
Karthikeya 3: టాలీవుడ్లో మిస్టరీ అడ్వెంచర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘కార్తికేయ’ ఫ్రాంచైజీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ చిత్రాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం నమోదు చేయడంతో, మూడో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘కార్తికేయ 3’ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని గత భాగాల కంటే మరింత భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులను కూడా కీలక పాత్రల కోసం ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
దర్శకుడు చందూ మొండేటి ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ‘కార్తికేయ 2’కు వచ్చిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, మూడో భాగాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కించాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే చందూ మొండేటి లైనప్‌లో ‘కార్తికేయ 3’తో పాటు ఓ కంప్లీట్ యానిమేషన్ మూవీ కూడా ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. విభిన్న కాన్సెప్ట్‌తో ఆ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలోనే వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.














