రివ్యూ : వకీల్ సాబ్ – పవర్ ఫుల్ లాయర్ సాబ్

చిత్రం : వకీల్‌ సాబ్
నటీనటులు : పవన్‌ కల్యాణ్‌, శృతిహాసన్‌, ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ‌
దర్శకత్వం : శ్రీరామ్ వేణు
సంగీతం : తమన్‌
విడుదల తేది : ఏప్రిల్‌ 09, 2021

తెలుగు మిర్చి రేటింగ్ : 3.5 /5

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. వేణు శ్రీ రామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని దిల్ రాజు – బోనీకపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ రోజు(ఏప్రిల్ 9) వకీల్ సాబ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ కి జంటగా శృతి హాసన్ నటించింది. అంజలి, నివేత థామస్, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. మరి వకీల్ సాబ్ ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకున్నాడో చూద్దాం…

కథ : పల్లవి(నివేధా థామస్), జరీనా బేగం(అంజలి), దివ్య నాయక్‌(అనన్య నాగళ్ళ ) ముగ్గురూ కలిసి ఒక రూమ్ లో అద్దెకు నివసిస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తుంటారు. ఒకరోజు నైట్ పార్టీ కి వెళ్లి క్యాబ్లో ఇంటికి తిరిగి వస్తుండగా క్యాబ్ బ్రేక్ డౌన్ అవుతుంది. అయితే అటుగా వెళ్తున్న పల్లవి ఫ్రెండ్ ఎంపీ కుమారుడు వాళ్ళని ఒక రిసార్ట్ తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ జీవితం మలుపు తిరుగుతుంది. పోలీసులు ఆ ముగ్గురు అమ్మాయిల్ని అరెస్ట్ చేస్తారు. ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో సస్పెండ్‌కు గురైన లాయర్‌ సత్యదేవ్‌ అలియాస్‌ వకీల్‌ సాబ్‌( పవన్‌ కల్యాణ్‌) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్‌ ఎందుకు సస్పెండ్‌ అయ్యాడు? అతని చరిత్ర ఏంటి? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపడుచులకు వకీల్‌ సాబ్‌ ఎలా న్యాయం చేశాడు? రాజకీయ నేపథ్యం ఉన్న ఎంపీ ని , డబ్బులకు అమ్ముడుపోయే లాయర్‌ నందా(ప్రకాశ్‌ రాజ్‌)ని సత్యదేవ్‌ ఎలా ఢీకొన్నాడు? అనేది తెరపై చూడాల్సిందే …

విశ్లేషణ : బాలీవుడ్ మూవీ పింక్ కి రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ పవన్‌కళ్యాణ్‌ ‌ తన ఫ్యాన్స్‌ను ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో డిసప్పాయింట్‌ చేయలేదు. పవన్ కళ్యాణ్ పాత్రని హుందాగా డిజైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయినట్లు చెప్పుకోవచ్చు, ముఖ్యంగా పవన్‌కున్న ఇమేజ్‌ దృష్ట్యా రాజకీయ కోణాన్ని కూడా చేరుస్తూ ఆయన పాత్రను డిజైన్‌ చేశారు. ఆ పాత్రలో పవన్‌ ఒదిగిపోయారు. ఇంటర్వెల్‌ ఫైట్‌… అలాగే సెకండాఫ్‌లో పవన్‌, ప్రకాష్‌రాజ్‌ మధ్య వచ్చే కోర్టు సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త స్లో గా ఉంటుంది, ఇది సినిమాకి చిన్న మైనస్ అని చెప్పొచ్చు.

ప్రధాన పాత్రధారులుగా నటించిన నివేతా థామస్‌, అంజలి, అనన్య వారి వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. ఎమోషన్‌ను క్యారీ చేయడంలో వారు సక్సెస్‌ అయ్యారు. శ్రుతిహాసన్‌ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో ఆమె చక్కగా నటించింది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. పలు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్‌ అదరగొట్టాడు.

ప్లస్‌ పాయింట్స్ :
* పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌రాజ్‌ నటన
* నివేత థామస్, అంజలి, అనన్య నాగళ్ళ అద్భుత నటన
* తమన్‌ సంగీతం
* కోర్టు సీన్స్‌

మైనస్‌ పాయింట్స్
* ఫస్టాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌ బ్యాక్

చివరిగా : సమాజంలో ఆడవారిని తక్కువగా చూసే కేటుగాళ్ళకి బుద్ది చెప్పే పవర్ ఫుల్ లాయర్