
Star Kids: సినిమా రంగంలో వారసత్వం అనేది కేవలం హీరోలుగా, హీరోయిన్లుగా తెరపైకి రావడానికే పరిమితం కావడం లేదు. సినీ కుటుంబాలకు చెందిన పలువురు వారసులు తెరవెనుక విభాగాల్లోకి అడుగుపెట్టి తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల కుమార్తెలు నిర్మాణం, కాస్ట్యూమ్ డిజైనింగ్, క్రియేటివ్ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు చేపడుతూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా పనిచేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. తండ్రి సినిమాల్లో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు, స్వతంత్రంగా కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ సినిమాల నిర్మాణ వ్యవహారాల్లో ఆయన కుమార్తె తేజస్విని కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తండ్రి సినిమా ప్రాజెక్టుల్లో నిర్మాణ పరమైన అంశాలను పర్యవేక్షిస్తూ తెరవెనుక తనదైన పాత్ర పోషిస్తున్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కుటుంబంలోనూ ఆయన కుమార్తెలు ఐశ్వర్య రజినీకాంత్, సౌందర్య రజినీకాంత్ వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. దర్శకత్వం, నిర్మాణం, క్రియేటివ్ విభాగాల్లో పనిచేస్తూ తండ్రి స్టార్‌డమ్‌కు భిన్నంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే మెగా కుటుంబం నుంచి నిహారిక కొణిదెల కూడా నటనతో పాటు నిర్మాణ రంగంలో అడుగులు వేసి పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. కొత్త కథలు, యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మాస్ మహారాజా రవితేజ కుమార్తె మోక్షద కూడా చేరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘ఇరుముడి’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఆమె వ్యవహరించినట్లు సమాచారం. దీంతో రవితేజ సినిమాల వెనుక మోక్షద కూడా కీలకంగా మారుతున్నారనే చర్చ మొదలైంది. తెరపై తండ్రుల స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూనే.. తెరవెనుక కూతుళ్లు తమ సత్తా చాటుతుండటం టాలీవుడ్, కోలీవుడ్‌లో కొత్త తరహా వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు.













