ్‌థింగ్ స‌మ్ థింగ్ మొద‌లైపోతుంది. సిద్దూ ఫేస్ కామెడీకి సూట్ కాదు. కానీ ఈ సినిమాలో మాత్రం – త‌న‌ని తాను చ‌క్కగా మౌల్ట్ చేసుకొన్నాడు.

హ‌న్సిక ఈ సినిమాలో అందంగా క‌నిపించింది. కాస్త స్లిమ్ అయ్యిందేమో… – మ‌రింత చూడ‌ముచ్చట‌గా అనిపించింది.హావ‌భావాల విష‌యంలో ఆమెను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. జ‌స్ట్ కొన్ని డైలాగులు ఇచ్చారంతే. ఇక మిగ‌తావాళ్లంతా మ‌న‌కు తెలియ‌ని మొహాలైనా – పాత్రల్లో చ‌క్కగా ఇమిడిపోయారు. బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాని బ్రహ్మానందం నిల‌బెట్టేస్తాడు… అని చెప్పడానికి ఈ సినిమా మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. బ్రహ్మానందం – సిద్దూ మ‌ధ్య న‌డిచిన స‌న్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన బ‌లం. త‌మిళంలో ఇదే.. పాత్ర సంతానం చేశాడు. అక్కడ సంతానం మ‌రింత రెచ్చిపోయే ఉంటాడు. మొత్తానికి ఇక్కడ బ్రహ్మీ, అక్కడ సంతానం ఈ సినిమాకి బూస్ట్‌!! సంభాష‌ణ‌ల ర‌చ‌యిత ఈ సినిమాలో విజృంభించాడో. జోక్ కోసం జోక్ కాకుండా – సెట్యూవేష‌న్ ప‌రంగా కామెడీ సృష్టించాడు. ఈ విష‌యంలో ద‌ర్శకుడు ప‌నిత‌నాన్ని కూడా మెచ్చుకోవాలి. విన‌గానే ఫ‌క్కుమ‌నే పంచులెన్నో ఉన్నాయ్‌.

సంగీతం, ఛాయాగ్రహ‌ణం – ఈ సినిమా కొల‌త‌ల‌కు స‌రిపోయేలా ఉంది. అయితే రెండో భాగం బాగా నెమ్మదించింది. బ్రహ్మానందంకి ఓ ఫ్లాష్‌బ్యాక్ పెట్టడం ద‌గ్గర నుంచి ఈ సినిమా ఫ్లో డ్రాప్ అవుట్ అవుతూ వ‌చ్చింది. సినిమాని అన‌వ‌స‌రంగా కెలుక్కొన్నారు అనిపిస్తుంది ప్రేక్షకుల‌కు. అప్పటి వ‌ర‌కూ స‌జావుగా సాగిన సినిమాలో త‌మిళ అతి.. చొర‌బ‌డి కంగాళి చేస్తుంది. మ‌ళ్లీ ప‌తాక స‌న్నివేశాల్లో జోరు అందుకొన్నాడు ద‌ర్శకుడు. ఆ లాగ్ కూడా లేక‌పోతే – సిద్దూకి చాలా కాలం త‌ర‌వాత సిస‌లైన హిట్ ద‌క్కి ఉండేదే!

స‌ర‌దాగా రెండు గంట‌ల పాటు కాల‌క్షేపం అయిపోవాలంటే ఈ సినిమాకి వెళ్లండి. ముందు మాట‌లో చెప్పుకొన్నట్టు… మీ టికెట్ డ‌బ్బుల‌కు స‌రిప‌డా న‌వ్వులు గిట్టుబాటు అయిపోతాయ్‌.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

Click here for English Version