Actor Akhil Raj: ‘అమ్మను తిడితే ఏ కొడుకైనా ఊరుకుంటాడా?’ డెలివరీ బాయ్ వివాదంపై నోరు విప్పిన హీరో అఖిల్ రాజ్..

Akhil Raj

Actor Akhil Raj: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో సినీ ప్రేమికుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి. తాజాగా ఆయనకు ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు, సినీ వర్గాల నుంచి రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకూ హీరో అఖిల్ రాజ్ దీనిపై స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఆయన ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. తప్పుడు అడ్రస్‌కు ఫుడ్ తీసుకురావడమే కాకుండా, తన తల్లిని, కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినందుకే తాను అతడిని మందలించాల్సి వచ్చిందని వెల్లడించారు.

వైరల్ వీడియో వివాదంపై అఖిల్ రాజ్ స్పందిస్తూ.. “ఆ రోజు మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఒక ఫుడ్ పార్శిల్ మా ఇంటికి వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని, ఇంట్లో ఎవరు ఆర్డర్ పెట్టారని కనుక్కునే లోపు డెలివరీ బాయ్ మళ్లీ వచ్చాడు. ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలియడంతో అమ్మ ఆ పార్శిల్ పక్కన పెట్టింది. అయితే ఆ డెలివరీ బాయ్ పూర్తిగా తాగిన మత్తులో ఉన్నాడు. ‘ఫ్రీగా వస్తే ఫుడ్ తీసేసుకుంటారా’ అంటూ మా అమ్మను ఘోరంగా దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా మా అమ్మ మీదకు, కుటుంబ సభ్యుల మీదకు గొడవకు వచ్చాడు” అని పేర్కొన్నారు. “ఆ సమయంలో ఒక కొడుకుగా నా కుటుంబానికి రక్షణగా నిలబడటం నా బాధ్యత. అందుకే అతడిని పద్ధతిగా మాట్లాడమని గట్టిగా మందలించాను. కానీ ఆ డెలివరీ బాయ్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నాతో జరిగిన గొడవను వీడియో తీసి.. దీన్ని సోషల్ మీడియాలో పెట్టి నిన్ను బద్నాం చేస్తానంటూ బెదిరించాడు. అసలు నిజం ఏంటో తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా మీ కుటుంబ సభ్యులకు, మీ అమ్మకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు ఊరుకుంటారా?” అని అఖిల్ రాజ్ ప్రశ్నించారు.

Also Read :  OG Universe: 70 శాతం పూర్తయిన 'ఓజీ' ప్రీక్వెల్ స్క్రిప్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

తాను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని ఈ సందర్భంగా హీరో గుర్తు చేసుకున్నారు. “నేను కూడా ఒకప్పుడు ఇలాంటి డెలివరీ బాయ్ పనులు చేసినవాడినే. కష్టం విలువ, ఎదుటివారి ఆత్మగౌరవం నాకు బాగా తెలుసు. నా సినిమాలో కూడా మేము సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చెప్పాం. అలాంటి నేను అకారణంగా ఒక డెలివరీ బాయ్‌తో ఎందుకు గొడవ పెట్టుకుంటాను? అతనితో గొడవ పడితే నాకేం వస్తుంది? అయితే ఒక హీరోగా నేను ఇంకాస్త సంయమనం పాటించి, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. కానీ కళ్లెదుటే అమ్మను తిడుతుంటే ఆ కోపం ఆపుకోలేకపోయాను. నన్ను విమర్శిస్తున్న సోషల్ మీడియా మిత్రుల కోసమే ఈ వివరణ ఇస్తున్నాను” అని అఖిల్ రాజ్ ఆ వీడియోలో స్పష్టం చేశారు.