Mythri Shashi: ‘హనుమాన్’ నుంచి ‘కాంతార 2’ దాకా.. మాపై దైవానుగ్రహం ఉంది: మైత్రీ శశి

Mythri Shashi

Mythri Shashi: భక్తి, ఆధ్యాత్మిక నేపథ్యంతో వచ్చే అద్భుతమైన కథలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘హనుమాన్ అన్ష్’ తెలుగు ప్రెస్‌మీట్ వేదికగా ఆయన మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో దైవ సంకల్పం, భక్తి చిత్రాల ప్రాముఖ్యతపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ప్రయాణంలో దైవానుగ్రహం ఎప్పుడూ వెన్నంటే ఉంటోందని శశిధర్ రెడ్డి ఉద్వేగంగా వెల్లడించారు. తాము కార్యాలయం ప్రారంభించిన తర్వాత వరుసగా దైవిక నేపథ్యమున్న చిత్రాలే తమ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయని గుర్తుచేశారు. బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మొదలుకుని.. ‘ఆదిపురుష్’, ‘మిరాయ్’, ‘కాంతార 2’తో పాటు ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ వరకు అన్నీ భక్తి ప్రధానమైన చిత్రాలే తమ వద్దకు రావడం ఒక అద్భుతమైన దైవిక సంకేతమని ఆయన పేర్కొన్నారు.

ఈ సినిమా రైట్స్ తమకు దక్కడం వెనుక ఉన్న ఆసక్తికర ఆధ్యాత్మిక అనుభవాన్ని శశిధర్ రెడ్డి పంచుకున్నారు. “నేను గత 30 ఏళ్లుగా పూజిస్తున్న మా గురువుగారు శ్రీశ్రీ సద్గురు తాతయ్య స్వామి (వసుమతమ్మ) దర్శనార్థం శనివారం వెళ్తుండగా, మార్గమధ్యంలోనే హోంబలే ఫిలిమ్స్ నుంచి విజయ్ గారు, చలవగూడ గారు కాల్ చేసి ఈ సినిమాను మైత్రీ ద్వారా అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను అప్పగించడం నిజంగా దైవానుగ్రహమే” అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. హిందీలో ఇప్పటికే విశేష ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ నెల 9న విడుదలవుతున్న సందర్భంగా నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. సెలవుల వేళ కుటుంబ సమేతంగా, పిల్లలతో కలిసి చూడదగ్గ అద్భుతమైన చిత్రమని, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఇంటికి వెళ్లేటప్పుడు ఎంతో కొంత మంచి సందేశాన్ని తీసుకువెళ్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.