నీ ప్రయాణమెటు జేజమ్మా…!

చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. సరైన ప్లానింగ్ కూడా అవసరమే. పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా తనని తాను మలచుకున్నవారే.. ఈ రేసులో దూసుకుపోతారు. ఈ విషయంలో స్వీటీ అనుష్క కొన్ని పొరపాట్లు చేసింది. గ్లామర్, నటన రెండూ సమపాళ్ళలో మేళవించిన ఈ తరం కధానాయికలలో అనుష్క పేరు ముందు వరుసలో ఉంటోంది. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు లేనేలేవు. ఓ భారీ కమర్షియల్ సినిమాలో కదానాయికకు ఎలాంటి లక్షణాలు కావాలో అవన్నీ ఈ బెంగుళూరు భామలో వున్నాయి. అయితే…. కధానాయికగా ఈ రోజు అనుష్క జీరో. ఎందుకంటే… కధానాయికగా స్వీటీ ని ఎంచుకునే పరిస్థితిలో ఇప్పుడు ఒక్క నిర్మాతాలేడు. ‘డమరుకం’, ‘మిర్చి’ సినిమాలు చేసింది కదా అని అడగొచ్చు. కానీ ఆ రెండూ ఇప్పటి సినిమాలు కాదు. ‘రాణీ రుద్రమ్మ’ సినిమా చేజిక్కించుకున్నా అందులో ఆమెది లేడీ హీరో వేషం అన్న సంగతి మర్చిపోకూడదు.

‘అరుంధతి’ సినిమాతో అనుష్క లోని ప్రతిభ లోకానికి తెలిసింది. ఆమెకు పురస్కారాలూ అందాయి. అక్కడివరకు బాగానే వుంది. ఆ సినిమా చాలావరకు స్వీటీ కెరియర్ ని పక్కదోవ పట్టించింది. జేజమ్మ హాంగోవర్ ఆమెను చాలాకాలం వెంటాడింది. ఆ వెంటనే… ‘బిల్లా’ సినిమాలో పరిధికి మించి గ్లామర్ కురిపించింది. ‘వేదం’లో మరో అడుగు ముందుకేసి వేశ్య గా కనిపించింది. ఇవన్నీ తనలోని విభిన్నమైన నటనా కోణాలని బయటపెట్టాయి అని మురిసిపోయింది తప్ప… ఈ పాత్రలే తన కెరియర్ కి ఆటంకం కలిగిస్తాయని అనుకోలేదు. స్వీటీ ని ఎలా చూడాలో, ఆమెకోసం ఎలాంటి పాత్రలు రాసుకోవాలో అటు ప్రేక్షకులకీ, ఇటు దర్శకులకీ అర్ధం కాలేదు. దాంతో అందవలసిన పాత్రలు ఆమెకు అందకుండా పోయాయి. ‘పంచాక్షరి’ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడంతో… నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు చేసే ధైర్యం కూడా చేయలేకపోయింది. అందుకే గత కొంత కాలంగా ఆమె కెరియర్ స్థబ్దుగా వుంది. ‘డమరుకం’, ‘మిర్చి’ సినిమాలు బాగా ఆడి.. ఆ విజయాలతో కధానాయికగా మళ్ళీ బిజీ అవుతుందేమో అనుకుంటే… ఇప్పుడు ‘రాణీ రుద్రమ్మ’ సినిమా పట్టాలెక్కింది.

అయితే కధానాయిక, లేదంటే నాయికా ప్రాధాన్యం వున్నా సినిమాలు… వీటిలో ఎదో ఒకటి తేల్చుకోలేక సతమతమవుతున్న ఈ తరుణంలో కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తడానికి సన్నాహాలు చేస్తోంది. చిత్ర నిర్మాణం… అసలే అతలాకుతలంగా వుంది. హేమా హేమీలే బోల్తా కొడుతున్నారు. ఇలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే భంగపడక తప్పదు. నిర్మాతగా అయినా తన కెరియర్ ని సరిగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అటో కాలు,ఇటో కాలు వేస్తె… మొదటికే మోసం వస్తుంది. జేజమ్మా బీ కేర్ ఫుల్…