” తెగేదాకా లాగొద్దు…బీ కూల్….! “

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవటం అంటే ఇదేనేమో….’ దేనికైనా రెడీ ‘ సినిమా వివాదం విషయంలో ఈ సామెత నూటికి నూరు పాళ్ళు సరిపోతుంది. వివాదం మొదలైన తొలిరోజునే మోహన్ బాబు ‘ సారీ ‘ అనే రెండక్షరాలు అనేసి ‘ రండి…కూర్చుని మాట్లాడుకుందాం ‘ అని వుంటే సమస్య ఇక్కడిదాకా వచ్చి వుండేది కాదేమో అన్నది పరిశ్రమలోనూ, బయట కూడా చాలామంది నుంచి విన్పిస్తున్న అభిప్రాయం.

చూస్తుండగానే వివాదం పెద్దదయిపోయింది.. ఆశీర్వదించవలసిన బ్రాహ్మణులు ఆగ్రహించారు.. వివాదం ఉద్యమం గా మారింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధో సంఘాలు జత కలిసాయి. ఇక్కడ తప్పు ఎవరిదీ, ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలి అన్నది ఈ దశలో అప్రస్తుతం. క్షమాపణ అన్నది ఏదో నేరాన్ని అంగీకరించటం కాదు…సమస్యను శాంతియుతంగా చల్లబరచటం…..సమూహం ఒక మెట్టు దిగటం కష్టం గాని వ్యక్తి దిగటం కష్టం కాదు… ఇక్కడ వ్యక్తిత్వాలు… ఇగోలు కొద్దిసేపు పక్కన పెట్టగలిగితే సమస్య పరిష్కారం సులభ సాధ్యం… ఇలాంటి సందర్భాలలో రెండు పక్కలా రెచ్చగొట్టేవాళ్ళు సహజంగానే వుంటారు. మోహన్ బాబు ముందు ముఖ ప్రీతి కోసం మాట్లాడి, పక్కకొచ్చి ‘ ఆయన అంతే… ఎవరిమాటా వినడు.” అనే వాళ్ళు చాలామంది వుంటారు. ‘ దేనికైనా రెడీ ‘ సినిమా విడుదలకు ముందు అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ‘ ఈ సినిమా హిట్ అవ్వాలి… మోహన్ బాబు కుటుంబానికి హిట్ రావాలి ‘ అంటూ అన్నిటికి అతీతంగా అందరూ కోరుకున్నారు. రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాత మోహన్ బాబు ఆనందంగా వుంటే మరిన్ని సినిమాలు తీస్తారు అన్న ఆశే ఇందుక్కారణం.

‘ బ్రాహ్మణులను అవమానిస్తాడు ‘ అనే ట్రాక్ రికార్డు గాని, ఈ స్థాయిలో వివాదాలు రేగటం గానీ ఇంతవరకు మోహన్ బాబు కు లేదు…. అలాగే ఈ స్థాయిలో రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన ట్రాక్ రికార్డు బ్రాహ్మణులకు కూడా లేదు…’ దేనికైనా రెడీ ‘ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణలు, పాత్రల చిత్రీకరణ ఉందంటూ ప్రభుత్వ కమిటి కూడా నిర్ధారించింది. ఈ దశలో నైనా మోహన్ బాబు హుందాగా ముందుకు వచ్చి కొన్ని షాట్స్ అయినా కట్ చేసేందుకు సిద్ధపడి వుంటే బావుండేది. అలా కాకుండా ఆయన హైకోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో సమస్య పరిష్కారానికి మోహన్ బాబు సిద్ధంగా లేరన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. పోనీ ప్రభుత్వ కమిటిలో అందరూ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులే వున్నారా అంటే అదీ కాదు… అధికారులు, పరిశ్రమ పెద్దలు కూడా వున్నారు. కట్ చేయాల్సిన అంశాలు ఉన్నాయనేది అందరి అభిప్రాయం… కనీసం ఆ అభిప్రాయానికైనా మోహన్ బాబు గౌరవం ఇచ్చివుంటే హుందాగా ఉండేదని సర్వత్రా వినిపిస్తున్న వ్యాఖ్య…. మోహన్ బాబు జీవితంలో ఎన్నో విజయాలను సాధించిన మనిషి… ఎన్నో ఒడిదుడుకులు చవిచూసిన జీవితం… కాని విష్ణు, మనోజ్ లు ఎంతో భవిష్యత్తు వున్న హీరోలు… అందరి ఆశీస్సులు, పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్లకు కావాలి… ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరూ ఇంకా విజయాలు దక్కాల్సిన అవసరంలో వున్న హీరోలు…. ఇంత చిన్న వయసులో వాళ్ళు వివాదాస్పదులు కాకూడదు. ఇది మోహన్ బాబు కు కూడా తెలుసు… కాని ‘ సారీ ‘ అనే చిన్న మాట చెప్పేందుకు ఆయన అహం, వ్యక్తిత్వం అంగీకరించటం లేదు. సమస్య ఇక్కడే బిగుసుకుపోయింది.

