
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ శివారులో తన కలల ఫామ్‌హౌస్‌ను నిర్మించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చెవెళ్ల – మోకిల ప్రాంతాల మధ్య, హైదరాబాద్ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదు ఎకరాల స్థలంలో ఈ అత్యాధునిక ఫామ్‌హౌస్‌ను నిర్మించినట్లు సమాచారం. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లు ఆమిర్, హమీదా శర్మ ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆధునిక సౌకర్యాలతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేలా నిర్మించిన ఈ ఫామ్‌హౌస్ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే గృహప్రవేశ వేడుక నిర్వహించే అవకాశముందని సమాచారం. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సమయం గడిపేందుకు, నగర రద్దీకి దూరంగా విశ్రాంతి తీసుకునేందుకు ఈ ఫామ్‌హౌస్‌ను ప్రత్యేకంగా నిర్మించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా ఈ ఫామ్‌హౌస్‌లో సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. సహజసిద్ధమైన వాతావరణంలో పండ్లు, కూరగాయలు సాగు చేయడంతో పాటు కుటుంబ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫామ్‌హౌస్‌ను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల కోసం ప్రైవేట్ రిట్రీట్‌గా ఉపయోగించనున్నారని కూడా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తన నెక్ట్స్ సినిమాలపై పూర్తి స్థాయి దృష్టి పెడుతూనే, వ్యక్తిగత జీవితంలో ప్రకృతికి దగ్గరగా ఉండే జీవనశైలిని ఎంచుకుంటున్నారనే వార్త అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఫామ్‌హౌస్ నిర్మాణం, గృహప్రవేశానికి సంబంధించిన వివరాలపై ఇప్పటివరకు రామ్ చరణ్ లేదా ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.














