“బస్‌ స్టాప్‌”… బూతులు నాన్‌ స్టాప్‌… ?

“ఈ రోజుల్లో” దర్శకుడు మారుతి తీర్చిదిద్దిన ‘ బస్‌ స్టాప్‌ ‘ లోని ఓ సన్నివేశం.
ఒకామె… దోశెలు వేస్తూ ఉంటుంది. అక్కడికి కొంతమంది అమ్మాయిలు వస్తారు. ఈ సందర్భంగా జరిగే సంభాషణ ఇంచుమించుగా, ఓ ఇంచు అటూ ఇటూగా ఇలా ఉంటుంది.
ఆమె : దోశెలు వెయ్యమంటారా?
అమ్మాయిలు : మీ అబ్బాయి వేయడా? మీరే వేస్తారా?
ఆమె : ఇప్పటివరకూ అందరికీ వేసీ వేసీ అలా వెళ్ళాడు. అమ్మాయిలందరికీ వాడే వేయాలా? అయినా ఎంత మందికని వేస్తాడు? ఏం… నాచేత వేయించుకోరా?
అమ్మాయిలు : మీ అబ్బాయి అయితేనే బాగా వేస్తాడాంటీ…
ఇదీ ఆ సన్నివేశంలో సాగిన సంభాషణ. అక్కడ వెతుక్కున్న వారికి వెతుక్కున్నంత బూతు.

ఇంకోచోట ‘ నా సెల్‌ మాంఛి కండీషన్‌ లో ఉంది. నీ చేతుల్లో పెడుతున్నా. ఫుల్లుగా వాడేసుకీ ” అంటాడో అబ్బాయి. ఈ తుంటరి మాటల మధ్య బూతు భీభత్సంగా రాజ్యమేలుతోంది.

ఇవి కేవలం ఒకట్రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలా… బూతుని చూపిస్తూనే టెక్నిక్‌ గా దాన్ని దాటేసే సన్నివేశాల్ని తెలివిగా అల్లుకున్నాడు దర్శకుడు మారుతి. దాంతో వాటిని ఏ సెక్షన్‌ కింద కటింగులని చెప్పాలో సెన్సార్ బోర్డ్‌ కీ అర్థం కావడంలేదు. మొత్తానికి బస్‌ స్టాప్‌ ముచ్చటగా మూడోసారి సెన్సార్ చేయించుకుంది. నిర్మాత-బోర్డ్‌ సభ్యుల మధ్య వాదోపవాదాల నడుమ మొత్తానికి ఎనిమిది కట్స్‌ తో “ఏ” సర్టిఫికెట్‌ తెచ్చుకుందీ చిత్రం. “కేవలం ద్వందార్థాల కోసమే కొన్ని సన్నివేశాలు దర్శకుడు రాసుకున్నాడనిపించింది. సన్నివేశపరంగా బూతు లేకపోవచ్చు కానీ.. సింబాలిక్‌ గా చూస్తే అంతా అదే కనిపిస్తుంద”ని ఓ సెన్సార్ బోర్డ్‌ సభ్యుడు చెప్పుకొచ్చారు.

యువతరాన్ని టార్గెట్‌ చేస్తూ మారుతి తీసిన “ఈ రోజుల్లో” చిత్రం కాసుల వర్షం కురిపించింది. ‘ అమ్మాయిల మనస్తత్వం ఇదీ.. ‘ అంటూ వినోదం మాటున బూతునీ, శృంగారాన్నీ మిళితం చేసి ఆ సినిమా జనం మీదకు వదిలిన మారుతి… ఇప్పుడు ఇదే టెక్నిక్‌ తో ‘ బస్‌ స్టాప్‌ ‘ సినిమానీ తీర్చిదిద్దిన విషయం సుస్పష్టం. కథని కాకుండా యువతరం బలహీనతని క్యాష చేసుకుందామనే ఎత్తుగడ అన్నిసార్లూ మంచి ఫలితాన్ని తీసుకురాదనే విషయం మారుతి గుర్తుపెట్టుకుంటే మంచిది. చిన్న సినిమా అంటే బూతు సినిమానే అని అనుకుంటున్న ఈ తరుణంలో… ఈ తరహా ప్రయత్నాలు చిన్న చూపు కలిగించేలా చేస్తాయి. సెన్సార్ అవాంతరాలు దాటుకుంటూ వస్తున్న ఈ సినిమాలో ఇంకెన్ని బూతులు మిగిలిపోయాయో..?!