
NBK 112: నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 112’. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. యువసుధ ఆర్ట్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ను మే 2026లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌ను జూన్ చివరి వారంలో గానీ, లేదా ఆగస్టు నెలలో స్టార్ట్ చేయాలని ముందుగా మేకర్స్ అనుకున్నారట. అయితే సినిమాలో నటించనున్న కాస్ట్ అండ్ క్రూ ఎంపిక ఇంకా ఫైనలైజ్ కాకపోవడంతో చిత్ర యూనిట్ షూటింగ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్ టీమ్‌ను ఫైనల్ చేసే పనిలో దర్శకుడు కొరటాల శివ బిజీగా ఉన్నారని చెబుతున్నారు.
ఈ చిత్రానికి సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. కొరటాల శివ మార్కు సామాజిక సందేశంతో పాటు బాలయ్య బాబు రేంజ్ పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తుంది. “అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కీ రోల్‌లో కనిపించనున్నారని సమాచారం. ఇదే నిజం అయితే ఈ సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఈ లోపు ‘NBK 112’ టీమ్ ప్రీ-ప్రొడక్షన్ పనులన్నింటినీ చక్కబెట్టనుంది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.









