
Jagan Mohan Reddy: సినీ రంగంలోకి అడుగుపెట్టే కొత్త నిర్మాతలకు అనుభవజ్ఞులు ఇచ్చే సలహాలు ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ఉంటాయి. తాజాగా ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ట్రైలర్ లాంచ్ వేదికగా నిర్మాత బి. జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తనను ఇండస్ట్రీలోకి రావద్దని తీవ్రంగా హెచ్చరించిన విషయాన్ని ఆయన ఓపెన్‌గా బయటపెట్టారు.
స్టేజీపై ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి.. “నందినీ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచే అక్కలాంటిది. నేను సినిమాలు తీస్తానంటే ఆమె ఏనాడూ ప్రోత్సహించలేదు. ‘నీకు మంచి యాడ్ ఏజెన్సీ నడుస్తోంది.. అక్కడ అద్భుతంగా రాణిస్తున్నావు. నీకెందుకురా ఈ సినిమా పిచ్చి? అనవసరంగా ఇక్కడికి వచ్చి నాశనమైపోతావు. అస్సలు రావద్దు’ అని చిలక్కి చెప్పినట్లు చెప్పింది” అంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. సొంత మనుషులు డైరెక్టర్లుగా ఉంటే ‘నాకు సినిమా ఇవ్వు’ అని అడుగుతారని, కానీ నందినీ రెడ్డి మాత్రం తన మంచి కోరి ఇండస్ట్రీ వద్దని గట్టిగా వారించిందని పేర్కొన్నారు. అయితే తన మొండితనంతోనే కథను నమ్మి ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లానని, చివరకు టీజర్ చూశాక ఆమె కూడా ‘నువ్వు కొడుతున్నావురా’ అంటూ అభినందించిందని చెప్పారు.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన తరుణ్ భాస్కర్ ఎంపిక వెనుక జరిగిన ఆసక్తికర డ్రామాను కూడా ఆయన పంచుకున్నారు. “స్క్రిప్ట్ అంతా సెట్ అయ్యాక తరుణ్ సడన్‌గా ఫోన్ చేసి.. ‘నాకు డైరెక్షన్ టెన్షన్లు ఉన్నాయి, మీమ్స్ వస్తున్నాయి.. నేను చేయలేను సార్’ అని తప్పుకున్నాడు. దర్శకుడు బద్రి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఏం చేయాలో తోచక భార్యతో కలిసి తిరుపతి వెళ్లాను. గడప ముందు కూర్చుని ప్రత్యేక పూజలు ముగించుకుని బయటకు రాగానే.. సరిగ్గా తరుణ్ నుంచి ఫోన్ వచ్చింది. ‘సార్.. నేను క్యారెక్టర్ చేస్తున్నాను’ అని చెప్పాడు. ఆ క్షణంలో వచ్చిన ఊరట మాటల్లో చెప్పలేనిది” అని నాటి ఉత్కంఠను వివరించారు.
అంతేకాకుండా నరేష్, అనుపమ పరమేశ్వరన్ ప్రాజెక్ట్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారని, ముఖ్యంగా అనుపమ అప్డేట్స్ కోసం ఫోన్ చేస్తుంటే తన భార్యకు కూడా భయపడనంత టెన్షన్ పడేవాడినని చమత్కరించారు. దిల్ రాజు, బన్నీ వాస్ వంటి పెద్దల సహకారంతో అక్టోబర్ 16న సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు వెల్లడించారు.














