
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్‌లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేరబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో రష్మిక ప్రధాన పాత్రలో నటించనున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఎంఎస్ సుబ్బులక్ష్మి బాల్యం నుంచి సంగీత ప్రపంచంలో ఆమె ఎదిగిన తీరు, శాస్త్రీయ సంగీతానికి అందించిన సేవలు, దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆమె సంపాదించుకున్న గుర్తింపును ఈ సినిమాలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
ఇక సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మికకు లుక్ టెస్ట్ కూడా చేసినట్లు చెబుతున్నారు. ఈ పాత్రలో నటించాలంటే కేవలం రూపురేఖలను పోలి ఉండటం మాత్రమే కాకుండా.. సుబ్బులక్ష్మి హావభావాలు, వ్యక్తిత్వం, హుందాతనం, సంగీతంపై ఆమెకున్న అంకితభావాన్ని కూడా వెండి తెరపై చూపించాల్సి ఉంటుంది. దీంతో ఈ పాత్ర రష్మిక కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడుకున్న పాత్రల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ బయోపిక్‌లో మొదట సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత మలయాళ నటి రుక్మిణి వసంత్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా రష్మికను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. సెప్టెంబర్ 16న ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
నిర్మాణ సంస్థ విషయంలోనూ ప్రస్తుతం భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ పేర్లు కొన్ని వినిపిస్తుండగా.. మరికొన్ని కథనాలు బన్నీ వాస్ నిర్మాణంలోనే ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు పేర్కొంటున్నాయి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే నిర్మాతలు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా భారతీయ సంగీత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక ఎలా కనిపించబోతున్నారు? గౌతమ్ తిన్ననూరి ఈ సంగీత దిగ్గజం కథను ఏ స్థాయిలో తెరకెక్కించనున్నారు? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.














