
Samantha: సమాజంలో వేళ్లూనుకుపోయిన ద్వంద్వ నీతిపై ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు విరుచుకుపడ్డారు. మహిళల పట్ల సమాజం వ్యవహరిస్తున్న కపట వైఖరిని, పురుషాధిక్య ఆలోచనలను సూటిగా ప్రశ్నిస్తూ ఆమె పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. నిత్యం మహిళలనే వేలెత్తి చూపే ఈ లోకపు కుళ్లు ఆలోచనా విధానాన్ని బట్టబయలు చేస్తూ సాగిన ఆమె మాటలు తీవ్ర చర్చకు తెరతీశాయి. మహిళల ప్రవర్తన, వారి ఆహార్యం చుట్టూనే సమాజం నియమ నిబంధనలు అల్లుతోందని, కానీ తప్పు చేస్తున్న పురుషులను ఎవరూ నిలదీయడం లేదని సమంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనం ఇప్పటికీ మార్పు తీసుకురాగలం’ అనే నినాదంతో ఆమె ఎత్తిచూపిన ముఖ్యాంశాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి:
సెక్స్ వర్కర్లను మాత్రమే హీనంగా చూసే ఈ సమాజం.. ఆ చీకటి వ్యాపారాన్ని పోషిస్తూ వారి వద్దకు వెళ్లే మగవాళ్లను, క్లయింట్లను ఎందుకు నిలదీయదని నిలదీశారు. భర్త వదిలేసినా లేదా దూరమైనా పిల్లలను ఒంటరిగా పెంచే తల్లుల శీలాన్ని ప్రశ్నించే లోకం.. కన్న బాధ్యతలను గాలికొదిలేసి తప్పించుకు తిరిగే తండ్రులను ఎందుకు సమాన స్థాయిలో నిలదీయడం లేదని ఎండగట్టారు. దారుణమైన అత్యాచారాలు జరిగినప్పుడు అకృత్యానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాల్సింది పోయి.. బాధితురాలి బట్టలు, ఆమె అర్ధరాత్రి ఎందుకు బయటకు వచ్చింది అనే అంశాలపై చర్చలు జరపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని వదిలేసి, ఆ అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తులపైనే నిందలు వేసే వికృత ధోరణి నేడు రాజ్యమేలుతోందని సమంత మండిపడ్డారు. సమాజంలో నిజమైన లింగ సమానత్వం రావాలంటే నిబంధనలు, నీతులు కేవలం స్త్రీలకే పరిమితం కాకూడదని, పురుషుల జవాబుదారీతనంపై కూడా సమాన స్థాయిలో ప్రశ్నలు రావాలని సమంత తన పోస్ట్ ద్వారా తేల్చిచెప్పారు. సామ్ పోస్ట్‌కి నెటిజన్ల మద్దతు రావడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.













