AA22: అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతి..?

Vijay setupati, allu arjun

AA22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భారీ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఇందులో విజయ్ సేతుపతి కూడా నటించనున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. తమిళంలో పాపులర్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఉప్పెనలో హీరోయిన్ కృతి శెట్టి తండ్రిగా ఆయన చేసిన పాత్ర గుర్తుండిపోయేలా నిలిచింది. తమిళంలో హీరోగా చేస్తూనే, కీలక పాత్రల్లోనూ మెప్పించారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారని సమాచారం.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

దర్శకుడు అట్లీ కుమార్ స్వయంగా విజయ్ సేతుపతిని కలసి ఈ స్పెషల్ క్యారెక్టర్ గురించి చెప్పారట. ఇద్దరి మధ్య ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ జవాన్లో షారుఖ్ ఖాన్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి నటించగా, ఆ క్యారెక్టర్ ఆయనకు భారీ క్రేజ్ తీసుకువచ్చింది. ఇప్పుడు అదే క్రేజ్‌ని అల్లు అర్జున్ సినిమా ద్వారా మరింత పెంచాలని అట్లీ భావిస్తున్నారని టాక్. ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా దీపికా పదుకోన్ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. దీపికతో పాటు మరో ఇద్దరు హీరోయిన్‌ల పాత్రల కోసం మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అదనంగా, ‘పుష్ప’లో బన్నీ సరసన నటించిన రష్మిక మందన్నాను విలన్ రోల్ కోసం సంప్రదించినట్లు వినిపిస్తోంది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ప్రస్తుతం సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. దీపికా పదుకోన్ ప్రత్యేకంగా 100 రోజులు డేట్స్ కేటాయించారని టాక్. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ కంపెనీలు వీఎఫ్ఎక్స్ పనులు నిర్వహిస్తున్నాయి. షూటింగ్ మొదలుకాకముందే అల్లు అర్జున్, అట్లీ లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ టీమ్‌లతో డిస్కషన్స్ జరిపారు. మొత్తానికి – అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్లో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ మరింత క్రేజ్ తెచ్చిపెట్టేలా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.