సంక్రాంతికైనా మన స్టార్లు కరుణిస్తారా?

ప్రతి శుక్రవారం ఒకటీ, రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడం మామూలే. అయితే… సినిమాలకూ కొన్ని సీజన్లు వుంటాయి. వేసవి, దసరా, దీపావళి, సంక్రాంతి… ఇలాంటి సీజన్ లపై నిర్మాతలు ఎన్నో ఆశలు పెంచుకుంటారు. సినిమా చూసేది యువతరమే అయినా…. కుటుంబ సమేతంగా థియేటర్ లకు తరలి రావాలంటే… సెలవు రోజు కావాలి. సెలవులన్నీ గుంపుగా వచ్చే సీజన్లను నిర్మాతలు టార్గెట్ చేస్తారు. తమ సినిమాలను ఆ సీజన్ లో విడుదల చేయాలని భావిస్తారు. అందుకే.. వేసవి, సంక్రాంతి సీజన్ లో కొత్త సినిమాలు ఎక్కువగా విడుదలవుతుంటాయి. అయితే ఈ సారి సినీ ప్రేమికులను… మన స్టార్లు కరుణించలేదు.

చాలా సినిమాలు వచ్చేస్తాయి అనుకున్న దసరా సీజన్ చప్పగా సాగింది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘దేనికైనా రెడీ’ సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు వినోదం కంటే వివాదాన్నే ఎక్కువ పంచిపెట్టాయి.

ఇక దీపావళికీ సగటు సినీ అభిమానిని పరిశ్రమ సంతృప్తి పరచలేదు. ‘బస్ స్టాప్’ ఒక్కటే విడుదలయ్యింది. అదిగో… ఇదిగో… అన్న ‘డమరుకం’ నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడుతూ వస్తోంది. డమరుకం వచేస్తుంది అనుకోని … ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వెనక్కి వెళ్ళింది. మొత్తానికి ఈ రెండు పెద్ద సినిమాలూ… రాలేదు. ‘తుపాకీ’ అనే డబ్బింగ్ బొమ్మ మాత్రం పండక్కి వచ్చింది. ‘బస్ స్టాప్’ పెద్దలకు మాత్రమె పరిమితమైన సినిమా. దాంతో… మనదైన వెలుగులు ఈ దీపావళి పంచలేకపోయింది.

ఇక అందరి దృష్టీ.. సంక్రాంతి పై పడింది. సంక్రాంతి తెలుగు సీమకు బాగా కలిసొచ్చిన సీజన్. ఈ పండక్కి సినిమా తీసుకొస్తే… సినిమా ఎలాగున్నా డబ్బులు చేసుకోవడం ఖాయం. ఈ నమ్మకంతో… పండక్కి భారీ స్థాయిలో సినిమాలను విడుదల చేస్తుంటారు. ఒకే రోజు నాలుగు సినిమాలు కుడా విడుదలైన దాఖలాలు వున్నాయి. అయితే… ఈ సంక్రాంతికి ఆ శోభ ఉంటుందా అనేది అనుమానమే. పండక్కి రావాల్సిన ‘బాద్ షా’ ముందే వెనక్కి వెళ్ళింది. ‘షాడో’ కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఎటు చూసినా ‘నాయక్’ సినిమా ఒక్కటే… కనిపిస్తోంది. ఈ సినిమాని జనవరి 9న తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు ప్రభాస్ ‘మిర్చి’… నాయక్ తో పోటీ పడడానికి రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలు మినహాయిస్తే… పండక్కి మరో సినిమా వచ్చే సూచనలు కనిపించడం లేదు. కళ్యాణ్ రామ్ తన ‘ఓం’ చిత్రాన్ని సంక్రాంతి కి తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే.. అధికారిక సమాచారం లేదు.

ఈ ముగ్గుల పండగ రామ్ చరణ్, ప్రభాస్ ల మద్య పోటీగా మారే అవకాశాలు వున్నాయి. మద్యలో మరో సినిమా వచ్చినా రావచ్చు. డిసెంబర్ నెలాఖరు వరకూ పండక్కి ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేని పరిస్థితి. మన హీరోలు కరుణించి తమ సినిమాలు విడుదల చేస్తేనే…ఈ పండగ పరిపూర్ణం అవుతుంది. లేదంటే… కోడి పందాలతో సరిపెట్టుకోవడమే.