రివ్యూ : థియేట‌ర్‌లో న‌లుగురు

థియేట‌ర్‌లో న‌లుగురు రివ్యూ : మొత్తానికి భయపెట్టారు…

దెయ్యం సినిమాల‌కు ఓ సౌల‌భ్యం ఉంటుంది. ప‌రిమితమైన బ‌డ్జెట్లో  సినిమా తీయొచ్చు. కాన్సెప్ట్ కాస్త కొత్తగా, ప్రేక్షకుల్ని భ‌య‌పెట్టే తెలివితేట‌లుంటే.. బండి సాఫీగా లాగించేయొచ్చు. స్టార్ కాస్టింగ్ అవ‌స‌రం లేదు. అందుకే ఔత్సాహిక ద‌ర్శకులు, సాంకేతిక నిపుణులు `పోయిందేమంది.. ఓ సారి ప్రయ‌త్నిస్తే` అనికొని ఓ రాయి వేస్తారు. ప‌ని అయ్యిందో కాసుల గ‌ల‌గ‌లే. పైగా భ‌విష్యత్తుకు ఓ ఫ్లాట్‌ఫామ్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే ఈమ‌ధ్య హార‌ర్‌, థ్రిల్లర్ త‌ర‌హా సినిమాలు బాగానే వ‌స్తున్నాయి. ఇప్పుడొచ్చిన థియేట‌ర్‌లో న‌లుగురు కూడా అలాంటి క‌థే! తామేమిటో నిరూపించుకోవాల‌నుకొన్న యువ‌ర‌క్తం చేసిన ఓ ప్రయ‌త్నిమిది. మ‌రి వాళ్లు అనుకొన్న ల‌క్ష్యాన్ని చేరుకొన్నారా? ప్రేక్షకుల్ని భ‌య‌పెట్టగ‌లిగారా? తెలుసుకొందాం.. రండి.

అన‌గ‌న‌గా న‌లుగురు స్నేహితులు. ఒకొక్కరికీ ఒక్కో బ‌ల‌హీన‌త‌. ఒక‌డు బెట్టింగ్ బంగార్రాజు. మ‌రొక‌డికి అమ్మాయిల పిచ్చి. ఇంకొడికి ఏదీ వినిపించ‌దు. ఒక‌డికేమో డ‌బ్బుంద‌నే అహంకారం. వీరితో పాటు ఓ అమ్మాయి. ఈ అయిదుగురూ క‌లిసి ఎంజాయ్ చేయ‌డానికి ఓ ఫారెస్ట్‌లోకి  వెళ్తారు. అక్కడ ఓ అదృశ్య శ‌క్తి… ఒకొక్కరితోనూ ఆడుకొంటుంది. ఈ న‌లుగురికీ – ఆ అదృశ్య శ‌క్తికీ ఉన్న సంబంధం ఏమిటి? చివ‌రికి వీళ్లు ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారా? అస‌లు ఈ క‌థ‌కీ థియేట‌ర్‌లో సినిమా చూస్తున్న ఓ న‌లుగురు వ్యక్తుల‌కూ ఉన్న సంబంధం ఏమిటి? అనేదే ఈ సినిమా క‌థ‌.

సాధార‌ణంగా హార‌ర్ సినిమాల్లో క‌థ అవ‌స‌రం ఉండ‌దు. ఓ చిన్న త్రెడ్ చాలు. కాక‌పోతే ప్రతి నాలుగు స‌న్నివేశాల‌కు ఓ సారి భ‌య‌పెట్టాలి – అనే కొండ గుర్తు పెట్టుకొంటే స‌రిపోతుంది. ఈ సినిమాలోనూ అంతే. క‌థ గురించి పెద్దగా ఆలోచించ‌లేదు. ప్రతి హార‌ర్ సినిమాలోనూ ఉన్న స‌న్నని దార‌పు తీగ లాంటి అంశ‌మే. అందుకే ద‌ర్శకుడు భ‌య‌పెట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ నలుగురి కారు ప్రయాణం, మ‌ధ్యలో వేసిన వెకిలి వేషాలూ బోర్ కొట్టించినా – అడ‌విలో క‌థ మొద‌లైన‌ప్పటి నుంచీ ఈ సినిమాలో హార‌ర్ ల‌క్షణాలు క‌నిపిండం మొద‌ల‌వుతాయి. ఒకొక్కర్నీ ఓ అదృశ్య శ‌క్తి.. అంతం చేయ‌డం థ్రిల్ క‌లిగించేదే. సాంకేతికంగా కెమెరా ప‌నిత‌నం బాగుంది. ప‌రిమిత వ‌న‌రుల‌తో… రిచ్‌నెస్ తీసుకొచ్చాడు. కెమెరా ప్రతిభ‌… మొద‌టి ఛేజ్‌లోనే అర్థమ‌వుతుంది. అడ‌విలో, అర్థరాత్రిని కూడా బాగా క్యాప్చర్ చేయ‌గ‌లిగారు. చిన్నా నేప‌థ్య సంగీతం ప్రాణం పోసింది. పాట‌లు లేక‌పోవ‌డం పెద్ద రిలీఫ్‌. ఐటెమ్ పాట వేసుకోవ‌డానికి ఛాన్స్ ఉన్నా – ద‌ర్శకుడు దానికి ప్రాధాన్యం ఇవ్వక‌పోవ‌డం తెలివైన నిర్ణయం.

ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లే. ధీర‌జ్‌, వ‌రుణ్, శంక‌ర్, శ్వేతా పండిట్ వీళ్లంతా చ‌క్కగా ఇమిడిపోయారు. శ్రీ పాత్ర వేసిన అబ్బాయిలో శ‌ర్వానంద్ పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అలానే న‌టిస్తున్నాడు కూడా. అత‌నికి అవ‌కాశాలు రావ‌చ్చు. వ‌ర్మని ఇమిటేట్ చేసిన బంగార్రాజు ఈ సినిమాకి ఉన్న అతి పెద్ద రిలీఫ్‌.  థ్రిల్లర్ క‌థ‌లో హ్యూమ‌ర్ పండించ‌డానికి ఈ పాత్ర ఉప‌యోగ‌ప‌డింది. సాంకేతిక వ‌ర్గం కూడా కొత్తవాళ్లే. ఈ సినిమాని ఓ ఛాలెంజ్ గా తీసుకొని ప‌నిచేశారంతా. ఈ థ్రిల్లింగ్ క‌థ‌కీ థియేట‌ర్‌కీ.. లింకు ప‌ట్టిన స్ర్కీన్‌ప్లే ప‌నిత‌నం తప్పకుండా  ఆక‌ట్టుకొంటుంది.

అయితే గంట‌లో తీయాల్సిన సినిమా ఇది. రెండు గంట‌లు ఉండాల్సిందే అని ప‌ట్టుబ‌ట్టి అటూ ఇటూ లాగేశారు. దాంతో అడ‌విలో మొద‌లే, అడ‌విలో ముగించాల్సిన సినిమా దారి మ‌ళ్లింది. అమ్మాయివైపు న‌లుగురూ చొంగ కార్చుకొని చూడ‌డం, కెమెరా ఎక్కువ సేపు అమ్మాయి పిక్కల‌పైనే ఫోక‌స్ చేయ‌డం – దిగజారుడుత‌నానికి నిద‌ర్శనం. అంతేకాదు.. చాలా బూతు మాట‌లు వినిపిస్తాయి. ఆ డ‌బుల్ మీనింగ్‌ని అర్థం చేసుకోలేని స్థాయి కాదు తెలుగు ప్రేక్షకుల‌ది. దెయ్యం సినిమాలంటే మ‌న‌కు వ‌ర్మ గుర్తుకొస్తాడు. ఈమ‌ధ్య వ‌ర్మ‌.. రుచీ ప‌చీ లేని హార‌ర్ సినిమాల్ని వ‌దులుతున్నాడు. వాటితో పోలిస్తే… ఇది కొంచెం న‌య‌మే. క‌థ‌నంలో ఇంకాస్త బిగి తెచ్చుకొని ఉంటే బాగుండేది. పైగా ఇలాంటి రివెంజ్ డ్రామాలు బీసీ కాలం నుంచి చూస్తేనే ఉన్నారు. త‌రాలు మారినా, ద‌ర్శకులు మారినా హార‌ర్ సినిమాల‌కు అదే త్రెడ్ ప‌ట్టుకొని తిర‌గ‌డం ఈత‌రం ప్రేక్షకుల‌కు రుచించ‌దు.

మొత్తమ్మీద ఈ సినిమాని ఔత్సాహికులు చేసిన ఓ ప్రయ‌త్నంలానే చూడాలి. ఆ మేర‌కు ఈ టీమ్ అంతా పాస్ అయ్యింది.

ఈ  చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం భావ్యం కాదు. మా సమీక్ష చదవండి, మీరే స్వయంగా సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి..

 

Click here for English Version