హీరోలూ నోరు విప్పండి!

చిత్రసీమలో ఇప్పుడో విచిత్ర పరిస్థితి. ఏ హీరో చేతిలో ఎన్ని సినిమాలు వున్నాయో.. ఏ కధానాయిక ఎవరితో జతకడుతుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ‘ఫలానా కాంబినేషన్ మొదలయిపోతుంది’ అనే ఊహాగానాలు, గాలి వార్తలు తప్పితే… ఆ వార్త నిజమైన దాఖలాలు తక్కువ. ఏ సినిమా సెట్స్ పై వుందో.. ఏ సినిమా ఆగిపోయిందో… ఆ హీరోల అభిమానులు కూడా తేల్చుకోలేకపోతున్నారు. వీటివల్ల పైకి కనిపించే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. కానీ… ఆ సినిమా కోసం ఎదురు చూసే… పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం గందరగోళ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్…. ఈ అగ్ర హీరోలు తమ కెరియర్ ని ఒక ప్రణాళికా బద్ధంగా నడిపారు. ఏడాదికి ఒక సినిమా చేసినా, నాలుగైదు సినిమాలతో బిజీగా వున్నా…. ఆయా సినిమాల కబుర్లు అభిమానులకు తెలిసేవి. ఎప్పుడు ఏ సినిమా విడుదల అవుతుందో ఓ అంచనా వుండేది. గుట్టు చప్పుడు కాకుండా సినిమా మొదలుపెట్టడం, మొదలు పెట్టిన సినిమాని చెప్పాపెట్టకుండా ఆపేయడం ఈ హీరోల విషయంలో ఎప్పుడు జరగలేదు. తరవాత వచ్చిన తరం…. సినిమాల ఎంపికలో మరీ ఆచి తూచి వ్యవహరించడం మొదలుపెట్టింది.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అయితే మరీను. రెండేళ్లకు ఒక సినిమా చేసిన దాఖలాలు కూడా వున్నాయి. “పరిశ్రమ బతకాలంటే, నవతరం హీరోలు వేగం పెంచాల్సిందే” అని దాసరి నారాయణ రావు లాంటి పరిశ్రమ పెద్దలు మొత్తుకుంటే…. ఇప్పటికి గేరు మార్చారు.

అల్లు అర్జున్, రాం చరణ్, జూనియర్‌  ఎన్‌ టీ ఆర్‌, ప్రభాస్‌… లాంటి యువతరం హీరోల చేతుల్లో ఇప్పుడు కావలసినన్ని సినిమాలున్నాయి. ఇది సంతోషించదగిన విషయమే. కాకపొతే… ప్రతీ సినిమా ఎదో ఒక విషయంలో గందరగోళాన్ని ఎదుర్కుంటోంది.

‘పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో ఒక సినిమా వస్తోంది’ అనే వార్త గత రెండు మూడు నెలలుగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమా గురించి అటు పవన్ గానీ, ఇటు త్రివిక్రమ్ గానీ… లేదంటే ఆ సినిమా నిర్మాతగానీ ఒక స్పష్టమైన ప్రకటన ఇప్పటివరకూ చేయలేదు.

బాలకృష్ణ విషయంలోనూ అంతే. ‘శ్రీమన్నారాయణ’ తరవాత బాలయ్య సినిమా గురించి గాలి వార్తలు తప్పితే… సరైన సమాచారం లేదు. జీవీ, శ్రీవాస్, బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాస రావు, బి.గోపాల్…. ఇలా దాదాపు పది మంది దర్శకుల పేర్లు వినిపించాయి. బాలయ్యే దర్శకత్వం వహిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే… ఇవన్నీ వాళ్ళు, వీళ్ళు చెప్పుకోవడం వరకే. బాలకృష్ణ స్వయంగా నోరు విప్పే వరకు…. ఈ గాలి వీస్తూనే వుంటుంది.

చాలా సినిమాలు మాటల వరకు వచ్చి ఆగిపోవడం మామూలే. కానీ … చేస్తున్న సినిమాలపై సరైన సమాచారం అభిమానులకు, పరిశ్రమకూ అందించవలసిన బాధ్యత నవతరం హీరోలపై వుంది. పూర్తయిన సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం కూడా హీరోలు చెప్పలేక పోతున్నారు. పైగా రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో…”, ‘నాయక్’, ‘బాద్ షా’, ‘షాడో’, ‘ఒంగోలు గిత్త’…. ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో… ఆయా నిర్మాతలు కుడా స్పష్టంగా చెప్పడం లేదు. దాంతో… మీడియాలో రోజుకో డేట్.. వినవస్తోంది. ఏది నిజమో తెలుసుకోలేక అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ గాలివార్తలకు తెరపడాలంటే హీరోలు నోరు విప్పాల్సిందే!