Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’కు బిగ్ షాక్.. ప్రాజెక్ట్‌ నుంచి జియో స్టూడియోస్ ఔట్?

Brahmastra

Brahmastra 2: బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ‘బ్రహ్మాస్త్ర 2’ ఒకటి. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌ ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ప్రాజెక్ట్‌కు జియో స్టూడియోస్‌ దూరమైనట్లు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాకు కొత్త స్టూడియో పార్ట్‌నర్ కోసం అయాన్ ముఖర్జీ టీమ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే జియో స్టూడియోస్‌ అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు ఎలాంటి ప్రకటన బయటికి రాలేదు. ‘బ్రహ్మాస్త్ర 2’ను ఫస్ట్ పార్ట్ కంటే మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్‌ సుమారు రూ.550 కోట్ల వరకు ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి.

హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ‘రామాయణ’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత 2027 ఏప్రిల్‌లో ‘బ్రహ్మాస్త్ర 2’ షూటింగ్‌ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమాలో రణ్‌బీర్ శివతో పాటు దేవ్ పాత్రలోనూ కనిపించనున్నట్లు సమాచారం. ఆలియా భట్‌ ఇషా పాత్రలో నటించనున్నారు. ఇక అమృత పాత్ర కోసం దీపికా పదుకొణెతో అయాన్ ముఖర్జీ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీపికా టీమ్‌ ‘బ్రహ్మాస్త్ర 2’లో ఆమె నటించడం లేదని స్పష్టం చేసింది. దీంతో ఆమె పాత్రకు సంబంధించి వస్తున్న వార్తలు ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారాయి. జియో స్టూడియోస్‌ విషయంలో వచ్చిన తాజా వార్తలు ‘బ్రహ్మాస్త్ర 2’ నిర్మాణ ప్రయాణం ఎలా కొనసాగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.