Poorna: రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్.. కలలో కూడా ఊహించలేదు: పూర్ణ

Poorna

Poorna: బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ భారీ బ్లాక్‌బస్టర్ విజయంలో భాగస్వామి అయినందుకు ప్రముఖ నటి పూర్ణ (షమ్నా ఖాసిమ్) తన సంతోషాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ చిత్రంలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుండటంతో, సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ తన మనసులోని మాటలను బయటపెట్టారు.

చిన్నప్పటి నుంచి రజనీకాంత్‌కు వీరాభిమానినైన తనకు, ఏకంగా ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదని పూర్ణ చెప్పుకొచ్చారు. “రజనీ సార్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవాలని సినీ రంగంలో ప్రతి ఒక్కరూ కలలు కంటారు. నేను ఏళ్ల తరబడి ఆయనకు వీరాభిమానిని. ఆయన నటించిన ‘నరసింహ’ (పడయప్ప) నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. అలాంటిది ‘జైలర్ 2’ లాంటి భారీ పాన్-ఇండియా చిత్రంలో ఇంత క్రేజీ సాంగ్‌లో కనిపించే ఛాన్స్ దక్కడం నిజంగా నా అదృష్టం. కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా తగిన గుర్తింపు వస్తుందని అందరూ అంటుంటారు.. నా విషయంలో ఇప్పుడు అదే నిజమైంది” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

‘జైలర్ 2’ సినిమాలో వచ్చే ‘అల బోలెలో’ అనే ప్రత్యేక సాంగ్‌లో పూర్ణ వేసిన మాస్ స్టెప్పులు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి కృతజ్ఞతలు చెప్పేందుకే ఇన్ని రోజులు ఎదురుచూశానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్, అదిరిపోయే బీట్స్ అందించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌కు పూర్ణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పూర్ణ పంచుకున్న ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.