
Katrina Kaif: సెలబ్రిటీల బాడీ షేమింగ్‌పై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల తల్లైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొన్నారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె రూపంపై కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తూ.. ‘ప్రసవం తర్వాత బాగా బరువు పెరిగింది’ అంటూ ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై కత్రినా నేరుగా స్పందించకపోయినా, పరోక్షంగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలను పట్టించుకుంటూ పోతే బతకలేమని కత్రినా తేల్చిచెప్పారు. “సోషల్ మీడియాలో వేల రకాల అభిప్రాయాలు కనిపిస్తుంటాయి. ఎదుటివారు ఏమనుకుంటున్నారోనని ఆలోచిస్తూ పోతే మన ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనమే కోల్పోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి మాటకు తగ్గట్లుగా మారుతూ పోతే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేం” అని ఆమె కుండబద్దలు కొట్టారు.
జీవితంలో ఎదురయ్యే దశలను, శరీరంలో వచ్చే మార్పులను స్వాగతించాలని ఆమె పిలుపునిచ్చారు. “ప్రపంచం మనల్ని పొగిడే రోజులు ఉంటాయి, విమర్శించే సందర్భాలూ వస్తాయి. అందుకే ఎవరికి వారే సొంతంగా ఒక చీర్ లీడర్‌గా మారాలి. విమర్శలను చూసి భయపడి ఉంటే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. జీవితంలోని ప్రతి దశలో మనల్ని మనం అంగీకరించడం నేర్చుకోవాలి. ట్రోల్స్‌ను లైట్ తీసుకోవాలి, మనల్ని మనం మరీ సీరియస్‌గా ఊహించుకోకూడదు” అంటూ హితవు పలికారు. ప్రసవానంతరం మహిళల శరీరంలో వచ్చే సహజ మార్పులను ఎగతాళి చేసే వారికి కత్రినా ఇచ్చిన ఈ మెచ్యూర్డ్ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బాడీ షేమింగ్ చేసే వారికి ఆమె ఆలోచనాత్మకమైన సమాధానం ఇచ్చారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.














