
Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్. ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లేశ్వరి’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తర్వాత దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరూ మళ్లీ చేతులు కలిపారు. అయితే ఈసారి కేవలం ఫ్యామిలీ కామెడీతో మాత్రమే కాకుండా.. ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ అంటూ ఊహించని యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేదికపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా యంగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ రెడ్డి కొట్టే సిక్సర్లను ప్రస్తావిస్తూ సినిమా ఫలితంపై భారీ ధీమా వ్యక్తం చేశారు. “అక్కడ వాళ్లు సిక్సర్లు కొట్టడం కాదు.. అక్టోబర్ 30న థియేటర్లలో ఈ సినిమాతో స్టేడియం బయట పడేలా సిక్సర్లు, సెంచరీలు కొట్టబోతున్నాం!” అంటూ ఫ్యాన్స్‌లో అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. గతంలో వచ్చిన క్లాసిక్ సినిమాల ప్రభావం వల్ల మళ్లీ తమ కాంబోలో సినిమా అనగానే తీవ్రమైన ఒత్తిడి ఉండేదని వెంకటేష్ స్వయంగా ఒప్పుకున్నారు. కేవలం నవ్వులు మాత్రమే కాకుండా, ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే సస్పెన్స్, అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న పూర్తి స్థాయి కథతో త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలిపారు.
“నేను ఎన్నో కుటుంబ కథా చిత్రాలు చేశాను. ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘వసంతం’ సినిమాల్లో ప్రేమిస్తూ, కలిసి ఉందాం రా అన్నాను. కానీ ఈ సినిమా వాటన్నింటికంటే చాలా భిన్నం. ఏం జరిగినా సరే నా కుటుంబాన్ని నేనే కాపాడుకోవాలనే ఒక వ్యక్తి పోరాటమే ఈ ‘ఆదర్శ కుటుంబం'” అని సినిమా మూల కథను రివీల్ చేశారు. సినిమా ఫలితాలపై తనకున్న నిర్లిప్తతను, జీవితం పట్ల తన దృక్పథాన్ని కూడా వెంకీ మరోసారి గుర్తుచేశారు. “సినిమా ఆడినా ఆడకపోయినా నేను రోజూ ఉదయం లేవగానే అందరూ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని మెడిటేట్ చేస్తాను. రిస్క్‌లు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ మనం మంచిని కోరుకుంటూ ముందుకు సాగాలి” అంటూ తనదైన ఆధ్యాత్మిక శైలిలో మాట్లాడారు.
వేదికపై ఉన్న త్రివిక్రమ్ సైతం స్పందిస్తూ.. “చాలామంది కర్మణ్యేవాధికారస్తే అని చదువుతారు, కానీ వెంకటేష్ గారు దాన్ని నిత్య జీవితంలో ఆచరిస్తారు. మనం పేపర్ రాశాం, మార్కులు భగవంతుడే వేస్తాడనే మైండ్‌సెట్ ఆయనది” అని ప్రశంసించారు. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్న తుఫాను ప్రభావం నుంచి ప్రజలంతా క్షేమంగా బయటపడాలని వెంకటేష్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.














