
Mani Ratnam: సినీ దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టీజర్ వీడియోతో పాటు ఓ పోస్టర్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. ఇందులో ప్రధాన నటీనటుల కళ్ల క్లోజప్ షాట్లతో పాటు మూవీ క్రెడిట్స్‌ను చూపిస్తూ.. సెప్టెంబర్ 7న సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘చెక్క చీవంత వానం’ తర్వాత విజయ్ సేతుపతి మరోసారి మణిరత్నంతో కలిసి పనిచేస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు సాయి పల్లవికి మణిరత్నం దర్శకత్వంలో ఇదే తొలి సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.
ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం సినిమాలకు రెహమాన్ అందించే సంగీతం ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో.. ఈసారి కూడా సంగీత అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే మొదలైంది. కోల్‌కతాతో పాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అవిక్ ముఖోపాధ్యాయ్ ఈ ప్రాజెక్ట్‌కు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.