వాస్తవానికి సినిమా పరిశ్రమలో కుల పక్షపాతం భయంకరంగా ఏమీ లేదు… తన కులం వారిని ప్రోత్సహించుకునే లక్షణం వుంది గాని, ఎదుటి కులాన్ని తొక్కివేయాలనే ఆలోచన ఇక్కడ తక్కువే…. మోహన్ బాబు ముందు ఎన్నో ప్రాజెక్టులు వున్నాయి… నిజమో అబద్ధమో తెలియదు గాని, ఆయన ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వార్తలూ వున్నాయి… ఈ దశలో ఆయన వరుస విజయాలతో మరింత వేగంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం వుంది. అది తన బిడ్డలకు కూడా అవసరం…

అలాగే బ్రాహ్మణ సంఘాలు కూడా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించటం అవసరం… తమ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బహిరంగంగా వ్యక్తం చేయటం తప్పు కాదు… అది ప్రజాస్వామిక హక్కు కూడా… ‘ దేనికైనా రెడీ ‘ సినిమా విషయంలో ఆ మేరకు బ్రాహ్మణులు సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ కమిటి నివేదిక కారణంగా బ్రాహ్మణుల వాదనలో, ఆవేదనలో అర్ధం ఉందన్నది నిర్ధారింపబడింది. కాని ఉద్యమ నాయకత్వం మరింత సమన్వయంతో, సంయమనం తో వ్యవహరించాల్సివుంది. ఉద్యమం చేస్తున్న వివిధ ప్రాంతాల సంఘాలన్నీ ఒకటిగా ఏర్పడితే సంప్రదింపులకు గానీ , సమస్య పరిష్కారానికి గానీ మార్గం సుగమం అవుతుంది. ఏ వివాదానికైనా ఎక్కడో ఒక చోట ముగింపు అవసరం. లాగుతున్న కొద్దీ సాగుతూ పోయే సమస్య ఇది. ఒక్కో రోజు ఒక్కొక్క బ్రాహ్మణ ప్రముఖుడు రంగప్రవేశం చేసి సమస్యను పెద్దది చేయకూడదు. సున్నిత పరిష్కారం ఇలాంటప్పుడు చాలా అవసరం అన్నది రెండు పక్కల వారూ గుర్తించాలి. ఈ నేపధ్యంలో మీడియా కూడా నిర్మాణాత్మకంగా మెలగటం అవసరం అన్నది ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. లైవ్ షో లు, చర్చావేదికలు, ఇంటర్వ్యూ లకు రెండు పక్కలనుంచి బాధ్యత గల వ్యక్తులనే పిలవాలి. ‘ మైకాసురులు ‘, కెమెరాలను చూస్తే రెచ్చిపోయే పబ్లిసిటి పిచ్చగాళ్ళు సమస్యను పెద్దది చేస్తారు గాని పరిష్కారమార్గం చూపలేరు. పరిశ్రమలో కూడా ఇలాంటి సందర్భాలలో ప్రతిస్పందించి సమస్యను ఉభయతారకంగా పరిష్కరించేందుకు గానూ ఒక యంత్రాంగం ఏర్పడాలి.. ఈ సమస్య ఇవాళ మోహన్ బాబుది,  బ్రాహ్మణులది కావచ్చు..  రేపు మరో నిర్మాతకు, మరో కులానికి ఇలాంటి వివాదం చెలరేగినపుడు ఇంత ఉధృతం కాకుండా ఆదిలోనే పరిష్కరించేలా పరిశ్రమ పెద్దలు ఒక మార్గాన్ని చూడాలి.

ఈ సమస్య ఇంత ఉధృతం కావటానికి ప్రధాన కారణం సెన్సార్ బోర్డు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న అభిప్రాయం…. సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా స్పందించ గలిగే సెన్సార్ వున్నప్పుడు, అది మరింత బాధ్యతగా వ్యవహరించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. సెన్సార్ బోర్డులో సమస్య వచ్చినప్పుడు ” మనకు ఆర్.సి.వుంది కదా ” అన్న భరోసా ను అనవసరంగా రివైజింగ్ కమిటి
కల్పించకూడదు. అసలు సెన్సార్ బోర్డు వున్నప్పుడు ఆర్.సి. ఎందుకు అనే వాదన కూడా లేకపోలేదు… అంటే ఆర్.సి. లో వున్నవాళ్ళు సెన్సార్ బోర్డులో ఉన్నవాళ్ళకంటే తెలివిగల వాళ్లనా….? లేకపోతే ఈ మధ్యన ఒక సినిమాకు సెన్సార్ 50 కట్లు ఇస్తే, ఆర్.సి. కేవలం 8 కట్లు ఇవ్వటం ఏమిటి ? అందరూ సమానార్హత వున్నసభ్యులేగా ? సెన్సార్ సభ్యులకు కనిపించిన అభ్యంతరాలు ఆర్.సి. సభ్యులకు కనిపించవా ? ఒకవేళ ఆర్.సి.లో కూడా అభ్యంతరాలు చెబితే రెండవ ఆర్.సి. కి కూడా అవకాశం ఉందిట…

ఎన్ని కమిటీలు వున్నా ఎక్కడ ఏ ఆబ్లిగేషన్లు పనిచేసినా మౌలికంగా సినిమాను నిర్మించేటప్పుడు మేకర్స్ కు బాధ్యత వుండాలి… చూసే విశాల దృక్పధం వుండాలి… సమస్య మొలకెత్తినపుడు సామరస్యంగా పరిష్కరించుకోగలిగే సమర్ధత రెండు పక్కలా వుండాలి… అప్పుడే అందరూ బావుంటారు… సినిమా బావుంటుంది…. సినిమా బావుంటే లక్షల మంది బావుంటారు… ఈ దిశగా అందరూ ఆలోచిస్తే ఎంత బావుణ్ణు ….!!