తెలుగు హీరోయిన్ల “కోట్లా”ట…!

‘సినిమా బడ్జెట్ పెరిగిపోయింది బాబోయ్’ అని ఓవైపు నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ‘మా పారితోషికాలు ఇంకా పెంచాల్సిందే’ అని మరోవైపు తారలంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం సినిమా బడ్జెట్ లో దాదాపు 75% పారితోషికాలకే సరిపోతుంది అనేది కాదనలేని వాస్తవం. హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు, మిగిలిన సాంకేతిక విభాగానికీ… పారితోషికాల పేరుతో కోట్లు కుమ్మరించి…ఆ తరవాత మిగిలిన దాంతో సినిమా తీస్తున్నారు. పేరున్న ఏ హీరో కూడా రూ.4 నుంచి 9 కోట్లకు తగ్గడం లేదు. రాజమౌళి, పూరి జగన్నాథ్, వినాయక్, శ్రీనువైట్ల మొదలైన దర్శకులంతా కోట్లకు పడగలెత్తినవారే.

ఇప్పుడు కథానాయికల వంతొచ్చింది. ఒక్క విజయం చేతికి చిక్కగానే హఠాత్తుగా వారి కాల్షీట్లకూ రెక్కలొచ్చేస్తున్నాయి. అందుకే మన కథానాయికలూ… కోట్లాట ఆడుతున్నారు.నయనతార, అనుష్కలు ‘కోటి’ తీసుకొంటున్నారంటే…’అమ్మో’ అనుకొన్నాం. ‘అంతెందుకు ఉంటుందిలెండీ? ! అంతా ఉత్తుత్తినే’ అనిపించింది. కానీ ఇప్పుడు స్టార్ హోదా తెచ్చుకొన్న కథానాయికలెవ్వరూ కోటికి తగ్గడం లేదు. ఇలియానా, సమంత, తమన్నా వీరంతా కో…కో..కోటి కథానాయికలే. అసలింతకీ తెలుగులో ఎక్కువ పారితోషికం తీసుకొంటున్న కథానాయిక ఎవరు? ఆ తరవాత స్థానాల్లో ఎవరున్నారు? అనే విషయాలపై ఓ ఫోకస్

సినిమాలున్నా, లేకున్నా…అందులో విజయాల శాతం మాటెలా ఉన్నా కథానాయికల్లో అనుష్క అగ్రస్థానాన్ని కాపాడుకొంటూ వస్తోంది. ‘డమరుకం’ సినిమా కోసం స్వీటీకి రూ. 1 కోటీ 25 లక్షలు ఇచ్చినట్టు ఓ అంచనా. ఇంచుమించుగా ‘మిర్చి’కీ అంతే తీసుకొంది. ‘రాణీ రుద్రమ్మ’కు మాత్రం ఈ లెక్కల్లో తేడాలొచ్చాయి. ఈ సినిమా కోసం రూ. 1 కోటీ 60 లక్షలు పారితోషికం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ లెక్కన అత్యధిక పారితోషికం అందుకొంటున్నది జేజెమ్మే. ఆ తరవాతి స్థానం కోసం తమన్నా, సమంత, కాజల్ పోటీ పడుతున్నారు. సమంత వరుస విజయాలతో బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె కాల్షీట్లు హాట్ కేకులు. ఈ నేపథ్యంలో పారితోషికాన్నీ అమాంతం పెంచేసింది. ‘దూకుడు’కి రూ. 80 లక్షలు అందుకొన్న సమంత…ఆ సినిమా విజయంతో కోటికి చేరుకొంది. కాజల్ కూడా దూసుకొస్తోంది. ‘బృందావనం’ సినిమాకే ఆమె కోటి మార్కు దాటింది. ‘తుపాకి’ సినిమాకీ పదో ఇరవై లకారాలు ఎక్కువే అందుకొన్నట్టు తెలిసింది. ఇప్పుడు సుకుమార్ – మహేష్ బాబు చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాకి రూ. కోటి పది లక్షల పారితోషికం అడిగిందట. తమన్నా కూడా కోటి కథానాయికే. ‘రెబల్’, గంగతో రాంబాబు’ సినిమాల పరాజయాలతో ఆమె పారితోషికం విషయంలో కాస్త పట్టు సడలించింది. లేదంటే…అనుష్కను దాటిపోయేది. వీళ్లకంటే సీనియర్ అయిన త్రిష కోటికి చేరుకోలేక పోయింది. ఆమె ఇప్పటి వరకూ తీసుకొన్న అత్యధిక పారితోషికం రూ. ౮౦ లక్షలు. ఇలియానా ఎప్పుడో కోటి దాటేసింది. ‘బర్ఫీ’ సినిమా తరవాత ఆమెను సంప్రదిస్తే రూ. కోటీ ఇరవై లక్షలు అడిగినట్టు సమాచారం. శృతిహాసన్, తాప్సి రూ. 60 నుంచి 80 లక్షలు అందుకొంటున్నారు. అయితే ఇవన్నీ పారితోషికాలే. ఇవి కాకుండా అదనపు సౌకర్యాలు కూడా కల్పించాలి. అడిగిన హోటల్ లో బస చూపించాలి.ప్రతి కథానాయికకూ ఇద్దరు ముగ్గురు సహాయకులు ఉంటారు. వారికి కూడా జీతం, బేటా ముట్టజెప్పాలి.

కథానాయికల విజయాలే పారితోషికానికి ప్రాతిపదిక. హిట్ అందుకొంటే వెంటనే కాల్షీట్ల ధరల్లో మార్పులు కనిపిస్తుంటాయి. “చిత్ర పరిశ్రమలో కథానాయికల కొరత ఉంది. అందుకే ఉన్నవారితోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. వాళ్లు అడిగింది ఇవ్వాల్సిన పరిస్థితి. కథానాయికలు కూడా ఒక సినిమాకి కోటి రూపాయలు తీసుకొంటే ఎలా? అందుకే ముంబై నుంచి, ఇతర రాష్ర్టాల నుంచీ కొత్తమ్మాయిలను దిగుమతి చేసుకొంటున్నాం. వాళ్లూ ఒకట్రెండు సినిమాల వరకే. ఒక సినిమా హిట్ అయితే…పారితోషికం పెంచేస్తారు” అని ఓ ప్రముఖ తెలుగు నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.