yellamma: దేవిశ్రీప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Yellamma glimpse

yellamma: తనదైన మ్యూజిక్‌తో థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వకుండా చిందులేయించిన రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఇప్పుడు హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యారు. ‘బలగం’ చిత్రంతో తెలంగాణ మట్టి వాసనను, పల్లె ఎమోషన్లను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి సంచలనం సృష్టించిన దర్శకుడు వేణు ఎల్దండి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటంతో మొదటి నుంచే దీనిపై భారీ అంచనాలున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇస్తూ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 5న ‘ఎల్లమ్మ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ ‘పర్షి’ అనే పవర్‌ఫుల్ పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు స్టేజ్ పైన, పాటల్లో స్టైలిష్‌గా గెంతులేస్తూ కనిపించిన డీఎస్పీ.. ఈ సినిమాలో పూర్తి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో డీగ్లామర్, ఇంటెన్స్ రోల్‌లో మెప్పించబోతుండటం విశేషం. సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడిన కథాంశంతో, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ వేణు ఎల్దండి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరోగా నటించడమే కాకుండా, తన చిత్రానికి రాక్‌స్టార్ స్వయంగా సంగీతాన్ని అందిస్తుండటం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాణంలో, అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో పాన్-ఇండియా లెవెల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బలగం’ లాంటి క్లాసిక్ తర్వాత వేణు ఎల్దండి మార్క్ దర్శకత్వం, దేవిశ్రీప్రసాద్ హీరోగా తెరంగేట్రం.. ఈ రెండూ తోడవడంతో బాక్సాఫీస్ వద్ద ‘ఎల్లమ్మ’ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.