
Varanasi Remuneration: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తారనే విషయం తెలిసిందే. ‘వారణాసి’ విషయంలోనూ ఆయన డైరెక్ట్ రెమ్యునరేషన్‌కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారని కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు, ఆయనకు ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను రెమ్యునరేషన్‌గా ఇచ్చినట్లు కూడా కొన్ని కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ రైట్స్ వ్యాల్యూ సుమారు రూ.160 కోట్లకు పైగా ఉంటుందని టాక్. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు.
మహేశ్ బాబు రెమ్యునరేషన్ విషయంలోనూ భిన్నమైన సమాచారం బయటకు వస్తోంది. కొన్ని రిపోర్టుల ప్రకారం.. ఆయనకు భారీ పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కథనాలు మహేశ్‌కు దాదాపు రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ దక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరో రిపోర్ట్ ప్రకారం, ఆయన సంవత్సరానికి రూ.50 కోట్ల చొప్పున పారితోషికంతో పాటు 20 శాతం లాభాల్లో వాటా తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన మొత్తం రెమ్యునరేషన్ రూ.250 కోట్లకు మించే అవకాశం ఉందని అంచనా. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ‘వారణాసి’కి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆయనకు ఈ సినిమా రెమ్యునరేషన్ కింద పూర్తి మ్యూజిక్ రైట్స్ దక్కినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘వారణాసి’ని రాజమౌళి గ్లోబల్ స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 120కి పైగా దేశాల్లో విడుదల కానుందని సమాచారం. అంతేకాకుండా సుమారు 50 భాషల్లో డబ్బింగ్ చేసేందుకు 1,500 మంది వాయిస్ ఆర్టిస్టులను ఆడిషన్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మహేశ్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ‘వారణాసి’.. రెమ్యునరేషన్, గ్లోబల్ రిలీజ్, సాంకేతిక ప్రమాణాల పరంగా కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రెమ్యునరేషన్ గణాంకాలకు అధికారిక ముద్ర పడాల్సి ఉంది.













